గ్యాస్‌ దిగుమతి కీలకాంశం!

ABN , First Publish Date - 2020-12-28T09:13:52+05:30 IST

భారత్‌లో బొగ్గు స్థానంలో సహజ వాయువు వినియోగాన్ని పెంపొందించే దిశగా కేంద్రం చేస్తున్న తీవ్ర ప్రయత్నాల్లో భాగంగా విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్‌. జయశంకర్‌ రెండు రోజుల ఖతర్‌ పర్యటన ప్రాధాన్యత సంతరించుకొంది. ఇంధన అవసరాల్లో ప్రస్తుత గ్యాస్‌ వినియోగం 6.3 శాతం ఉండగా, దీన్ని 2030 నాటికి 15 శాతానికి పెంచాలని కేంద్రం పట్టుదలతో ఉంది

గ్యాస్‌ దిగుమతి కీలకాంశం!

జయశంకర్‌ ఖతర్‌ పర్యటనలో ఇదే ప్రాధాన్యం.. 

విధివిధానాల రూపకల్పనకు అవకాశం

భవిష్యత్తులో దేశీయ బొగ్గుకు శరఘాతం

సింగరేణికి కూడా ఇక అదే పరిస్థితి

విద్యుత్తు, ఎరువుల సబ్సిడీపైనా ప్రభావం


(ఆంధ్రజ్యోతి గల్ఫ్‌ ప్రతినిధి) 

భారత్‌లో బొగ్గు స్థానంలో సహజ వాయువు వినియోగాన్ని పెంపొందించే దిశగా కేంద్రం చేస్తున్న తీవ్ర ప్రయత్నాల్లో భాగంగా విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్‌. జయశంకర్‌ రెండు రోజుల ఖతర్‌ పర్యటన ప్రాధాన్యత సంతరించుకొంది. ఇంధన అవసరాల్లో ప్రస్తుత గ్యాస్‌ వినియోగం 6.3 శాతం ఉండగా, దీన్ని 2030 నాటికి 15 శాతానికి పెంచాలని కేంద్రం పట్టుదలతో ఉంది. అరేబియా సముద్రం తీరంలో అవతలి వైపు ఉన్న ఖతర్‌, ఒమాన్‌ దేశాల నుండి గ్యాస్‌ దిగుమతి దేశీయ బొగ్గు కంటే కూడా చౌకగా ఉంది. దీంతో అదానీ గ్రూప్‌ గుజరాత్‌లో అరేబియా సముద్ర తీరంలోని ముంద్రలో రూ.14 వేల కోట్లతో 2 వేలల మెగావాట్ల గ్యాస్‌ ఆధారిత విద్యుదుత్పత్తి కేంద్రం నెలకొల్పుతోంది. పెట్రోలియం ధరల ప్రాతిపదికన సహజ వాయువు ధర నిర్ణయించాలని ఖతర్‌, ఒమాన్‌ దేశాలు పట్టుబడుతుండగా, గల్ఫ్‌ దేశాలలోని ఉద్రిక్త పరిస్థితులతో తరుచూ ఒడిదుడుకులకు గురయ్యే పెట్రోలు ధరలతో సంబంధం లేకుండా, గ్యాస్‌ ధర ఉండాలని భారత్‌ ఒత్తిడి చేస్తోంది. గల్ఫ్‌లోని అధిక ధరతో పాటు నౌకాశ్రయాల నుండి రవాణ వరకు అయ్యే ఖర్చుల కారణంగా గ్యాస్‌ గిట్టుబాటు కావడం లేదని అనేక విద్యుదుత్పత్తి సంస్ధలు గ్యాస్‌ పట్ల విముఖత ప్రదర్శిస్తున్నాయని, దీంతో ధర తగ్గించాలని కేంద్రం ఖతర్‌ను కోరింది. గుజరాత్‌, మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ సముద్రాల తీరాల్లో గ్యాస్‌ నిల్వ కేంద్రాలతో పాటు పంపిణీ వ్యవస్థలో వసతుల కల్పన దిశగా పెట్టుబడులు పెట్టే దిశగా ఇరు దేశాలు అవగాహనకు వచ్చాయి.


ఈ నేపథ్యంలో విధివిధానాలను రూపకల్పన చేయడానికి మంత్రి జయశంకర్‌ ఖతర్‌లో పర్యటిస్తున్నారు. ఇది ఖరారైతే సింగరేణి సహా దేశీయ బొగ్గుకు శరఘాతంగా మారుతుంది. విద్యుత్తు, ఎరువుల సబ్సిడీపైనా ప్రభావం పడనుంది. సింగరేణితో సహా దేశంలోని ఇతర బొగ్గు గని కార్మిక సంఘాలు విదేశీ బొగ్గు దిగుమతి, నూతన గనుల ప్రైౖవేటీకరణను వ్యతిరేకిస్తుండగా గుజరాత్‌ ఫార్మూలాతో కేంద్రం గ్యాస్‌ దిగుమతి ఆంశాన్ని వ్యూహాత్మకంగా ముందుకు తీసుకెళ్తోంది. 

Updated Date - 2020-12-28T09:13:52+05:30 IST