గోదావరికి మళ్లీ వరద

ABN , First Publish Date - 2020-09-03T10:46:56+05:30 IST

గోదావరి మరో సారి ఉగ్ర రూపం దాల్చింది. ఎగువన మహారాష్ట్రలోని గోసిఖుర్ధా, వెన్‌గంగాపై నిర్మించిన చిఛ్చోడా బ్యారేజీ గేట్లు ఎత్తడంతో

గోదావరికి మళ్లీ వరద

  • కాళేశ్వరం వద్ద ఉగ్రరూపం
  • మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌: గోదావరి మరో సారి ఉగ్ర రూపం దాల్చింది. ఎగువన మహారాష్ట్రలోని గోసిఖుర్ధా, వెన్‌గంగాపై నిర్మించిన చిఛ్చోడా బ్యారేజీ గేట్లు ఎత్తడంతో భారీగా ప్రవాహం వస్తోంది. కాళేశ్వర త్రివేణి సంగమం వద్ద 12.29 మీటర్ల ఎత్తున గోదావరి ప్రవహిస్తుండటంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.  కాళేశ్వరంలో పుష్కరఘాట్లు పూర్తిగా మునిగిపోయాయి. సమీప గ్రామాల్లో పంటలు నీట మునిగాయి. బుధవారం మేడిగడ్డ బ్యారేజీలోకి 9.80 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా 75 గేట్లు ఎత్తి అంతే నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.


భద్రాచలం వద్ద బుధవారం ఉదయం 40.4 అడుగుల మేర ఉన్న గోదావరి.. సాయంత్రానికి 41.6 అడుగులకు చేరుకుంది. గురువారం ఉదయానికి 43 అడుగులకు చేరే అవకాశం ఉందని సీడబ్ల్యూసీ అధికారులు అంచనా వేస్తున్నారు. మహారాష్ట్రలోని జైక్వాడ్‌ ప్రాజెక్టుకు వరద పోటెత్తుతున్న నేపథ్యంలో శ్రీరామసాగర్‌కు ఏ క్షణమైనా వరద పోటెత్తే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. కృష్ణాలో నాగార్జునసాగర్‌ నీటి మట్టం క్రమంగా తగ్గుతోంది. కాగా వరద కాల్వ ద్వారా సూరమ్మ చెరువుకు నీటిని తరలించి 60 వేల ఎకరాలకు సాగు సౌకర్యం కల్పించనున్నారు. సీఎం కేసీఆర్‌ సూచన మేరకు ఇందుకు సంబంధించి ప్రతిపాదనలను అధికారులు సిద్ధం చేశారు. 

Updated Date - 2020-09-03T10:46:56+05:30 IST