కొత్త ఏడాది నుంచి ఉచిత తాగునీరు

ABN , First Publish Date - 2020-12-20T07:12:05+05:30 IST

కొత్త సంవత్సరం నుంచి హైదరాబాద్‌ నగర ప్రజలకు ఉచిత తాగునీటి సరఫరా కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు మునిసిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు.

కొత్త ఏడాది నుంచి ఉచిత తాగునీరు

హైదరాబాద్‌లో నెలకు 20 వేల లీటర్ల వరకు ఫ్రీ

డిసెంబరు బిల్లు  చెల్లించాల్సిన అవసరం లేదు

ఒకటి, రెండు రోజుల్లో విధివిధానాలు: కేటీఆర్‌

కార్యాచరణపై ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష

 హైదరాబాద్‌ సిటీ, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి): కొత్త సంవత్సరం నుంచి హైదరాబాద్‌ నగర ప్రజలకు ఉచిత తాగునీటి సరఫరా కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు మునిసిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. 20 వేల లీటర్ల వరకు తాగునీటిని ఉచితంగా అందిస్తామని స్పష్టం చేశారు. జనవరిలో వినియోగదారులకు వచ్చే డిసెంబరు నెల బిల్లును చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల సందర్భంగా సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీ మేరకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు శనివారం ప్రగతి భవన్‌లో మంత్రి కేటీఆర్‌.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, వాటర్‌బోర్డు ఎండీ దానకిషోర్‌, ఇతర అధికారులతో సుదీర్ఘ సమావేశం నిర్వహించారు.




నగరంలో ఉన్న మొత్తం మంచినీటి నల్లా కనెక్షన్లు, నీటి సరఫరాకు అవసరమైన ఏర్పాట్లు, విధివిధానాల రూపకల్పనపై మంత్రి సమీక్షించారు. ఉచిత తాగునీటి సరఫరాకు సంబంధించిన సమాచారం ప్రజలకు సంపూర్ణంగా చేరేలా వాటర్‌బోర్డు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నగర ప్రజలందరికీ ఉపశమనం కలిగించే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అవసరమైన కార్యాచరణను పటిష్టంగా రూపొందించాలన్నారు. రానున్న రెండు వారాల పాటు ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను సమీక్షించుకోవాలని, ఒకటి రెండు రోజుల్లో విధి విధానాలను రూపొందించి మరోసారి సమావేశం కావాలని సూచించారు.


అదేవిధంగా వాటర్‌బోర్డు ద్వారా నగరంలో సరఫరా చేస్తున్న తాగునీటిపై మంత్రి కేటీఆర్‌ సమీక్షించారు. కొన్ని సంవత్సరాలుగా హైదరాబా ద్‌లో తాగునీటి నివియోగం చాలా బాగా పెరుగుతూ వస్తోందని వాటర్‌బోర్డు అధికారులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. వాటర్‌బోర్డు నీటి సరఫరా సామర్థ్యాన్నీ ప్రతి ఏటా పెంచుకుంటున్నట్లు తెలిపారు. వచ్చే వేసవికి సైతం సరిపోయే విధంగా నీటి సరఫరా చేసేందుకు ఇప్పటి నుంచే తగిన ప్రణాళిక రూపొందిస్తున్నామని  అధికారులు వివరించారు.


Updated Date - 2020-12-20T07:12:05+05:30 IST