టీపీసీసీ అధ్యక్షుడిగా అవకాశం ఇవ్వండి
ABN , First Publish Date - 2020-08-11T08:53:00+05:30 IST
టీపీసీసీ అధ్యక్షుడిని మార్చాలనుకుంటే.. తనకు అవకాశం ఇవ్వాలని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలకు ఎమ్మెల్యే జగ్గారెడ్డి విజ్ఞప్తి చేశారు.

సోనియా, రాహుల్‌కు ఎమ్మెల్యే జగ్గారెడ్డి విజ్ఞప్తి
ఢిల్లీకి వెళ్లి పైరవీలు చేసే ఆలోచన లేదని వ్యాఖ్య
హైదరాబాద్, ఆగస్టు 10(ఆంధ్రజ్యోతి): టీపీసీసీ అధ్యక్షుడిని మార్చాలనుకుంటే.. తనకు అవకాశం ఇవ్వాలని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలకు ఎమ్మెల్యే జగ్గారెడ్డి విజ్ఞప్తి చేశారు. తనకు అవకాశం ఇస్తే సీనియర్ నేతల సహకారంతో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. గ్రామస్థాయి నుంచి కార్యకర్తలను సమన్వయం చేసుకుంటానని, అవసరమైతే గ్రామాల్లోనూ పర్యటిస్తానని పేర్కొన్నారు. అయితే, పీసీసీ అధ్యక్ష పదవి కోసం ఢిల్లీకి వెళ్లి పైరవీలు చేసే ఆలోచన తనకు లేదని, పార్టీ శ్రేయోభిలాషులు, నేతలు ఎవరైనా తన మాటలను సోనియా, రాహుల్ దృష్టికి తీసుకెళ్లి సహకరించాలని కోరారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ టీపీసీసీ నూతన అధ్యక్షుడి నియామకం గురించి ఢిల్లీలో చర్చ జరుగుతున్న మాట వాస్తవమేనని, ఆ పదవిని అడుగుతున్నవారిలో తాను ఒకడినని చెప్పారు. తన బయోడేటాను ఇప్పటికే సోనియా, రాహుల్‌కు పంపానని వెల్లడించారు. ‘‘నా స్టేట్మెంట్ల విషయంలో ఎవరూ గందరగోళ పడొద్దు. ప్రతి దాని వెనుక ఒక వ్యూహం ఉంటుంది. సమయం వచ్చినప్పుడు అది అందరికీ తెలుస్తుంది. నా వ్యక్తిత్వం గురించి తెలియక టీఆర్ఎస్ కోవర్టునంటూ సోషల్ మీడియా వేదికగా కొందరు ప్రచారం చేస్తున్నారు’’అని మండిపడ్డారు. ఉద్యమ సమయంలో కేసీఆర్ పేరు ఎత్తడానికే చాలా మంది భయపడేవారని, అప్పట్లోనే తాను కేసీఆర్‌పై మాట్లాడానని గుర్తు చేశారు. ఇప్పుడు చాలా మంది కేసీఆర్, కేటీఆర్‌పై మాట్లాడుతున్నారని, వారి కోసం ఫేసుబుక్లూ పని చేస్తున్నాయని వ్యంగ్యంగా అన్నారు. ‘‘మీకు ఎవరిపైనైనా ప్రేమ ఉంటే వారి భజన చేయండి. నా గురించి తెలుసుకోకుండా పిచ్చిగా మాట్లాడొద్దు. నా వ్యక్తిత్వాన్ని అనుమానిస్తున్న వారికి ఇది హెచ్చరిక’’ అని పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్ణయాల్లో కొన్నింటిని సమర్థించడం, కొన్నింటిని విమర్శించడం చేస్తుంటామని.. వాటిని దీర్ఘకాలిక ఆలోచనతో చేస్తున్న వ్యాఖ్యలుగా చూడాలన్నారు. సోషల్ మీడియాలో తన వ్యక్తిత్వంపై విమర్శలు చేసే వారు.. పేరు, ఫోన్ నంబరు పేర్కొంటే, వారి ఇంటికి వెళ్లి మరీ అనుమానాలు నివృత్తి చేస్తానన్నారు. ‘‘జగ్గారెడ్డి వ్యక్తిత్వం ఏమిటో కేసీఆర్ సహా చాలా మందికి తెలుసు. జగ్గారెడ్డి అమ్ముడు పోతడా? క్యారెక్టర్ ఏంటి? అన్నది కేవీపీ, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డిలను అడిగి తెలుసుకోండి. అంతే కానీ.. మీ అభిమాన నాయకుల కోసం నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేయవద్దు’’ అని సూచించారు.