హలో డాక్టర్.. ఎక్కడున్నారు?
ABN , First Publish Date - 2020-08-01T11:13:12+05:30 IST
ఆ డాక్టర్ల క్లినిక్‌లు ఎప్పుడూ కిటకిటలాడుతూ కనిపించేవి... వారి వద్ద నెంబర్ దొరకడమే కష్టంగా ఉండేది.

కరోనా భయంతో క్లినిక్‌లను తెరవని జనరల్ ఫిజీషియన్లు
అక్కడక్కడా కొందరు మాత్రమే అందుబాటులో...
దగ్గు, జులుబు, జ్వరం ఉంటే నో అపాయింట్‌మెంట్
ఇళ్లకే పరిమితమైన ‘పాపులర్’ వైద్యులు
సాధారణ జ్వరానికీ వైద్యం అందక జనం అవస్థలు
ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలే దిక్కు
ఆ డాక్టర్ల క్లినిక్‌లు ఎప్పుడూ కిటకిటలాడుతూ కనిపించేవి... వారి వద్ద నెంబర్ దొరకడమే కష్టంగా ఉండేది.. ‘హస్తవాసి’ మంచిదని పేరుపొందిన డాక్టర్లు క్షణం తీరికలేకుండా గడిపేవారు.. ఇప్పుడు వారి క్లినిక్‌లన్నీ మూతపడి కనిపిస్తున్నాయి. సదరు పాపులర్ వైద్యులు ఇళ్లకే పరిమితమయ్యారు. అస్వస్థతతో వైద్యసహాయం పొందుదామని గతంలోలాగే వస్తున్న జనం.. మూతపడిన క్లినిక్‌లను చూసి బేజారవుతున్నారు. తమ రెగ్యులర్ డాక్టర్ ఎక్కడ...? అని ఆరా తీస్తున్నారు. ఇదంతా కరోనా పుణ్యమా అని కనిపిస్తున్న పరిస్థితి. వరంగల్ నగరాన్నే తీసుకుంటే.. ఇక్కడ 58 మంది జనరల్ ఫిజీషియన్లు ఉన్నారు. వీళ్లల్లో 70శాతం మంది ఇప్పుడు వైద్యం చేయడం లేదు. మిగిలిన 30శాతం మంది సకల జాగ్రత్తలతో కేవలం సాధారణ జ్వరాలకు మాత్రమే సెలెక్టివ్‌గా వైద్యం అందిస్తున్నారు. కొందరైతే ప్రశ్నావళి ఇచ్చి వారి తెలిపిన లక్షణాలను బట్టి వైద్యం చేస్తున్నారు. ఏమాత్రం దగ్గు, జలుపు కనిపించినా ‘చలో కరోనా..’ అంటూ పంపించేస్తున్నారు. కరోనా వైరస్ ఎటు నుంచి ఎలా దాడిచేస్తుందో అంతుబట్టకుండా మారడంతో.. ఎందుకొచ్చిన రిస్కు అనుకుంటూ వైద్యులు ఇళ్లకే పరిమితమవుతున్నారు. దీంతో సామాన్య జనం వైద్యం అందక నానా అవస్థలు పడుతున్నారు.
హన్మకొండ, జూలై 31 (ఆంధ్రజ్యోతి) : కరోనా భయం వల్ల ప్రైవేటు క్లినిక్‌లు పూర్తి స్థాయిలో తెరుచుకోకపోవడంతో సీజనల్ వ్యాధులతో బాధపడుతున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు లాక్‌డౌన్ విధించడంతో దాదాపు రెండు నెలలు అన్ని ప్రైవేటు ఆస్పత్రులు, క్లినిక్‌లు మూతపడ్డాయి. డాక్టర్లు అందుబాటులో లేక వివిధ జబ్బులతో బాధపడుతున్నవారు ఏదో విధంగా నెట్టుకువచ్చారు. లాక్‌డౌన్ సడలించిన తర్వాత కూడా దాదాపు అదే పరిస్థితి నెలకొన్నది. లాక్‌డౌన్ ఎత్తివేసిన తర్వాత కరోనా మహమ్మారి మరింత కోరలు చాచింది. కరోనా పాజిటివ్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదు అవుతున్నాయి. దీంతో సామాన్య ప్రజలే కాదు రోగాలకు వైద్యం చేసే డాక్టర్లు కూడా భయపడుతున్నారు. రోగులను పరీక్షిస్తే తమకెక్కడ అంటుకుంటుందోనని వణికి పోతున్నారు. క్లినిక్‌లను తెరవకపోవడం వల్ల ఫీజుల రూపంలో వచ్చే వేలాది రూపాయల ఆదాయం పోయినా ఫరవాలేదు ప్రాణం ముఖ్యమని వారు క్లినిక్‌లకే రావడం మానేసారు. కొంత మంది డాక్టర్లు వస్తున్నా రోగులను పరిమిత సంఖ్యలోనే చూస్తున్నారు. ఇది వరకు రోజుకు ఉదయం, సాయంత్రం కలిపి రోజుకు 100 నుంచి 150 మంది రోగులను చూసే డాక్టర్లు ఇప్పుడు ఉదయం 10 మందిని, సాయంత్రం 10 మందిని మించి చూడడం లేదు. అదీ వచ్చే రోగులకు కరోనా లేదని నిర్ధారించుకున్న తర్వాతనే.
సీజనల్ వ్యాధుల కాలం..
కరోనా రాకుండా ప్రజలు ఎన్నో ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఇది వర్షాకాలం. తుమ్ములు జగ్గు, జలుబు, జ్వరం వంటి సీజనల్ వ్యాధులు ప్రబలే కాలం. ఇది వరకైతే స్వంత వైద్యం చేసుకొని నెట్టుకువచ్చేవారు. వానా కాలంలో ఇలాంటివి మామూలేనని సర్దిచెప్పుకునేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. తుమ్ములు, దగ్గు, జలుబు రాగానే కరోనా ఏమో అని తీవ్రంగా భయపడుతున్నారు. ఎందుకైనా మంచిదని డాక్టర్ల వద్దకు వెళ్ళి చూపించుకోవాలనుకుంటున్నారు. కానీ తమకు దగ్గరలో ఉన్న ప్రైవేటు క్లినిక్‌లకు వెళితే డాక్టర్ లేడనో, అసలు రావడం లేదనో సమాధానం వినిపిస్తోంది. కొన్ని క్లినిక్‌ల ఎదుట ఈ క్లినిక్ కొద్ది కాలం పాటు మూసివేయబడినది అని బోర్డులు తగిలిస్తున్నారు.
ఫిజీషియన్ల కొరత:
సీజనల్ వ్యాధులు, ఇతరత్రా స్వల్పకాలిక జబ్బులకు ప్రజలు ఎక్కువగా తమకు తెలిసిన పేరున్న జనరల్ ఫిజీషియన్ల (మెడిసిన్) వద్దకు వెళుతుంటారు. వీరు అన్ని రకాల జబ్బులను పరీక్షించి మందులు ఇస్తుంటారు. ఇలాంటి డాక్టర్ల దగ్గరికే రోగులు ఎక్కువ సంఖ్యలో వెళుతుంటారు. వరంగల్ అర్బన్ జిల్లానే తీసుకుంటే ఇక్కడ 58 మంది జనరల్ ఫిజిషియన్లు ఉన్నారు. థైరాయిడ్, షుగర్, కిడ్నీ, గుండె జబ్బులు వంటి దీర్గకాలిక జబ్బులకు వైద్యం చేసే స్పెషలిస్టులు మరో 61 మంది వరకు ఉన్నారు. వీరు కాకుండా కళ్ళు, ముక్కు, గొంతు, పండ్లు తదితర వాటికి చికిత్సలు చేసే డాక్టర్లు కూడా చాలా మందే ఉన్నారు. ఇది వరకు ఈ డాక్టర్ల క్లినిక్‌ల వద్ద రోగుల జాతరే కనిపించేంది. ఇప్పుడు ఈ క్లినిక్‌లన్నీ మూత పడ్డాయి. జిల్లాలో ఉన్న క్లినిక్‌లలో 70 శాతం వరకు పని చేయడం లేదు. మిగతా 30 శాతం క్లినిక్‌లు తెరుచుకున్నా డాక్టర్లు ఇది వరకటిలాగా ఉదయం సాయంత్రం గంటల తరబడి క్లినిక్‌లలో ఉండడం లేదు. గంట లేదా రెండు గంటలు మాత్రమే రోగులను చూస్తున్నారు. అదీ ముందుగా అపాయింట్‌మెంట్ తీసుకున్నవారికే.
ప్రశ్నావళి
క్లినిక్‌లలో డాక్టర్లకు తమ సమస్యను చెప్పుకోవడానికి వచ్చే రోగులు అనేక ఇబ్బందులను ఎదుర్కొనవలసి వస్తోంది. అందరికన్నా ముందే వెళ్ళి లైన్‌లో నిలబడితే తప్పా డాక్టర్ అపాయింట్‌మెంట్ (టోకెన్) దొరకటం లేదు. డాక్టర్‌ను కలవడానికి ముందు రోగులను సిబ్బంది శల్య పరీక్ష చేస్తున్నారు. ఽవారిని ఽజ్వరం ఉన్నదీ లేనిది తెలుసుకునేందుకు థర్మల్ స్ర్కీనింగ్ చేస్తున్నారు. శరీర ఉష్ణోగ్రత ఏ మాత్రం ఎక్కువ ఉన్నా డాక్టర్ అపాయింట్ క్యాన్సిల్. దగ్గు, జలుబు ఉన్నవారిని దూరం నుంచే వెళ్ళగొడుతున్నారు. వారు ఏ ప్రాంతం నుంచి వచ్చింది అడిగి తెలుసుకుంటున్నారు. కంటైన్మెంట్ జోన్ అయితే కూడా అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదు. నగరంలోని పేరున్న కొందరు డాక్టర్లు తమ క్లినిక్‌లకు వచ్చే రోగులకు ఒక ప్రశ్నావళిని అందచేస్తున్నారు. అందులో రోగికి దగ్గు, జలుబు, జ్వరం ఉన్నదా? వారు కంటైర్మెంట్ జోన్ పరిధిలో నివాసముంటున్నవారా? ఈ మధ్య కాలంలో విదేశాలకు వెళ్ళి వచ్చారా? గత వారం రోజుల్లో ఏదైనా దూర ప్రాంతానికి వెళ్ళి వచ్చారా? వారి కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా కరోనా పాజిటివ్ వచ్చిందా? తమ దగ్గరికి రావడానికి ముందు కరోనా టెస్ట్ చేయించుకున్నారా? వంటి ప్రశ్నలకు అవును కాదా అని టిక్ పెట్టాలి. ఆ ప్రశ్నావళిని సిబ్బంది చూసిన తర్వాతనే క్లినిక్‌లోనికి వెళ్ళనిస్తున్నారు. ఏ మాత్రం తేడా వచ్చినా డాక్టర్‌ను కలవడానికి అవకాశం లేదంటూ వెనక్కి పంపించి వేస్తున్నారు. దీనితో సాధారణ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు కూడా డాక్టర్ల అపాయింట్‌మెంట్ దొరక్క ఇబ్బందులు పడవలసి వస్తోంది.
వాట్సాప్ వైద్యం
దీర్గకాలిక జబ్బులకు చికిత్స చేసే స్పెషలిస్టులు సైతం తమ ఆస్పత్రులను తెరవడం లేదు. తమ దగ్గరికి రెగ్యులర్‌గా వచ్చే రోగులకు ఫోన్ ద్వారా, వాట్సాప్ కాల్ ద్వారా వైద్య సలహాలు ఇస్తున్నారు. ఈ డాక్టర్ల అపాయింట్‌మెంట్ కోసం రోగులు ముందుగానే నిర్ణీత ఫీజును ఫోన్‌పే లేదా గుగుల్‌పే ద్వారా చెల్లించిన తర్వాత వారికి టైమ్ స్లాట్ ఇస్తున్నారు. ఆ టైమ్‌కు డాక్టర్ రోగికి ఫోన్ చేసి లేదా, వాట్సాప్‌లో విడియో కాల్ చేసి సమస్య అడిగి తెలుసుకొంటున్నారు. వాడాల్సిన మందులను తర్వాత వాట్సాప్‌లో పంపుతున్నారు. డాక్టర్ల ఈ టైమ్‌స్లాట్ కూడా దొరకడం గగనమవుతోందని రోగులు వాపోతున్నారు. డాక్టర్లు రోజుకు 20 నుంచి 30 మందికే టైమ్ స్లాట్ ఇస్తున్నారని చెబుతున్నారు. నగరంలోని పేరున్న కొన్ని పేరున్న ప్రైవేటు కార్పొరేట్ ఆస్పత్రులు కరోనా భయానికి ఏకంగా గేట్లకు తాళం వేసాయి. రోగులను ఎవరిని రానివ్వడం లేదు. డాక్టర్లు, వైద్య సిబ్బంది పెద్ద సంఖ్యలో కరోనా భారిన పడుతుండడంతో వాటి యాజమాన్యాలు ఈ చర్యలు తీసుకుంటున్నాయి. నగరంలో కరోనా విస్తృతంగా ప్రబలిన ప్రస్తుత పరిస్థితుల్లో జనరల్ ఫిజీషియన్లు సాధారణ జబ్బులతో బాధపడుతున్న రోగులకు అందుబాటులో లేకుండా పోతుండడం, సీజనల్ వ్యాధులకు చికిత్స చేయడానికి డాక్టర్లు వెనుకంజ వేస్తుండడంతో సామాన్య ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. డాక్టర్లు రోగిని తాక కుండానే వైద్యం చేస్తున్నారు. ఫ్లూజ్వరం లక్షణాలుంటే కరోనా టెస్ట్‌కు సిఫార్సు చేస్తున్నారు. నెగెటివ్ రిపోర్టు వస్తేనే ఇన్‌పేషంట్లుగా అడ్మిట్ చేసుకుంటున్నారు.
పీహెచ్‌సీల్లో నయం
ప్రైవేట్ క్లినిక్‌లు, ఆస్పత్రుల సంగతి ఇలాఉంటే, ప్రభుత్వ ఆధీనంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పరిస్థితి కొంత నయంగా కనిపిస్తోంది. ఈ కేంద్రాల్లో ఎక్కువగా పేదలే వైద్య సహాయం పొందుతారు. సాధారణ జ్వరాలతో అస్వస్థతకు లోనైన వారు ఇక్కడి వెళ్లితే వైద్యులు చికిత్స అందజేస్తున్నారు. మందులతో కోలుకోకపోయినా, కరోనా లక్షణాలు ఉన్నా కోవిడ్ పరీక్షలకు సిఫారసు చేస్తున్నారు.