వైరస్‌ సోకిన పోలీసులు గాంధీకే!

ABN , First Publish Date - 2020-06-18T09:50:18+05:30 IST

ప్రభుత్వం తరఫున ఆరోగ్య భద్రత ఉన్నా కరోనా చికిత్స కోసం ప్రైవేటు ఆస్పత్రిలో తమను చికిత్సకు అనుమతించకపోవడంపై పోలీసులు

వైరస్‌ సోకిన పోలీసులు గాంధీకే!

  • నిర్ధారణ కానంతవరకే ప్రైవేట్‌ ఆస్పత్రిలో వైద్యం
  • పాజిటివ్‌ అని తేలితే గాంధీ ఆస్పత్రిలోనే చికిత్స 
  • ‘ఆరోగ్యభద్రత’ ఉన్నా ప్రైవేటులో వర్తించని వైనం


హైదరాబాద్‌, జూన్‌ 17 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం తరఫున ఆరోగ్య భద్రత ఉన్నా కరోనా చికిత్స కోసం ప్రైవేటు ఆస్పత్రిలో తమను చికిత్సకు అనుమతించకపోవడంపై పోలీసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరో నా నిర్ధారణకానంత వరకూ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్సకు అనుమతిస్తామని, పాజిటివ్‌ తేలాక గాంధీ ఆస్పత్రిలోనే చికిత్స తీసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశా లు జారీ చేయడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరో నా నియంత్రణ, లాక్‌డౌన్‌ నిబంధనల అమల్లో ముందు వరుసలో ఉంటూ ఎంతో కష్టపడుతున్న పోలీసు సిబ్బందిలో కొంతమంది వైరస్‌ బారినపడుతున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 150 మంది పోలీసులు కరోనా బారిన పడ్డారు. ఇటీవల  ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ కరోనా పరీక్షలు, చికిత్సలకు ప్రభుత్వం అనుమతించింది. పాజిటివ్‌ వస్తే, ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో మంచి వైద్యం పొందొచ్చని భావించిన పోలీసులకు నిరాశ ఎదురైంది. జలుబు, దగ్గు, జ్వరం ఇతర లక్షణాలతో ఆస్పత్రిలో చేరినా ఆ తర్వాత పరీక్షల్లో కొవిడ్‌-19 పాజిటివ్‌ వచ్చిన పోలీస్‌ సిబ్బందిని తదుపరి చికిత్స నిమిత్తం గాంధీకి తరలించాలని ఆస్పత్రులకు ఆరోగ్య భద్రత విభాగం ఉన్నతాధికారులు లేఖ రాశారు. ఈహెచ్‌ఎస్‌ పరిధిలోకి కరోనా రాదని, ప్రభుత్వం ఎలాంటి రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వదని.. అందుకే కొవిడ్‌-19 నిర్ధారణ అయిన పోలీసులను గాంధీ ఆస్పత్రికి  పంపాలని ఎంపానెల్డ్‌ ఆస్పత్రులకు ఆరోగ్య భద్రత విభాగం అధికారులు స్పష్టం చేశారు. పోలీసులతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం గాంధీ ఆస్పత్రి 8వ అంతస్తులో  ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు ప్రైవేటు ఆస్పత్రిలోనే కరోనాకు వైద్యం చేయించుకోవాలంటే పోలీసులు సొంతంగా ఖర్చు పెట్టుకోవాల్సి ఉంటుంది.  

Updated Date - 2020-06-18T09:50:18+05:30 IST