గాంధీ ఆస్పత్రిని బద్నాం చేస్తున్నారు

ABN , First Publish Date - 2020-09-12T07:49:40+05:30 IST

కొవిడ్‌ చికిత్స అందిస్తున్న గాంధీ ఆస్పత్రిని కొందరు కావాలని బద్నాం చేస్తున్నారని మంత్రి ఈటల రాజేందర్‌ మండిపడ్డారు.

గాంధీ ఆస్పత్రిని బద్నాం చేస్తున్నారు

అక్కడ వైద్యులు దేవుళ్లలా పనిచేస్తున్నారు

కరోనా నివారణకు రూ.933.804 కోట్లు

మండలిలో వైద్య మంత్రి ఈటల రాజేందర్‌ 


హైదరాబాద్‌, సెప్టెంబరు 11(ఆంధ్రజ్యోతి): కొవిడ్‌ చికిత్స అందిస్తున్న గాంధీ ఆస్పత్రిని కొందరు కావాలని బద్నాం చేస్తున్నారని మంత్రి ఈటల రాజేందర్‌ మండిపడ్డారు. ఆ దవాఖానలో రాజారావు, ప్రభాకర్‌రెడ్డి అనే ఇద్దరు వైద్యులు, వాళ్ల బృందం దేవుళ్లలా పనిచేస్తున్నారని కొనియాడారు. వారు ఒక్క రోజు కూడా సెలవు పెట్టకుండా పనిచేస్తున్నారని చెప్పారు. వైరస్‌ ఊపిరితిత్తులను బాగా ప్రభావితం చేస్తే మనిషి బతకడం కష్టమవుతోందన్నారు. అందుకే ఆదిలోనే వైర్‌సను గుర్తించేందుకు పీహెచ్‌సీ స్థాయిలో ర్యాపిడ్‌ యాంటిజెన్‌ పరీక్షలు వేల సంఖ్యలో చేస్తున్నామని తెలిపారు.


శుక్రవారం శాసన మండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. కొవిడ్‌ నివారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.933.804 కోట్లను కేటాయించిందని తెలిపారు. ఆరోగ్యశ్రీలో కరోనా చికిత్సను చేర్చే విషయమై ఆలోచన చేస్తామని సీఎం కేసీఆర్‌ ఇప్పటికే చెప్పారని గుర్తు చేశారు. వైద్యం చేయించుకున్న వాళ్లకు సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా సాయం చేసేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు.


ఆర్‌ఎన్‌ఏ వైర్‌సలకు వ్యాక్సిన్‌ రావడం కష్టమని, కరోనా  ఎల్లకాలం ఉంటుందన్నారు. కొవిడ్‌ను స్వీయ నియంత్రణతోనే ఎదుర్కోగలుగుతామని చెప్పారు. కరోనా మరణాల విషయంలో ఈ నెల నాలుగో తేదీ వరకు జాతీయ సగటు 1.75 శాతం కాగా.. తెలంగాణలో 0.64శాతం మాత్రమేనని వెల్లడించారు. కేసులు వచ్చిన చోట మూలాలు, ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులను గుర్తిస్తున్నామని, వాళ్లకు పరీక్షలు నిర్వహించి, చికిత్స అందిస్తున్నామని వివరించారు.  కట్టడి ప్రాంతాల్లో ఇంటింటి సర్వే నిర్వహించామని తెలిపారు.


బుధవారం నాటికి రాష్ట్రంలో ప్రతి 10 లక్షల జనాభాకు 41,560 పరీక్షలు నిర్వహించామని వెల్లడించారు. రాష్ట్రంలో పీహెచ్‌సీ స్థాయిలో కూడా పరీక్షలు విస్తృతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సిబ్బందికి ఇస్తామన్న ప్రోత్సాహకాన్ని కొనసాగించే ప్రయత్నం చేస్తామని చెప్పారు. అమెరికా లాంటి దేశంలో వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయలేమని ఆ దేశ అధ్యక్షుడు చేతులెత్తేశారని అన్నారు. ఉమ్మడి జిల్లాల్లో ఉన్న ఏరియా ఆస్పత్రుల్లో పరీక్షల నిర్వహణ కోసం మెరుగైన వైద్య పరికరాలు ఏర్పాటు చేస్తామని ఈటల పేర్కొన్నారు.


Updated Date - 2020-09-12T07:49:40+05:30 IST