నాయిని సతీమణి కన్నుమూత
ABN , First Publish Date - 2020-10-27T09:02:27+05:30 IST
మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి కన్నుమూసిన ఐదు రోజులకే.. ఆయన సతీమణి అహల్య(68) తుదిశ్వాస విడిచారు.

భర్త మృతి చెందిన 5 రోజులకే...
కరోనా నుంచి కోలుకున్నా.. ఊపిరితిత్తుల సమస్య
నేడు అంత్యక్రియలు..
తీవ్ర విషాదంలో నాయిని కుటుంబం
రాంనగర్/కవాడిగూడ, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి కన్నుమూసిన ఐదు రోజులకే.. ఆయన సతీమణి అహల్య(68) తుదిశ్వాస విడిచారు. జూబ్లీహిల్స్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె.. సోమవారం సాయంత్రం ఏడున్నర గంటలకు మృతి చెందారు. నాయిని నర్సింహారెడ్డికి గత నెలలో కరోనా పాజిటివ్ రావడంతో.. ఆయన కుటుంబసభ్యులు కూడా పరీక్ష చేయించుకున్నారు. వారిలో నాయిని సతీమణి అహల్యకు కూడా వైరస్ పాజిటివ్ వచ్చింది. దీంతో ఇద్దరూ బంజారాహిల్స్‌లోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. చికిత్స అనంతరం ఇద్దరికి కరోనా నెగిటివ్ వచ్చింది. కానీ, ఇద్దరికి ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్ రావడంతో మెరుగైన వైద్యం కోసం మరో ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలోని క్రిటికల్‌కేర్ వార్డులో వారికి చికిత్స చేశారు. ఈ క్రమంలోనే.. నాయిని నర్సింహారెడ్డి ఈ నెల 21వ తే దీ అర్ధరాత్రి 12.25 నిమిషాలకు మృతిచెందారు.
22వ తేదీన.. భర్తను కడసారి చూసి, నివాళులు అర్పించేందుకు నాయిని భార్యను అంబులెన్స్‌లో ఆక్సిజన్ సిలిండర్ సపోర్టుతో, వీల్‌చైర్‌పై తీసుకొచ్చారు. అంత్యక్రియలు పూర్తయిన అనంతరం మళ్లీ ఆమెను ఆస్పత్రికి తరలించారు. నాయిని దంపతులకు కుమారుడు దేవేందర్ రెడ్డి, కుమార్తె సమతా రెడ్డి ఉన్నారు. ఐదు రోజుల వ్యవధిలోనే తల్లిదండ్రులిద్దరినీ కోల్పోవడంతో వారు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. అహల్య మరణవార్త తెలియగానే బంధువులంతా ఆస్పత్రి వద్దకు వచ్చి ఆమె భౌతిక కాయాన్ని చూసి కన్నీటిపర్యంతమయ్యారు. అహల్య అంత్యక్రియలను గచ్చిబౌలిలోని మ హాప్రస్థానంలో మంగళవారం మ ధ్యాహ్నం నిర్వహిస్తామని నాయిని అల్లుడు, రాంనగర్ కార్పొరేటర్ వి.శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. కాగా.. నాయిని సతీమణి మృతి పట్ల సీఎం కేసీఆర్, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, టీఆర్‌ఎస్ నేతలు ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.