మరుగుదొడ్ల నిర్మాణంలో అక్రమాలు
ABN , First Publish Date - 2020-12-21T04:32:08+05:30 IST
కాసులపై కక్కుర్తితో మరుగుదొడ్ల నిర్మాణంలో అవకతవకలకు పాల్పడేందుకు అధికారులు తెరతీశారు. మునిసిపల్ కౌన్సిల్ తీర్మానం లేకుండా, టెండర్లు నిర్వహంచకుండానే రూ. 1.22 కోట్ల పనులను ఒకే కంపెనీకి అప్పగించారు.

టెండర్లు లేకుండానే రూ. 1.22 కోట్ల పనుల అప్పగింత
నాసిరక నిర్మాణాలతో నిధులు కొల్లగొట్టే యత్నం
పనులను రద్దు చేయాలన్న మునిసిపల్ కౌన్సిల్ తీర్మానం బేఖాతరు
(ఆంధ్రజ్యోతి, భూపాలపల్లి): కాసులపై కక్కుర్తితో మరుగుదొడ్ల నిర్మాణంలో అవకతవకలకు పాల్పడేందుకు అధికారులు తెరతీశారు. మునిసిపల్ కౌన్సిల్ తీర్మానం లేకుండా, టెండర్లు నిర్వహంచకుండానే రూ. 1.22 కోట్ల పనులను ఒకే కంపెనీకి అప్పగించారు. పనులు ప్రారంభం కాకముందే 80 శాతం నిధులను సైతం అడ్వాన్స్‌గా చెల్లించారు. దీనిపై మునిసిపల్ కౌన్సిల్ అభ్యంతరం వ్యక్తం చేసినా ఎవరూ పట్టించుకోపోగా నాసిరకంగా ఆదరాబాదరగా పనులను పూర్తి చేస్తున్నారు. నేడు భూపాలపల్లి మునిసిపల్ కౌన్సిల్ సర్వసభ్య సమావేశం జరగనున్న నేపథ్యంలో మరుగుదొడ్ల నిర్మాణంలో జరుగుతున్న అవినీతిపై ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం..
రూ. 1.22 కోట్ల నిధులతో పనులు
పట్టణ ప్రగతిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పలు మునిసిపాలిటీల్లో మరుగుదొడ్ల నిర్మాణాలకు ప్రభుత్వం నిధులు కేటాయించింది. ఆగస్టు 15 నాటికి ఈ పనులు పూర్తి చేయాలని ఆదేశించింది. దీనిలో భాగంగా భూపాలపల్లి పట్టణంలో 11 చోట్ల కమ్యూనిటీ టాయిలెట్ల నిర్మించేందుకు రూ. కోటి 22 లక్షల 15 వేలు కేటాయించింది. ఈ పనులపై మునిసిపాలిటీలో చర్చించి కౌన్సిల్ తీర్మానం మేరకు పనులు చేపట్టాల్సి ఉంది. అలా కాకుండా నామినేషన్‌పై కలెక్టర్ మూడు, నాలుగు కంపెనీల నుంచి టెండర్లు స్వీకరించి దాని ఆధారంగా పనులు అప్పగించే అధికారం ఉంది. కాని గత కలెక్టర్ ఏకపక్షంగా వ్యవహరించి ఒకే కంపెనీకి ఈ పనులను అప్పగించగా, దీనిపై మునిసిపల్ కౌన్సిల్ సభ్యులు, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
80 శాతం బిల్లుల చెల్లింపులు
ప్రభుత్వ పనులను సకాలంలో పూర్తి చేసి, బిల్లుల కోసం కాంట్రాక్టర్లు నెలల తరబడి అధికారుల చుట్టు తిరగడం మనకు సాధారణంగా కనిపించే అంశం. కాని ఈ మరుగుదొడ్ల నిర్మాణ పనుల్లో మాత్రం అది కనిపించలేదు. పనులను ప్రారంభించడానికి ముందే 80 శాతం నిధులను అప్పనంగా ముట్టజెప్పారు. అప్పటి మునిసిపల్ కమిషనర్ 40 శాతం డబ్బులు అడ్వాన్స్‌గా సదరు కంపెనీకి ఇప్పించారు. దీనిపై కౌన్సిలర్లు గత అక్టోబరులో జరిగిన మునిసిపల్ కౌన్సిల్ సమావేశంలో కమిషనర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌన్సిల్‌కు, చైర్‌పర్సన్‌కు సమాచారం లేకుండా రూ.48.86 లక్షలు అడ్వాన్స్‌గా ఇవ్వడంపై కమిషనర్‌ను నిలదీశారు. కమిషనర్‌పై చర్య తీసుకొని, అడ్వాన్స్ మొత్తాన్ని రికవరీ చేయాలని తీర్మానించి కలెక్టర్‌కు నివేదిక అందజేశారు. కానీ ఆ తీర్మానం బుట్టదాఖలైంది. ఈ అంశంలో కలెక్టర్‌కు బదిలీ ఆర్డర్ రాగానే మరో 40 శాతం నిధులు, సుమారు రూ.45 లక్షలను మళ్లీ ఆ కంపెనీకి ముట్టజెప్పడం విడ్డూరం. పనులు ప్రారంభం కాకముందే రూ.93.86 లక్షల నిధులు చెల్లించడం అధికారుల అవినీతికి అద్దం పడుతోంది.
నాసిరకంగా పనులు
మరుగుదొడ్ల నిర్మాణాల్లో జరిగిన అక్రమాలపై ఒక వైపు చర్చ జరుగుతండగానే కాంట్రాక్టర్ అదరబాదరగా పనులు చేపట్టి చేతులు దులుపుకునే ప్రయత్నాలు కొనసాగిస్తున్నాడు. పట్టణంలో 11 చోట్ల చేపట్టిన మరుగుదొడ్ల నిర్మాణాలన్నీ నాసిరకంగా ఉన్నాయి. నీటి వసతి కోసం కనీసం బోర్లు కూడా ఏర్పాటు చేయలేదు. నీళ్లు లేకుండా మరుగుదొడ్ల నిర్వహణపై అనేక విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరుగుదొడ్ల గోడలు, స్లాబ్ సిమెంట్‌తో చేపాట్టాల్సి ఉన్నా ఉడ్‌తో నిర్మించారు. దీంతో ప్రారంభానికి ముందే ఇవి ధ్వంసమవుతున్నాయి. ఈ నిర్మాణ ఖర్చు రూ.3 లక్షల కంటే దాటదని, కానీ రూ.11 లక్షల వరకు నిధులు చెల్లించి అధికారులు అక్రమాలకు పాల్పడ్డారని పట్టణవాసులు మండిపడుతున్నారు. వివాదస్పదంగా మారిన మరుగుదొడ్ల నిర్మాణంపై విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టి బాధ్యులైన అధికారులు, కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
నేడు మునిసిపల్ సర్వసభ్య సమావేశం
భూపాలపల్లి మునిసిపల్ సర్వసభ్య సమావేశం సోమవారం పట్టణంలోని ఇల్లందు క్లబ్‌లో జరగనుంది. ఉదయం 10.30 గంటలకు మునిసిపల్ చైర్‌పర్సన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, ఇన్‌చార్జి కలెక్టర్ కృష్ణ ఆదిత్య, కౌన్సిలర్లు, వివిధ శాఖల అధికారులు హాజరుకానున్నారు.
