ఇంటి ముందు కాకుంటే.. ఇసుక, కంకర ఎక్కడ వేయాలి?

ABN , First Publish Date - 2020-02-08T05:30:00+05:30 IST

‘కొత్త మునిసిపల్‌ చట్టం ప్రకారం.. ఎవరైనా ఇళ్లముందు ఇసుక, కంకర పోసినా జరిమానా విధించాలి. ఈ విషయంలో ఎంతటివారైనా వదిలిపెట్టేది లేదు. కొత్త చట్టాన్ని కఠినంగా అమలు చేస్తాం.’ అని కొంత కాలంగా మంత్రి కేటీఆర్‌ పదే పదే హెచ్చరిస్తూ ఉన్నారు. అయితే ఇళ్ల ముందు కంకర, ఇసుక పోస్తే జరిమానా ఎలా విధిస్తారంటూ

ఇంటి ముందు కాకుంటే.. ఇసుక, కంకర ఎక్కడ వేయాలి?

  • ‘కొత్త మునిసిపల్‌ చట్టం ప్రకారం.. ఎవరైనా ఇళ్లముందు ఇసుక, కంకర పోసినా జరిమానా విధించాలి. ఈ విషయంలో ఎంతటివారైనా వదిలిపెట్టేది లేదు. కొత్త చట్టాన్ని కఠినంగా అమలు చేస్తాం.’ అని కొంత కాలంగా మంత్రి కేటీఆర్‌ పదే పదే హెచ్చరిస్తూ ఉన్నారు. అయితే ఇళ్ల ముందు కంకర, ఇసుక పోస్తే జరిమానా ఎలా విధిస్తారంటూ జీహెచ్‌ఎంసీ కౌన్సిల్‌ సమావేశంలో అధికార పార్టీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. కొత్త ఇల్లు ఎలా కట్టుకోవాలని ప్రశ్నించారు. జరిమానాల పేరిట ప్రజలను ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. ఇళ ముందు కాకుంటే మెటీరియల్‌ను ఎక్కడ వేయాలని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ప్రశ్నించారు. శనివారం జరిగిన కౌన్సిల్‌ సమావేశంలో 2020-21 ఆర్ధిక సంవత్సరం బడ్జెట్‌, 2019-20 సవరణ బడ్జెట్‌పై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌, విజిలెన్స్‌, విపత్తుల నిర్వహణ (ఈవీడీఎం) విభాగం తీరుపై పార్టీలకతీతంగా సభ్యులు మండిపడ్డారు. వేసిన జరిమానాలను రద్దు చేయాలని ముక్తకంఠంతో నినదించారు. జీహెచ్‌ఎంసీలో ఈవీడీఎం డైరెక్టర్‌ పోస్టు ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించారు. ‘ఐపీఎస్‌ అధికారి అయిన ఆయన దాదాగారి, గూండాగిరి ఇక్కడ చెల్లదు’ అని వ్యాఖ్యానించారు. విజిలెన్స్‌ విభాగంలోనే చాలా అవినీతి జరుగుతున్నదని ఆరోపించారు. ఈవీడీఎంను రద్దు చేయాలని, ఆ అధికారిని సరెండర్‌ చేస్తూ కౌన్సిల్‌లో తీర్మానం చేయాలని జాఫర్‌ హుస్సేన్‌ డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలో ఈవీడీఎం డైరెక్టర్‌ విశ్వజిత్‌ కంపాటి మాట్లాడే ప్రయత్నం చేయగా.. మజ్లిస్‌ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. స్పందించిన మేయర్‌ బొంతు రామ్మోహన్‌.. ‘ఈవీడీఎం డైరెక్టర్‌ నియామకం ప్రభుత్వ స్థాయిలో జరిగింది. నేనో, కమిషనరో తీసుకున్న నిర్ణయం కాదు. జీహెచ్‌ఎంసీ చట్టం ప్రకారమే జరిమానాలు వేస్తున్నారు. దీనిని సమీక్షించి తగిన నిర్ణయం తీసుకుందాం’ అని పేర్కొన్నారు. జీహెచ్‌ఎంసీ చట్టంలో లేకున్నా ఓ వ్యక్తి కోసం ప్రభుత్వం ప్రత్యేక విభాగం ఎలా ఏర్పాటు చేసిందని ఎమ్మెల్సీ జాఫ్రీ ప్రశ్నించారు. ఈవీడీఎం డైరెక్టర్‌ నియామకం అక్రమమని, వెంటనే ఆయనను మాతృ సంస్థకు పంపాలన్నారు.


పరిమిత స్థాయిలో జరిమానాలుండాలి: ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి

ఇళ్లముందు పికో ఫాల్స్‌ కుట్టబడును అని ఉన్న బోర్డులకూ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సిబ్బంది వేల రూపాయల జరిమానా వేస్తున్నారని, పేదలను ఇబ్బంది పెట్టొద్దని కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డి అన్నారు. ఇళ్లు కట్టుకునే వాళ్లు ఇటుకలు, కంకరను ఇంటి ముందు కాకుండా ఎక్కడ వేయాలో అధికారులు చెప్పాలని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. పరిమిత స్థాయిలో జరిమానా విధిస్తే బాగుంటుందని సూచించారు.

Updated Date - 2020-02-08T05:30:00+05:30 IST