వెలుగుచూసిన గధేగల్ శాసనం!
ABN , First Publish Date - 2020-05-09T10:41:01+05:30 IST
రాష్ట్రంలో మరో పురాతన శాసనం వెలుగు చూసింది. రంగారెడ్డి జిల్లా కడ్తాల మండలం చరికొండలోని గధేగల్ పేరిట ఈ శాసనము క్రీ.శ.1496 సెప్టెంబరు 17న నాటి బీదర్ బహమనీ సుల్తాన్ షాబుద్దీన్ మహ్మద్ పాలనలో వేశారు
హైదరాబాద్, మే 8 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మరో పురాతన శాసనం వెలుగు చూసింది. రంగారెడ్డి జిల్లా కడ్తాల మండలం చరికొండలోని గధేగల్ పేరిట ఈ శాసనము క్రీ.శ.1496 సెప్టెంబరు 17న నాటి బీదర్ బహమనీ సుల్తాన్ షాబుద్దీన్ మహ్మద్ పాలనలో వేశారు. ఈ గ్రామంలో రుక్మిణి, సత్యభామా సమేత వేణుగోపాలస్వామి గుడి, గ్రామ దేవతల గుడులు, పాతకాలం మసీదు, ఖిల్లా గుట్ట, నాలుగు గుమ్మటాలు, గుట్టపై కోట ఆనవాళ్లను చరిత్రకారులు గుర్తించారు. రేచర్ల పద్మనాయకులు ఈ కోటను కట్టించినట్లు చరిత్ర చెబుతోంది.
గుండ్ల పోచంపల్లి వద్ద రాతిచిత్రాలు!
మేడ్చల్ మండలం గుండ్ల పోచంపల్లికి 2 కి.మీ.ల దూరంలోని ప్రభుత్వ అటవీ భూముల్లో మూడు రాతియుగాల రాతి చిత్రాలు వెలుగు చూశాయి. సముద్ర మట్టానికి 545 మీటర్ల ఎత్తున చారిత్రక పరిశోధక విద్యార్థి సాయికృష్ణ వీటిని గుర్తించారు.