ఒకసారి ఒకరికి మాత్రమే ఫార్వర్డ్!
ABN , First Publish Date - 2020-04-08T09:26:05+05:30 IST
కరోనాపై వదంతులు, తప్పుడు వార్తలు ప్రచారమవుతున్న నేపథ్యంలో వాట్సాప్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎక్కువగా ఫార్వర్డ్ అవుతున్న సందేశాలను ఒకసారి ఒకరికి మాత్రమే పంపేలా...

- వదంతుల అడ్డుకట్టకు వాట్సాప్ పరిమితి
- తరచుగా షేర్ అయ్యే మెసేజ్‌లకు చెక్
హైదరాబాద్/న్యూఢిల్లీ, ఏప్రిల్ 7 (ఆంధ్రజ్యోతి): కరోనాపై వదంతులు, తప్పుడు వార్తలు ప్రచారమవుతున్న నేపథ్యంలో వాట్సాప్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎక్కువగా ఫార్వర్డ్ అవుతున్న సందేశాలను ఒకసారి ఒకరికి మాత్రమే పంపేలా యాప్‌లో మార్పులు చేసింది. ‘ఎక్కువగా’ అంటే.. ఐదుసార్లు లేదా అంతకుమించి ఫార్వర్డ్ అయిన ఏ సందేశమైనా వైరల్ అవుతున్నట్టే. వాట్సాప్ కొత్తగా విధించిన పరిమితి ప్రకారం అలాంటి సందేశాలను ఒకరికి/ఒక గ్రూపునకు మించి పంపించలేమన్నమాట. అలాగే.. వదంతులకు అడ్డుకట్ట వేసే మరో ఫీచర్‌ను కూడా వాట్సాప్ పరీక్షిస్తోంది. దాని ప్రకారం.. తరచుగా లేదా ఎక్కువమంది ఫార్వర్డ్ చేసే మెసేజ్‌లపై ఒక భూతద్దం బొమ్మ ఉంటుంది. దానిపై టచ్ చేస్తే ఆన్‌లైన్ సెర్చ్‌లోకి తీసుకెళ్తుంది. వినియోగదారులు సెర్చ్ ఫలితాల్లో వార్తలను చదివి అది నిజమా కాదా తెలుసుకోవచ్చు. కాగా.. సామాజిక మాధ్యమాల ద్వారా తప్పుడు సమాచారం చేరవేేస వారిపై చర్యలు తీసుకుంటామని తెలంగాణ సర్కారు మరోమారు హెచ్చరించింది. ఈ మేరకు రాష్ట్ర ఐటీ శాఖ, డిజిటల్ మీడియా విభాగం సంచాలకులు దిలీప్ కొణతం ఓ ప్రకటన విడుదల చేశారు. కాగా.. వాట్సాప్ ద్వారా తప్పుడు వార్తలు, వదంతుల వ్యాప్తిని అడ్డుకోవాలంటూ ఇండోర్ కలెక్టర్ పిలుపుమేరకు వేలాది వాట్సాప్ గ్రూప్ అడ్మిన్లు సెట్టింగులను వెంటనే మార్చేశారు.
తప్పుడు వార్తల్ని తొలగించండి : కేంద్రం
కరోనా వైరస్ ముప్పు నేపథ్యంలో సామాజిక మాధ్యమాల్లో తప్పుడు వార్తలు, వదంతులు ప్రచారం చేసేవారిపై చర్యలు తీసుకోవడానికి కేంద్రం నడుం బిగించింది. కొవిడ్-19పై పోరులో భాగంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను నిర్వీర్యం చేసే వదంతులను, ఆడియో, వీడియో క్లిప్పులను గుర్తించి తొలగించాలని టిక్‌టాక్, హెలో, ఫేస్‌బుక్ వంటి వాటిని ఆదేశించింది. అంతేకాదు, తప్పుడు వార్తలను, వదంతులను ప్రచారం చేస్తున్నవారి వివరాలను తమకు ఇవ్వాలని కేంద్ర ఎలకా్ట్రనిక్స్ అండ్ ఐటీ శాఖ కోరినట్టు సమాచారం. కాగా, ప్రభుత్వం చూసిన వాట్సాప్ పోస్టులకు మూడు బ్లూ టిక్ మార్కులు వస్తాయని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని పీఐబీ స్పష్టం చేసింది.
కరోనా వార్తలపై నిషేధమూ వదంతే: లైవ్ లా
‘‘గ్రూపు అడ్మిన్లకు హెచ్చరిక.. విపత్తు నిర్వహణచట్టం అమల్లోకి వస్తుంది. ప్రభుత్వ విభాగాలు తప్ప పౌరులెవరూ కరోనాపై ఏ పోస్టునూ షేర్ చేయకూడదు. అలా చేస్తే శిక్షార్హులు’’ అనే పోస్టు మీకు వాట్సా్‌పలో వచ్చిందా? అది ఒట్టి వదంతేనని తేలింది. ఈ పోస్టుకు తోడుగా ప్రభుత్వ ధ్రువీకరణ లేకుండా కొవిడ్-19కు సంబంధించిన ఎలాంటి వార్తనూ మీడియా ప్రచురించకుండా ఆదేశాలు ఇవ్వాల్సిందిగా కేంద్రం కోరిందంటూ తమ వెబ్‌సైట్‌లో వచ్చిన వార్తకు సంబంధం లేదని లైవ్ లా వెబ్‌సైట్ వివరణ ఇచ్చింది. కరోనా వార్తలపై నిషేధం వదంతేనని స్పష్టంచేసింది.