గచ్చిబౌలి క్వారంటైన్‌ కేంద్రం సిద్ధం

ABN , First Publish Date - 2020-03-18T09:27:58+05:30 IST

ప్రత్యేకించి కరోనా ప్రభావిత దేశాలైన ఏడు దేశాలు చైనా, దక్షిణ కొరియా, ఇరాన్‌, ఫ్రాన్స్‌, జర్మనీ, ఇటలీ, మలేసియా నుంచి వచ్చిన ప్రయాణికులు, విదేశీయులపై అధికారులు...

గచ్చిబౌలి క్వారంటైన్‌ కేంద్రం సిద్ధం

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): ప్రత్యేకించి కరోనా ప్రభావిత దేశాలైన ఏడు దేశాలు చైనా, దక్షిణ కొరియా, ఇరాన్‌, ఫ్రాన్స్‌, జర్మనీ, ఇటలీ, మలేసియా నుంచి వచ్చిన ప్రయాణికులు, విదేశీయులపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటివరకు 211 మందిని ఐసోలేషన్‌ కేంద్రాలకు తరలించగా.. వారిలో 27 మంది విదేశీయులు ఉన్నట్లు గుర్తించారు. ప్రస్తుతం వికారాబాద్‌లోని ఐసోలేషన్‌ కేంద్రం నిండిపోవడంతో మిగిలిన వారిని దూలపల్లిలోని కేంద్రానికి తరలిస్తున్నారు. గచ్చిబౌలి స్టేడియంలో ఏర్పాటు చేసిన కరోనా క్వారంటైన్‌ కేంద్రం బుధవారం నుంచి అందుబాటులోకి రానుంది. దాదాపు 250 పడకలను సిద్ధం చేసినట్లు తెలిసింది.


ఇదిలా ఉండగా.. కరోనా ప్రభావిత దేశాల నుంచి వస్తున్న స్వదేశీయులను శంషాబాద్‌ విమానాశ్రయంలో స్ర్కీనింగ్‌ అనంతరం నేరుగా వికారాబాద్‌ జిల్లా అనంతగిరి హరిత రిసార్ట్స్‌లో ఏర్పాటు చేసిన ఐసోలేషన్‌ కేంద్రానికి తరలిస్తున్నారు. మంగళవారం వరకు వీరి సంఖ్య 53కు చేరింది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉండటంతో ప్రభుత్వ క్షయ ఆస్పత్రిలోని వార్డులను కూడా సిద్ధం చేస్తున్నారు. తాజాగా రంగారెడ్డి జిల్లాలో నగర శివార్లలోని మరో 22 చోట్ల ఐసోలేషన్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు.


దూలపల్లి ఫారెస్ట్‌ అకాడమీ సీ-బ్లాక్‌లో ఏర్పాటు చేసిన ఐసోలేషన్‌ కేంద్రంలో ముగ్గురు విదేశీయులకు ప్రభుత్వం ఆశ్రయం కల్పించింది. మరోవైపు గాంధీ ఆస్పత్రికి కరోనా అనుమానంతో మంగళవారం 17 మంది మాత్రమే వచ్చారు. ప్రస్తుతం గాంధీలో 25 మంది అనుమానితులు, నలుగురు పాజిటివ్‌గా తేలినవారు చికిత్స పొందుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులోని ఓ ప్రైవేటు వైద్యుడికి కరోనా వైరస్‌ సోకిందంటూ సోషల్‌ మీడియాలో అసత్య ప్రచారం చేసిన ముగ్గురు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Updated Date - 2020-03-18T09:27:58+05:30 IST