‘పతంగి’తో పరేషాన్‌!

ABN , First Publish Date - 2020-12-10T10:11:22+05:30 IST

జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాలు అధికార టీఆర్‌ఎస్‌ పార్టీలో గుబులు రేపుతున్నాయి. గ్రేటర్‌లో మారిన రాజకీయ సమీకరణాలు తెలంగాణ అంతటా విస్తరిస్తే ఎలా? అన్న చర్చ జరుగుతోంది. మజ్లి్‌సతో స్నేహబంధం విషయంలో తమ పరిస్థితి ‘ముందు నుయ్యి.. వెనుక గొయ్యి’లా ఉందని పలువురు టీఆర్‌ఎస్‌ ముఖ్యులు

‘పతంగి’తో పరేషాన్‌!

టీఆర్‌ఎ్‌సలో గ్రేటర్‌ ఫలితాల గుబులు.. పాత స్థానాలు నిలబెట్టుకున్న మజ్లిస్‌

కమల దళానికి భారీ ప్రయోజనం

నష్టపోయింది మాత్రం టీఆర్‌ఎస్సే

మజ్లిస్‌, బీజేపీ భావోద్వేగ ప్రచారాలే కారణం

అభిప్రాయపడుతున్న అధికార పార్టీ నేతలు

భవిష్యత్తుపై ‘గులాబీ’ దళంలో ఆందోళన


హైదరాబాద్‌, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాలు అధికార టీఆర్‌ఎస్‌ పార్టీలో గుబులు రేపుతున్నాయి. గ్రేటర్‌లో మారిన రాజకీయ సమీకరణాలు తెలంగాణ అంతటా విస్తరిస్తే ఎలా? అన్న చర్చ జరుగుతోంది. మజ్లి్‌సతో స్నేహబంధం విషయంలో తమ పరిస్థితి ‘ముందు నుయ్యి.. వెనుక గొయ్యి’లా ఉందని పలువురు టీఆర్‌ఎస్‌ ముఖ్యులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల ‘గ్రేటర్‌’ ఎన్నికల్లో ‘కారు’ అతిపెద్ద పార్టీ హోదాను నిలబెట్టుకున్నప్పటికీ, ఆధిక్యం బాగా తగ్గిన విషయం తెలిసిందే. ఇందుకు బీజేపీ, మజ్లిస్‌ చేసిన భావోద్వేగ ప్రచారమే కారణమని చాలా మంది మంత్రులు, టీఆర్‌ఎస్‌ కీలక నేతలు బాహాటంగానే చెబుతున్నారు. హిందూత్వ అజెండాతో బీజేపీ విద్వేష వ్యాఖ్యలు చేస్తే, అంతే స్థాయిలో ముస్లిం అజెండాతో ఎంఐఎం వ్యాఖ్యలు చేయడం వల్ల మధ్యలో తాము దెబ్బతిన్నామని కూడా వారు ఆవేదన చెందుతున్నారు. 


విడదీయరాని అనుబంధం

రాష్ట్రంలోని ముస్లింలలో భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ, ఆ వర్గానికి మజ్లిస్‌ ప్రాతినిధ్యం వహిస్తోంది. 2014లో తెలంగాణలో తొలి ప్రభుత్వం ఏర్పడిన నాటినుంచి టీఆర్‌ఎస్‌, ఎంఐఎం మధ్య సఖ్యత కొనసాగుతోంది. మజ్లిస్‌ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ అనేక సందర్భాల్లో సీఎం కేసీఆర్‌కు అండగా నిలిచారు. అదే సమయంలో ఎంఐఎం తమ మిత్రపక్షమని సీఎం కేసీఆర్‌ కూడా అనేకమార్లు బహిరంగ వేదికలపైనే చెప్పారు. 2014 లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు మొదలు ఆ తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌, ఎంఐఎం ప్రత్యక్షంగా లేకపోతే పరోక్షంగా సహకరించుకున్నాయి. దీంతో రాష్ట్ర జనాభాలో దాదాపు 13 శాతం ఉన్న ముస్లింలు..అయితే ఎంఐఎం, లేకపోతే టీఆర్‌ఎస్‌ వైపు నిలుస్తారనే అభిప్రాయం స్థిరపడిపోయింది.


బీజేపీ దూకుడుతో ఇరుకునపడ్డ ఇరు పార్టీలు..

ఇటీవల గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల సందర్భంగా బీజేపీ ప్రదర్శించిన దూకుడుతో ఇటు టీఆర్‌ఎస్‌, అటు ఎంఐఎం ఇరుకున పడ్డాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎంఐఎంతో టీఆర్‌ఎస్‌ సంబంధాలను బీజేపీ ప్రధానంగా టార్గెట్‌ చేసుకొని విమర్శలు చేసింది. మెజార్టీ హిందూ సమాజాన్ని కాదనుకొని, ముస్లిం పార్టీ ఎంఐఎంతో టీఆర్‌ఎస్‌ అంటకాగుతోందంటూ కమలనాథులు విస్తృత ప్రచారం చేశారు. దీంతో ఉలిక్కిపడ్డ అధికార పార్టీ.. ఎంఐఎంతో తమ సాన్నిహిత్యాన్ని అంగీకరించకుండా, ఆ పార్టీతో పొత్తు లేదంటూ కొత్త పల్లవి అందుకుంది. గ్రేటర్‌లో తమకు ఎంఐఎంతోనే ప్రధాన పోటీ అంటూ ప్రకటించడం చర్చనీయాంశమైంది. మరోవైపు ఎంఐఎం కూడా టీఆర్‌ఎస్‌ వద్దనుకుంటే, ఆ పార్టీతో పొత్తు తమకూ అక్కరలేదని, తాము తలుచుకుంటే, ప్రభుత్వ పడిపోతుందని చెప్పింది. ఇక టీఆర్‌ఎస్‌ నేతలు ఒక అడుగు ముందుకు వేసి సీఎం కేసీఆర్‌ను మించిన హిందువు లేరని, ఆయనను హిందూత్వానికి ప్రతీకగా పేర్కొంటూ, బీజేపీపై ఎదురుదాడికి దిగారు. ఇదే వ్యూహాన్ని టీఆర్‌ఎస్‌ ముఖ్యులు పోలింగ్‌ వరకు కొనసాగించారు. అయినప్పటికీ, ఫలితాలు టీఆర్‌ఎస్‌ ఆశించిన విధంగా రాలేదు. ‘మేం ఎంఐఎంకి దూరం అయ్యామని చెప్పిన మాటలనే కాకుండా, సీఎం కేసీఆర్‌ను మించిన హిందువు లేరంటూ చేసిన వాదనను ప్రజలు నమ్మలేదని తేలిపోయింది. తెలంగాణలో హిందూ, ముస్లింలు కలిసి మెలిసి జీవించే క్రమంలో ఎంఐఎంతోనూ స్నేహ సంబంధాలను కొనసాగిస్తున్నామనే వాదనను బలంగా వినిపించకపోవటం కూడా దెబ్బతీసి ఉంటుంది’ అని టీఆర్‌ఎస్‌ నేతలు పలువురు వాపోతున్నారు.


ఇంతటితోనే ఆగిపోతుందా ?

రాజకీయ, మతపరమైన సమీకరణాలు జీహెచ్‌ఎంసీ వరకే పరిమితం కావని, తెలంగాణలోని అసెంబ్లీ నియోజకవర్గాలకూ విస్తరించే ప్రమాదం ఉందని టీఆర్‌ఎ్‌సకి చెందిన పలువురు ముఖ్యులు అంతర్గత సంభాషణల్లో కలవరపడుతున్నారు. ‘‘గ్రేటర్‌లో లబ్ధి చేకూర్చిన హిందుత్వ ఎత్తుగడను రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో బీజేపీ తప్పక అమలు చేస్తుంది. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. అదే జరిగితే నష్టపోయేది టీఆర్‌ఎస్సే’’ అని వారు చెబుతున్నారు. ‘‘బీజేపీ విమర్శల వల్ల ఎంఐఎంను దగ్గరకు తీసుకోలేని పరిస్థితి ఉంది. ముస్లిం మైనార్టీల ఓట్లు కావాలి కాబట్టి ఆ పార్టీని దూరం పెట్టలేని పరిస్థితి నెలకొంది’’ అని కూడా వారు అంటున్నారు. ‘‘కేసీఆర్‌ను మించిన హిందువు లేరనే వాదనతో ముందుకు వెళితే, పార్టీకి ముస్లింలు దూరమవుతారు. ఎంఐఎంతో సంబంధాలు యథాతథంగా కొనసాగిస్తే, మెజార్టీ హిందువులకు దగ్గర కాలేం’’ అని టీఆర్‌ఎస్‌ సీనియర్లు కొందరు విశ్లేషిస్తున్నారు. దీంతో రాజకీయంగా తమ పరిస్థితి ‘రెంటికి చెడ్డ రేవడి’లా తయారయ్యేలా ఉందని, దీని నుంచి ఎలా బయటపడాలో తెలియడంలేదని కొందరు ముఖ్యులు చెబుతున్నారు.

Updated Date - 2020-12-10T10:11:22+05:30 IST