గురుకులాల్లో ఉద్యోగాల పేరిట మోసం

ABN , First Publish Date - 2020-09-20T06:59:19+05:30 IST

గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగులను మోసం చేసిన ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. కరీంనగర్‌ మండలం కొత్తపల్లి గ్రామంలోని పీహెచ్‌సీలో ల్యాబ్‌టెక్నీషియన్‌గా విఽధులు నిర్వహిస్తున్న

గురుకులాల్లో ఉద్యోగాల పేరిట మోసం

ముగ్గురి అరెస్టు..

రాష్ట్రవ్యాప్తంగా ఏజెంట్లు..

రూ.36 లక్షలు వసూలు


సిరిసిల్ల, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగులను మోసం చేసిన ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. కరీంనగర్‌ మండలం కొత్తపల్లి గ్రామంలోని పీహెచ్‌సీలో ల్యాబ్‌టెక్నీషియన్‌గా విఽధులు నిర్వహిస్తున్న రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం రంగంపేటకు చెందిన మాలోతు రాంచంద్రం, హైదరాబాద్‌లోని సుచిత్ర ఎడ్యుకేషన్‌ సొసైటీ నిర్వాహకురాలు ఠాగూర్‌ సుజాత, రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం కిష్టునాయక్‌తండాలోని భూక్య దేవీలాల్‌ను అరెస్టు చేసినట్లు శనివారం సీఐ బన్సీలాల్‌ తెలిపారు.


కిష్టునాయక్‌తండాకు చెందిన ధరావత్‌ రజితకు గురుకులంలో బ్యూటీషియన్‌, ఆర్ట్‌ అండ్‌ క్రాఫ్ట్‌ టీచర్‌ ఉద్యోగం ఇప్పిస్తామని రాంచంద్రం, దేవీలాల్‌ రూ.2.45 లక్షలు తీసుకున్నారు. రాంచంద్రంకు పరిచయమున్న ఠాగూర్‌ సుజాత ద్వారా అపాయింట్‌మెంట్‌ లెటర్‌ అందించారు. 2019 మేలో మెదక్‌ జిల్లాలోని టీఎస్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌ అండ్‌ కాలేజీలో ఒకేషనల్‌ కోర్సులో శిక్షకురాలిగా నియమించారు. మూడు నెలల తర్వాత వేతనం ఇవ్వకపోవడంతో రామచంద్రం, సుజాతను రజిత నిలదీసింది. తిరిగి 2019 ఆగస్టులో ఆమెకు మరో అపాయింట్‌మెంట్‌ లెటర్‌ ఇచ్చి కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం రెడ్డిపేటలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నియమించారు. నాలుగు నెలలు పనిచేసినా జీతం ఇవ్వకపోవడంతో రజిత గత నెల 26న ఎల్లారెడ్డిపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితులు రామచంద్రం, దేవీలాల్‌ను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారించారు.

సుచిత్ర ఎడ్యుకేషన్‌ సొసైటీలో సోదాలు జరిపి పలు పత్రాలు స్వాధీనం చేసుకుని, సుజాతను అదుపులోకి తీసుకున్నారు. మంచిర్యాల, కొమరంభీం, వరంగల్‌, నిర్మల్‌, భూపాలపల్లి, వికారాబాద్‌, కరీంనగర్‌, రాజన్న సిరిసిల్ల జిల్లాలో సుమారు 40 మంది బాధితులు ఉన్నట్లు గుర్తించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 21మంది వద్ద రూ.36 లక్షలు వసూలు చేశారని సీఐ వివరించారు. నిందితులు రాంచంద్రం, సుజాత, దేవీలాల్‌ను రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. 


Updated Date - 2020-09-20T06:59:19+05:30 IST