జీహెచ్ఎంసీ వార్నింగ్.. తప్పుడు ప్రచారం చేశారో..!

ABN , First Publish Date - 2020-12-29T11:51:49+05:30 IST

నెలల తరబడి బిల్లులు చెల్లించడం లేదు. పెండింగ్‌ బిల్లులు చెల్లించకుంటే పనులు నిలిపివేస్తామన్న కాంట్రాక్టర్ల అల్టిమేటం.. ఖజానా ఖాళీ అయ్యిందన్న ప్రచారం నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ

జీహెచ్ఎంసీ వార్నింగ్.. తప్పుడు ప్రచారం చేశారో..!

హైదరాబాద్‌ : నెలల తరబడి బిల్లులు చెల్లించడం లేదు. పెండింగ్‌ బిల్లులు చెల్లించకుంటే పనులు నిలిపివేస్తామన్న కాంట్రాక్టర్ల అల్టిమేటం.. ఖజానా ఖాళీ అయ్యిందన్న ప్రచారం నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ స్పందించింది. సంస్థ ఆర్థిక పరిస్థితికి ఢోకా లేదని, కొవిడ్‌-19, ఇతర ఇబ్బందులున్నా.. ఖజానాపై చెప్పుకోదగ్గ ప్రభావం పడలేదని స్పష్టం చేశారు. బిల్లుల చెల్లింపులో తీవ్ర జాప్యం జరుగుతోందన్న ఆరోపణల్లో వాస్తవం లేదని, ఇలాంటి తప్పుడు ప్రచారం చేసే కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్టులో పెడ్తామని హెచ్చరించారు. ఈ మేరకు సోమవారం ప్రకటన విడుదల చేశారు. ఎస్‌ఆర్‌డీపీ, సీఆర్‌ఎంపీ, రెండు పడకల ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి రూ.1,102.17 కోట్ల బిల్లులు చెల్లించాల్సి ఉండగా... సెప్టెంబర్‌ 11వ తేదీ నాటికి రూ.909.17 కోట్లు చెల్లించామని పేర్కొన్నారు. సెప్టెంబర్‌ 11 నుంచి నవంబర్‌ 30వ తేదీ వరకు కేవలం రూ.193.54 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. దేశంలోని ఇతర మునిసిపాల్టీల కంటే జీహెచ్‌ఎంసీకి ఆర్థికపరమైన నిర్వహణ, పరిపాలన విషయంలో మెరుగైన ట్రాక్‌ రికార్డు ఉందన్నారు. కొవిడ్‌-19 ప్రభావంతో పట్టణ ప్రణాళికా విభాగం ఆదాయం తగ్గినా.. లాక్‌డౌన్‌ సమయంలో వంతెనలు, జంక్షన్ల అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తి చేశామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్‌ నుంచి నవంబర్‌ వరకు రూ.564.92 కోట్ల నిధులు జీహెచ్‌ఎంసీకి విడుదల చేసిందని, మార్చి వరకు ప్రతినెలా రూ.78 కోట్ల చొప్పున రూ.312 కోట్లు ఇస్తోందన్నారు. సంస్థ ఆదాయం, బిల్లుల చెల్లింపునకు సంబంధించి ఉద్దేశపూర్వక తప్పుడు ప్రచారం చేసే కాంట్రాక్టర్లను బ్లాక్‌ లిస్టులో పెడ్తామని, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Updated Date - 2020-12-29T11:51:49+05:30 IST