నయీం కేసుపై గవర్నర్‌కు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ లేఖ
ABN , First Publish Date - 2020-12-15T18:04:53+05:30 IST
గ్యాంగ్‌స్టర్ నయీం కేసులో సమగ్ర సత్వర విచారణకు ఆదేశించాలని గవర్నర్ తమిళిసైకు..
హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీం కేసులో సమగ్ర సత్వర విచారణకు ఆదేశించాలని గవర్నర్ తమిళిసైకు ఫారమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ లేఖ రాసింది. నయీం ఎన్ కౌంటర్ తర్వాత అతని నివాసాల్లో జరిగిన తనిఖీల్లో పదుల సంఖ్యలో ఆయుధాలు, పెద్ద మొత్తంలో మందుగుండు, పేలుడు పదార్థాలు లభించాయని, వాటిని సమకూర్చుకోవడంలో పోలీస్ అధికారులు అతనికి సహకరించి ఉంటారని ఎఫ్‌జీజీ కార్యదర్శి పద్మనాభరెడ్డి గవర్నర్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఏకె47వంటి ఆయుధాలను సమకూర్చుకున్న నయీంకు ఉగ్రవాదులతో సంబంధాలు ఉండే అవకాశాలు ఉంటాయని ఆందోళన వ్యక్తం చేశారు.
నయీంతో అంటకాగిన పోలీస్, రాజకీయ నాయకులు, రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అధికారులపై సమగ్ర విచారణ జరిపి వారందరిపై చర్యలు తీసుకునేలా ఆదేశించాలని గవర్నర్‌ను కోరారు. నయీం ఎన్‌కౌంటర్ తర్వాత లభించిన ఆయుధాలు, నగదు, పత్రాలకు సంబంధించి ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారిగా ఉన్న ఐజీ నుంచి సేకరించిన వివరాలను ఆ లేఖలో గవర్నర్‌కు వివరించారు. ఐజీ సమర్పించిన సిట్ నివేదికను లేఖకు జత చేశారు.