ఇక పూర్తి జీతం!
ABN , First Publish Date - 2020-06-18T09:11:40+05:30 IST
రాష్ట్రంలో ఇక నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు పూర్తి వేతనం అందనుంది. జూన్ నెలకు ఎలాంటి కోతలు లేకుండా జీతం అందబోతోంది.

- జూన్ నుంచి చెల్లింపు.. సీఎం నిర్ణయం
- తగిన ఏర్పాట్లు చేసుకోవాలని
- ఉన్నతాధికారులకు ఆదేశాలు
- ఉద్యోగులు, పింఛన్‌దార్లకు ఊరట!
- 3 నెలల కోతలపై రాజముద్ర
- ఆర్డినెన్స్ జారీ చేసిన సర్కారు
- హైకోర్టుకు నివేదించిన ఏజీ
- ప్రతులు సమర్పించాలన్న కోర్టు
ఆర్థిక సంక్షోభం సమసిపోయేదాకా వేతనాల్లో కోతపై సంపూర్ణ అధికారాలను ప్రభుత్వం కలిగి ఉంటుంది. కత్తిరించిన వేతనాలను ఎప్పటిలోగా ఇస్తారనే విషయాన్ని ప్రభుత్వం సెప్టెంబరు 24లోగా చెప్పాలి. తాజా ఆర్డినెన్స్‌ను న్యాయస్థానంలో సవాలు చేయడానికి కూడా వీల్లేదు.
హైదరాబాద్, జూన్ 17 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఇక నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు పూర్తి వేతనం అందనుంది. జూన్ నెలకు ఎలాంటి కోతలు లేకుండా జీతం అందబోతోంది. పెన్షనర్లకు కూడా పూర్తి పింఛను ఇవ్వనున్నారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఇందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని ఆయన ఉన్నతాధికారులను ఆదేశించారు. మరోవైపు కరోనా విపత్తు నేపథ్యంలో రాష్ట్రంలో ఆరోగ్య అత్యయిక స్థితి అమల్లో ఉన్నందున.. దాని కింద ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పింఛనుదార్ల వేతనాల్లో 50 శాతానికి మించకుండా కోత (డిఫర్‌మెంట్)కు చట్టబద్ధత కల్పిస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. ఈ ఆర్డినెన్స్‌తో వేతనాల కోతపై ప్రభుత్వానికి పూర్తి అధికారం దఖలు పడింది. ఆర్థిక అత్యయిక స్థితి విధిస్తే తప్ప పింఛన్లలో కోత వేయడానికి వీల్లేదన్న హైకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో ప్రభుత్వం ఈ ఆర్డినెన్స్ జారీ చేయడం గమనార్హం. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి, లాక్‌డౌన్ అమలు, ప్రభుత్వ ఆదాయం పడిపోయిన నేపథ్యంలో మార్చి నుంచి ఉద్యోగుల వేతనాల్లో కోత విధిస్తున్న విషయం తెలిసిందే.
అన్ని కేటగిరీల ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో 50 శాతం; 4వ తరగతి, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాల్లో 10 శాతం కోత విధించారు. అన్ని రకాల రిటైర్డ్ ఉద్యోగుల పింఛన్లలో 25 శాతం కోత పెట్టారు. నాలుగో తరగతి రిటైర్డ్ ఉద్యోగుల పింఛన్లలో 10 శాతం కోత విధించారు. ఇక అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ గ్రాంటు పొందుతున్న సంస్థల ఉద్యోగులు, పెన్షనర్లకు, ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల మాదిరిగానే వేతనాలు, పింఛన్లలో కోత పెట్టారు. కోత పెట్టిన వేతనాలు, పింఛన్ల మొత్తాన్ని వాయిదాల్లో తదుపరి చెల్లిస్తామని ప్రభుత్వం స్పష్టంచేసింది. అనంతరం ఈ కోతల నుంచి వైద్య, ఆరోగ్య, పోలీస్ శాఖల సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులకు మినహాయింపు ఇచ్చింది. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు వరుసగా 3 నెలలు (మార్చి, ఏప్రిల్, మే) వేతనాలు, పింఛన్లలో కోత విధించడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. పింఛన్ మొత్తాన్ని చెల్లించాలని హైకోర్టులో వ్యాజ్యం కూడా నడుస్తోంది. ఈ క్రమంలో జూన్‌కు సంబంధించి ఉద్యోగులకు పూర్తి వేతనం, పెన్షనర్లకు పూర్తి పింఛన్ ఇవ్వడానికి సీఎం సుముఖత వ్యక్తం చేసినట్లు ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి. లాక్‌డౌన్ సడలింపుల తర్వాత ఆర్థిక పరిస్థితులు కొంత కుదుటపడడం; వేతనాలు, పింఛన్ల కోతపై ఉద్యోగులు, పెన్షనర్ల ఆందోళనను పరిగణనలోకి తీసుకొని సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నాయి.
ఆర్డినెన్స్ ప్రతులు ఇవ్వండి: హైకోర్టు
జీతాలు, పింఛన్ల కోతలపై ప్రభుత్వం ఆర్డినెన్స్ తెచ్చిందని అడ్వొకేట్ జనరల్ బి.ఎ్‌స.ప్రసాద్ హైకోర్టుకు తెలిపారు. ఉద్యోగుల జీతాలు, పింఛన్లపై కోతలు విధిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోలను ప్రశ్నిస్తూ న్యాయవాదులు సరసాని సత్యంరెడ్డి, జంధ్యాల రవిశంకర్ వేర్వేరుగా సీజేకు రాసిన లేఖలను ధర్మాసనం సుమోటోగా విచారణకు స్వీకరించిన విషయం తెలిసిందే. పెన్షన్లలో కోతలు విధించడాన్ని సవాల్ చేస్తూ పింఛనుదార్లు కూడా పిటిషన్లు దాఖలు చేశారు. గత విచారణ సందర్భంగా కోతలపై ప్రభుత్వ జీవోలు చట్ట ప్రకారం లేవని, వీటిని కొట్టివేస్తామని, 48 గంటల్లో ప్రభుత్వ విధానమేంటో చెప్పాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది. ఈ పిటిషన్లు బుధవారం మరోసారి విచారణకు వచ్చాయి. ఏజీ వాదనలు వినిపిస్తూ.. రాష్ట్రంలో నెలకొన్న ప్రజారోగ్య అత్యవసరస్థితి కారణంగా ఉద్యోగుల వేతనాల్లో 50 శాతం, పింఛన్లలో 25 శాతం కోత విధించారని, ఈ మేరకు ప్రభుత్వం ఆర్డినెన్స్ తెచ్చిందని తెలిపారు. స్పందించిన ధర్మాసనం.. ఆర్డినెన్స్ ప్రతులను కోర్టు ముందుంచాలని ఆదేశించింది. పిటిషనర్ల తరపు న్యాయవాది సీహెచ్ ప్రభాకర్ వాదనలు వినిపిస్తూ.. ఆర్డినెన్స్‌ను సవాల్ చేసేందుకు అనుమతించాలని అభ్యర్థించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను జూన్ 24కి వాయిదా వేసింది.
సెప్టెంబరు 24లోగా చెప్పాల్సిందే
జీతాలు, పింఛన్ల కోతలపై ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ గడువు ఆర్నెల్లు కావడంతో ఆలోగా జరిగే శాసనసభ సమావేశాల్లో దీన్ని చట్టరూపంలోకి తేవాలి. అలా చట్టరూపం దాల్చిన తర్వాత ఆర్థిక సంక్షోభం సమసిపోయేదాకా ప్రభుత్వం వేతనాల్లో కోతపై సంపూర్ణ అధికారాలను కలిగి ఉంటుంది. ఈ నిర్ణయం మార్చి 24 నుంచి అమల్లోకి వచ్చినట్లయింది. మంగళవారం మంత్రివర్గం ఆర్డినెన్స్ జారీకి సర్క్యులేషన్ పద్ధతిలో తీర్మానం చేసింది. దీన్ని గవర్నర్‌కు పంపించగా.. అదే రోజు రాత్రి ఆర్డినెన్స్‌పై ఆమె సంతకం చేశారు. దాంతో బుధవారం గెజిట్ రూపంలో విడుదల చేశారు. అయితే కోత(వాయిదా) వేసిన వేతనాలను ఎప్పటిలోగా చెల్లిస్తారనేది ఆర్నెల్లలోపు వెల్లడించాల్సి ఉంటుంది. అంటే ఉద్యోగులకు కత్తిరించిన వేతనాలను ఎప్పటిలోగా ఇస్తారనే విషయాన్ని ప్రభుత్వం సెప్టెంబరు 24లోగా చెప్పాలి. తాజా ఆర్డినెన్స్‌ను న్యాయస్థానంలో సవాలుకూ వీల్లేదు. రెండేళ్లలోపు ఈ ఆర్డినెన్స్‌కు వివరణలు ఇచ్చేందుకూ అవకాశం ఉంది.