అన్నదాతల ఆగ్రహం.. ధాన్యానికి నిప్పు
ABN , First Publish Date - 2020-04-26T09:29:18+05:30 IST
ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకోవడానికి కొనుగోలు కేంద్రాల వద్దకు ..

- సిరిసిల్ల, నిజామాబాద్ జిల్లాల్లో ఘటనలు
డిచ్‌పల్లి/సిరిసిల్ల, ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి): ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకోవడానికి కొనుగోలు కేంద్రాల వద్దకు వస్తే తాలు, తేమ పేరిట మిల్లర్లు కోత పెడుతుండడంపై సిరిసిల్ల జిల్లాలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. రెండు రోజుల క్రితం లక్ష్మీపూర్ ఐకేపీ కేంద్రంలో ధాన్యానికి నిప్పంటించి రైతులు నిరసన వ్యక్తం చేయగా, తాజాగా.. శనివారం ఉదయం బోయినపల్లిలోని ఐకేపీ కొనుగోలు కేంద్రంలో ఇలాంటి ఘటనే జరిగింది. 24 టన్నుల ధాన్యంలో టన్ను వరకు తరుగు తీస్తామని మిల్లర్లు చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అన్నదాతలు ధాన్యానికి నిప్పుపెట్టారు. విషయం తెలుసుకున్న జిల్లా అదనపు కలెక్టర్ అంజయ్య, పౌర సరఫరాల శాఖ మేనేజర్ ఇర్ఫాన్ అక్కడికి చేరుకుని రైతులతో మాట్లాడారు. కాగా, నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం మెంట్రాజ్‌పల్లి కొనుగోలు కేంద్రంలో నెల రోజులుగా ధాన్యం కొనుగోళ్లు చేపట్టకపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ రైతులు ధర్నాకు దిగారు. కొనుగోలు కేంద్రం వద్దే ధాన్యానికి నిప్పు పెట్టి నిరసన తెలిపారు.