‘నేతన్నకు చేయూత’ నిధులిచ్చాం

ABN , First Publish Date - 2020-09-01T08:32:03+05:30 IST

కరోనా సంక్షోభంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు నేతన్నలకు కష్టకాలంలో ఉపయుక్తంగా నిలిచాయని రాష్ట్ర

‘నేతన్నకు చేయూత’ నిధులిచ్చాం

  • గడువుకు ముందే అందేలా చేశాం... 
  • 25 వేల మందికి 110 కోట్ల లబ్ధి: కేటీఆర్‌

హైదరాబాద్‌, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): కరోనా సంక్షోభంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు నేతన్నలకు కష్టకాలంలో ఉపయుక్తంగా నిలిచాయని రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ అన్నారు. నేతన్నకు చేయూత పథకంలో పొదుపు డబ్బులను గడువుకు ముందే తీసుకునేలా ప్రభుత్వం ఇచ్చిన వెసులుబాటు వారికి  ఉపయోగపడిందని చెప్పారు. ఈ పథకంలోని డబ్బులను వెనక్కు తీసుకోవడం ద్వారా రాష్ట్రంలో సుమారు 25 వేల మంది నేతన్నలకు లబ్ది కలిగిందన్నారు. చేయూత పొదుపు పథకం ద్వారా చేనేత కార్మికులకు చెల్లించిన పొదుపు మొత్తానికి ప్రభుత్వం రెట్టింపు మొత్తాన్ని అందించిందని చెప్పారు. పవర్‌లూమ్‌ కార్మికులకు కార్మికులు చెల్లించిన పొదుపు మొత్తానికి సమానంగా బ్యాంకు ఖాతాల్లో జమ చేసిందన్నారు. లాకిన్‌ పీరియడ్‌ మూడేళ్లు ఉన్నప్పటికీ, కరోనా సంక్షోభం నే పథ్యంలో ముందే డబ్బులు తీసుకునే వెసులుబాటు కల్పించిందని తెలిపారు. దీంతో చేనేత కార్మికులకు రూ.96.43 కోట్లు, పవర్‌లూమ్‌ కార్మికులకు రూ.13 కోట్లు మొత్తంగా రూ.110 కోట్లు నేతన్నలకు అందుబాటులోకి వచ్చాయన్నారు. ప్రభుత్వం కష్టకాలంలో తమ పరిస్థితిని అర్థం చేసుకున్నందుకు సంతోషం వ్యక్తం చేస్తూ తనకు నేరుగా కార్మికులు మెస్సేజ్‌లు పంపారని కేటీఆర్‌ తెలిపారు. హైదరాబాద్‌ ఆర్‌టీసీ క్రాస్‌ రోడ్‌లోని హ్యాండీక్రాఫ్ట్‌ కార్యాలయంలో సోమవారం జరిగిన సమీక్షలో మంత్రి పాల్గొన్నారు. చేనేత, పవర్‌లూమ్‌ కార్మికుల సంక్షేమ కార్యక్రమాలపై చర్చించారు. బతుకమ్మ చీరల ఉత్పత్తి దాదాపు పూర్తి కావచ్చిందని, పంపిణీపై దృష్టి సారించామని మంత్రికి... ఈ సందర్భంగా అధికారులు వివరించారు. బతుకమ్మ పండుగకు కనీసం వారం రోజుల ముందు నుంచే పంపిణీని ప్రారంభించాలని, అక్టోబరు రెండవ వారం లోగా పంపిణీ పూర్తయ్యేలా చూడాలని కేటీఆర్‌ ఆదేశించారు. అనంతరం ముషీరాబాద్‌లోని షోరూంను కేటీఆర్‌ సందర్శించారు.

Updated Date - 2020-09-01T08:32:03+05:30 IST