కరోనా విషయంలో జీహెచ్‌ఎంసీ వింత వైఖరి!

ABN , First Publish Date - 2020-03-19T16:16:28+05:30 IST

ప్రజలకు అవగాహన కల్పి స్తున్నామని చెబుతోన్న జీహెచ్‌ఎంసీ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది...

కరోనా విషయంలో జీహెచ్‌ఎంసీ వింత వైఖరి!

  • ప్రకటనలిస్తారు.. పట్టించుకోరు.. 
  • కరోనా మహమ్మారి విషయంలోనూ అదే తీరు
  • సంస్థలో కొనసాగుతోన్న బయోమెట్రిక్‌
  • భయాందోళనలో ఉద్యోగులు, కార్మికులు

హైదరాబాద్‌ : కరోనా వైరస్‌ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇప్పటికే విద్యాసంస్థలు, బార్‌ అండ్‌ రెస్టారెంట్లు, పబ్బులు, పార్కులు, ఇతర జనసమ్మర్థ ప్రాంతాలను మూసి వేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అధికార యంత్రాంగాన్ని ఎప్పటిక ప్పుడు అప్రమత్తం చేస్తోంది. ప్రజలకు అవగాహన కల్పి స్తున్నామని చెబుతోన్న జీహెచ్‌ఎంసీ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. తాకడం వల్ల వైరస్‌ వ్యాపిస్తుందని తెలిసీ.. బయో మెట్రిక్‌ విధానాన్ని యథావిధిగా కొనసాగిస్తున్నారు. సంస్థలో బయోమెట్రిక్‌ హాజరు విధానాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు మేయర్‌ బొంతు రామ్మోహన్‌ మంగళవారం ప్రకటించారు. కానీ జీహెచ్‌ఎంసీలో బయోమెట్రిక్‌ హాజరు కొనసాగుతోంది. పారిశుధ్య నిర్వహణ మెరుగుదలలో భాగంగా తెల్లవారు జామున 5నుంచి 5.45 గంటల మధ్య కార్మికుల హాజరు తీసుకోవాలన్న నిర్ణయం బుధవారం అమలులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో బయోమెట్రిక్‌ ద్వారానే కార్మికుల హాజరు తీసుకున్నారు. 


ప్రధాన, జోనల్‌, సర్కిల్‌ కార్యాలయాల్లోనూ బయోమెట్రిక్‌ ద్వారానే హాజరు తీసుకున్నారు. అధికారికంగా ఉత్తర్వులు అందలేదు.. అందుకే బయోమెట్రిక్‌ హాజరు తీసుకుంటున్నామని ఐటీ విభాగం అధికారులు చెబుతున్నారు. ప్రజలకు సంబంధించిన అంశాలైనా.. సంస్థలోని విషయాలైనా.. ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోకుండానే.. అన్నీ చేస్తున్నట్టు ప్రకటనలు జారీ చేయడం జీహెచ్‌ఎంసీకి అలవాటుగా మారింది. బయోమెట్రిక్‌ హాజరు నిలిపివేతకు సంబంధించి ఉన్నత స్థాయిలో ఆదేశాలు జారీ చేయకుండా పత్రికలకు ప్రకటనలు విడుదల చేశారు. దీంతో ఉద్యోగులు, కార్మికులు భయాందోళనకు గురవుతున్నారు. నగరంలో రోజుకో పాజిటీవ్‌ కేసు నమోదవుతోన్న నేపథ్యంలో మనుషులు/వస్తువులను టచ్‌ చేయాలంటే భయపడాల్సిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో వందల మంది ఒకే యంత్రంపై వేలి ముద్రలతో హాజరు వేసుకుంటుండడం ప్రమాదకరమన్న విషయం అధికారులకు తెలియకపోవడం గమనార్హం. ఐటీ విభాగంలోని ఓ అధికారి అత్యుత్సాహం వల్లే బయోమెట్రిక్‌ హాజరు కొనసాగుతుందని చెబుతున్నారు. 


55 శాతానికిపైగా డుమ్మా... 

తెల్లవారేలోపు పారిశుధ్య కార్మికులు విధులకు రావాలన్న నిబంధనల అమలు చేసిన మొదటి రోజే హాజరు శాతం గణనీయంగా తగ్గింది. 18 వేల మంది కార్మికుల్లో దాదాపు 15 వేల మంది ఉదయం స్వీపింగ్‌ చేయాల్సి ఉంటుంది. బుధవారం 5.45 గంటలలోపు కేవలం 45 శాతం మంది మాత్రమే కార్మికులు విధులకు వచ్చినట్టు బయోమెట్రిక్‌ వివరాలు స్పష్టం చేస్తున్నాయి. సికింద్రాబాద్‌ జోన్‌లో 3303 మందికిగాను నిర్ణీత సమయంలోపు విధులకు వచ్చిన కార్మికులు 1374, రానివారి సంఖ్య 1929గా ఉంది. ఈ జోన్‌లో దాదాపు 58 శాతం మంది సమయంలోపు రాలేదని అధికారులు చెబుతున్నారు. దాదాపు అన్ని జోన్లలో ఇదే పరిస్థితి ఉందని ఐటీ విభాగం ఉన్నతాధికారొకరు తెలిపారు. అధికారిక ఆదేశాలు వచ్చే వరకు బయోమెట్రిక్‌ హాజరు కొనసాగిస్తామని పేర్కొన్నారు.

Updated Date - 2020-03-19T16:16:28+05:30 IST