రూ.127 కోట్ల అభివృద్ధి పనులకు గ్రీన్‌ సిగ్నల్‌..

ABN , First Publish Date - 2020-12-31T04:30:38+05:30 IST

రూ.127 కోట్ల అభివృద్ధి పనులకు గ్రీన్‌ సిగ్నల్‌..

రూ.127 కోట్ల అభివృద్ధి పనులకు గ్రీన్‌ సిగ్నల్‌..

308 పనుల ప్రతిపాదనలు.. తీర్మానం

పారిశుధ్య కార్మికులు, కంప్యూటర్‌ 

ఆపరేటర్లకు  వేతనాల పెంపుపై నిర్ణయం

వరంగల్‌ సిటీ, డిసెంబరు 30 :  రూ.127.40 కోట్ల అభివృద్ధి పనులకు బల్దియా కౌన్సిల్‌ సమావేశం గ్రీన్‌సిగ్నల్‌ తెలిపింది. వివిధ రకాల 308 అభివృద్ధి పనులకు అంగీకారం తెలుపుతూ తీర్మానం చేసింది. 95 అజెండా అంశాలు, 21 టేబుల్‌ అజెండా అంశాలను ప్రవేశపెట్టి తీర్మానించారు. హన్మకొండలోని అంబేద్కర్‌ భవన్‌లో మేయర్‌ గుండా ప్రకాశ్‌రావు అధ్యక్షతన బుధవారం జీడబ్ల్యూఎంసీ కౌన్సిల్‌ సమావేశం జరిగింది. కాగా బల్దియా కౌన్సిల్‌ చరిత్రలోనే ఇంతటి భారీస్థాయిలో నిధుల కేటాయింపు. అభివృద్ధి పనుల తీర్మానం జరగడం ఇదే ప్రథమం. 

జీడబ్ల్యూఎంసీలోని కార్మికులపై కౌన్సిల్‌ సమావేశం వరాల జల్లు కురిపించింది. మలేరియా వర్కర్లు రూ.325 చొప్పున ఇప్పటివరకు దినసరి కార్మికులు గా పనిచేస్తున్నారు. అయితే వీరి వేతనాలు పెంచాలని కార్పొరేటర్‌ బయ్యా స్వామి మూడేళ్లుగా కోరుతూ వచ్చారు. ఈ సమావేశంలోనూ ఈ అంశాన్ని ప్రస్తావించారు. దీనిపై కౌన్సిల్‌ అంగీకారం తెలుపుతూ వీరి వేతనాలను రూ. 12,500కు పెంచేందుకు తీర్మానించింది. అంతేకాకుండా మలేరియా వర్కర్లను ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులుగా గుర్తించాలని నిర్ణయించారు. ఇక జీహెచ్‌ఎంసీ  తరహాలో బల్దియా ఔట్‌సోర్సింగ్‌ పారిశుధ్య కార్మికులకు రూ.17,500 వేతనం ఇవ్వాలని తీర్మానించింది. అలాగే ఔట్‌సోర్సింగ్‌ కంప్యూటర్‌ ఆపరేటర్ల వేతనాన్ని రూ.17,500 నుంచి రూ.25 వేలకు పెంచేందుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది.

రూ.12కోట్లతో అధునాతన గెస్ట్‌హౌస్‌

హన్మకొండలో ప్రస్తుత మునిసిపల్‌ గెస్ట్‌హౌస్‌ స్థానంలో రూ.12 కోట్లతో అధునాత గెస్ట్‌హౌ్‌సను నిర్మించాలని తీర్మానించారు. 39వ డివిజన్‌ కార్పొరేటర్‌ వేముల శ్రీనివాస్‌ ఈ అంశాన్ని ప్రతిపాదించగా సమావేశం ఆమోదం తెలిపింది. సెల్లార్‌, గ్రౌండ్‌, ఫస్ట్‌ ఫ్లోర్‌లో కమర్షియల్‌ కాంప్లెక్స్‌, మూడో అంతస్తులో మేయర్‌, కార్పొరేటర్ల గదులు, నాలుగో అంతస్తులో విశ్రాంతి గదులతో భవనం ఉంటుందని వేముల శ్రీనివాస్‌ వివరించారు. ఇక నగరంలో మరో రెండు నైట్‌ షెల్టర్లను నిర్మించాలని నిర్ణయించారు. హన్మకొండ రాయపుర పార్కుకు చాకలిఐలమ్మ నామకరణం చేసి ఆమె విగ్రహ ప్రతిష్ఠించాలనే నిర్ణయాలు జరిగాయి. కాగా,  మునిసిపల్‌ కార్మికుల వేతనాల పెంపుపై హర్షం వ్యక్తం చేస్తూ జీడబ్ల్యూఎంసీ కార్మికులు మేయర్‌ ప్రకాశ్‌రావును ఘనంగా సన్మానించారు.

పలువురికి నివాళులు

 మరోవైపు కార్పొరేటర్‌ నాగమల్ల ఝాన్సీ భర్త సురేష్‌,  దేశాయిపేటకు చెందిన మాజీ కౌన్సిలర్‌ జన్ను వసంత మృతి పట్ల కౌన్సిల్‌ సమావేశంలో సభ్యులు సంతాపం తెలిపారు.

అభివృద్ధిలో చరిత్ర సృష్టిస్తున్నాం : మేయర్‌ 

నగరంలో అభివృద్ధి చరిత్ర సృష్టిస్తున్నాం. మునుపెన్నడూ లేని విధంగా నిధులు కేటాయిస్తున్నాం. మార్చి ఒకటి నుంచి ప్రతీరోజు ఇంటింటికీ తాగునీటిని సరఫరా చేస్తాం. మూడున్నర నెలల్లోనే 300 ప్రజా మరుగుదొడ్లను నిర్మించాం. బయో మైనింగ్‌ ద్వారా మడికొండ డంపింగ్‌ యార్డుకు శాశ్వత పరిష్కారం లభించనుంది. నాలుగు ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్లు రానున్నాయి. వరంగల్‌ నగరాన్ని టూరిస్టు, ఐటీ ఇతర రంగాల్లో అభివృద్ధి చేస్తాం.   

Updated Date - 2020-12-31T04:30:38+05:30 IST