ఆ భేటీ తరువాత గ్రేటర్ ఎన్నికలపై నిర్ణయం..!

ABN , First Publish Date - 2020-09-16T12:07:57+05:30 IST

గ్రేటర్‌ ఎన్నికల నిర్వహణ దిశగా జీహెచ్‌ఎంసీలో కసరత్తు మొదలైంది. పది రోజుల క్రితమే ప్రభుత్వంలోని ఉన్నత స్థాయి అధికారుల ఆదేశాల మేరకు బల్దియా

ఆ భేటీ తరువాత గ్రేటర్ ఎన్నికలపై నిర్ణయం..!

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి): గ్రేటర్‌ ఎన్నికల నిర్వహణ దిశగా జీహెచ్‌ఎంసీలో కసరత్తు మొదలైంది. పది రోజుల క్రితమే ప్రభుత్వంలోని ఉన్నత స్థాయి అధికారుల ఆదేశాల మేరకు బల్దియా ఎన్నికల విభాగం వివరాలు పంపినట్టు తెలిసింది. ప్రస్తుత ఓటర్లు ఎంతమంది, బీసీ ఓటర్ల గణన, రిజర్వేషన్ల ఖరారు, ఇతరత్రా పనులు పూర్తి చేసి ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్ని రోజులు పడుతుందని ఉన్నతాధికారులు అడిగారు. డివిజన్ల పునర్విభజన చేయడానికి ఎంత సమయం పడుతుంది..? ఏ ప్రాతిపదికన చేస్తారనే వివరాలూ తీసుకున్నట్టు సమాచారం. ప్రస్తుతానికి పునర్విభజన ప్రతిపాదన పక్కన పెట్టగా.. కరోనా నియంత్రణ, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకొని ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్నారు.  వారంలో ఎన్నికల సంఘం కూడా జీహెచ్‌ఎంసీ అధికారులతో సమావేశమయ్యే అవకాశాలున్నాయని ఓ అధికారి తెలిపారు. మూడు, నాలుగు రోజుల క్రితమే సమావేశానికి సంబంధించి మౌఖిక సమాచారం అందిందని, త్వరలో అధికారికంగా తేదీ ఖరారయ్యే అవకాశముందని ఆయన చెప్పారు. ప్రభుత్వానికి పంపిన వివరాలతోపాటు ఇతరత్రా సమాచారం కూడా సిద్ధంగా పెట్టుకున్నామని, ఎన్నికల సంఘం అడిగితే వివరాలతో సహా సమావేశానికి వెళ్తామన్నారు.


ఎన్నికల మూడ్..

ప్రస్తుత పాలకమండలి గడువు 2020 ఫిబ్రవరి 10వ తేదీతో ముగియనుంది. జీహెచ్‌ఎంసీ యాక్ట్‌ సెక్షన్‌ 6, 7 ప్రకారం ప్రభుత్వం కోరుకుంటే గడువుకు మూడు నెలల ముందు ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. దీనిని షెడ్యూల్‌ ప్రకారం జరిగే ఎన్నికలుగానే పరిగణిస్తారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయి ఫలితాలు ప్రకటించినా, ఇప్పటి పాలకమండలి గడువు ముగిసిన అనంతరమే కొత్త పాలకమండలి కొలువు దీరుతుంది. అభివృద్ధి పనులు వేగవంతం చేయడం, వరుస సమీక్షలతోపాటు పార్టీ అంతర్గత సమావేశాల్లో ఎన్నికలు ఉంటాయని అధికార పక్షం పరోక్ష సంకేతాలనిస్తోంది. దీంతో గ్రేటర్‌లోని ప్రధాన పార్టీల్లో ఎన్నికల మూడ్‌ వచ్చేసింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎస్‌ఈసీతో సమావేశం అనంతరం కొంత స్పష్టత వస్తుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన అధికారి సాధారణ సమావేశం నిర్వహిస్తారా..? లేదా ? గ్రేటర్‌ ఎన్నికలకు సంబంధించిన చర్చ ఉంటుందా..? అన్నది మీటింగ్‌ తరువాతే తేలనుంది. డిసెంబర్‌ చివరి వారం లేదా జనవరి మొదటి వారంలో ఎన్నికలు జరగవచ్చని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. లేనిపక్షంలో సంక్రాంతి తరువాత జనవరి చివరి లేదా కిందటిసారి లానే ఫిబ్రవరి మొదటి వారంలో ఎన్నికలు ఉండవచ్చు.

Updated Date - 2020-09-16T12:07:57+05:30 IST