కో-ఆప్షన్‌ పదవుల కోసం..ఎదురుచూపు

ABN , First Publish Date - 2020-03-12T11:08:54+05:30 IST

వరుస ఎన్నికలు ముగిసిపోయాయి... ఇంకా మిగిలిన పదవుల కోసం మళ్లీ గు‘లాబీ’లో పైరవీల జోరు తెరచాటున సాగిపోతోంది. ప్రధానంగా

కో-ఆప్షన్‌ పదవుల కోసం..ఎదురుచూపు

నాలుగు మునిసిపాలిటీల్లో పైరవీలు

అసెంబ్లీ సమావేశాలు కాగానే ఎంపిక

అభ్యర్థుల నోటిఫికేషన్‌ కోసం 

వేయిటింగ్‌


మహబూబాబాద్‌, ఆంధ్రజ్యోతి 

 వరుస ఎన్నికలు ముగిసిపోయాయి... ఇంకా మిగిలిన పదవుల కోసం మళ్లీ గు‘లాబీ’లో పైరవీల జోరు తెరచాటున సాగిపోతోంది. ప్రధానంగా మహబూబాబాద్‌ జిల్లాలో మునిసిపాలిటీ ఎన్నికలపై ఎన్నో ఆశలు పెంచుకుని పార్టీ ఆశీస్సులు లభించక పక్కకు తప్పకున్న నాయకులు ఇప్పుడు మరోరీతిలోనైనా నామినేటెడ్‌ పదవులు దక్కించుకునేందుకు తమ గాడ్‌ఫాదర్ల చుట్టూ తిరుగుతున్నారు. అలా కో-ఆప్షన్‌ పదవులనైనా దక్కించుకుని మునిసిపాలిటీలో కాలుమోపాలని ఆకాంక్షిస్తున్నారు. కొత్త మునిసిపల్‌ చట్టం ప్రకారం... ప్రతి మునిసిపాలిటీలో నాలుగు కో-ఆప్షన్‌ సభ్యులను ఎన్నుకునే అవకాశం ఉంటుంది. నూతన పాలకవర్గాలు ప్రమాణస్వీకారం చేసి పీఠాన్ని అధిష్టించిన క్రమంలోనే వైస్‌ చైర్మన్లను కూడా ఎన్నుకున్నారు. మొత్తానికి ఈ పాలకవర్గంలో నామినెటేడ్‌ కో-ఆప్షన్‌ పదవుల ద్వారా అర్హత సాధించే అవకాశాలు ఇక ఒక్కొక్క మునిసిపాలిటీలో నలుగురికి లభించనున్నాయి. ఆ దిశగా అర్హతలు... నిబంధనలను తెలుసుకుని తమకు చాన్స్‌ ఇవ్వాలంటూ ఆశావహులు పార్టీ పెద్దల ఆశీస్సుల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.


సీఎం కేసీఆర్‌ మొదట్నుంచి  ఎమ్మెల్యేలే ఆయా నియోజకవర్గాలకు సీఎం తరహాలో సుప్రీంలంటూ ప్రకటించి వున్న క్రమంలో మళ్లీ సింగిల్‌హ్యండ్‌ ఎమ్మెల్యేలు ఈ పదవుల పంపకాలు చేయనున్నారనేది పార్టీవర్గాల విశ్వాసం. దీనికనుగుణంగానే ఇప్పటికే మునిసిపాలిటీల చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పీఠాలను అధిష్టించిన నేతలు తమ వారి కోసం లాబీయింగ్‌ మొదలెట్టారు. మరికొందరు పవర్‌ లీడర్లు కూడా తమ వారికి పదవులు ఇప్పించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. 


మానుకోట మునిసిపాలిటీలో..

జిల్లాలో ఇటీవల జరిగిన మునిసిపాలిటీ ఎన్నికల్లో నాలుగు మునిసిపాలిటీల్లోనూ గులాబీ జోరే కొనసాగింది. ప్రతిష్టాత్మక మహబూబాబాద్‌ పూర్వ మునిసిపాలిటీలో 36 వార్డులకు గాను టీఆర్‌ఎస్‌ నుంచి ఒక ఏకగ్రీవంతో కలిపి 19 మంది ఎన్నికయ్యారు. కాంగ్రెస్‌ నుంచి 10 మంది ఎన్నిక కాగా, స్వతంత్రులుగా టీఆర్‌ఎస్‌ రెబల్స్‌ ముగ్గురు, సీపీఐ నుంచి ఇద్దరు, సీపీఎం నుంచి మరో ఇద్దరు ఎన్నికయ్యారు. ఫలితాల అనంతరం ఓసీ జనరల్‌కు రిజర్వు అయిన చైర్మన్‌ పీఠాన్ని డాక్టర్‌ పాల్వాయి రామ్మోహన్‌రెడ్డి అదిష్టించగా వైస్‌ చైర్మన్‌ పదవీని మైనారిటీకి ప్రాధాన్యం ఇస్తూ ఎండి.ఫరీద్‌కు కేటాయించారు.


ప్రస్తుతానికి ఈ మునిసిపాలిటీలో రాజకీయ పార్టీల పరంగా బలబలాలను పరిశీలిస్తే టీఆర్‌ఎ్‌సకు ఉన్న 19 స్థానాలకు తోడు ఇద్దరు స్వతంత్రులు, ఒక కాంగ్రెస్‌ మహిళా వార్డు కౌన్సిలర్‌ గులాబీ కండువా కప్పుకోవడంతో సంఖ్యా బలం 22కు చేరింది. దీనికనుగుణంగా ఈ మునిసిపాలిటీలో నాలుగు కో-ఆప్షన్‌ పదవుల ఎన్నిక ఆ పార్టీ సూచించిన వారికే లాంఛనం కానుంది. 


కొత్త మునిసిపాలిటీల్లోనూ...

జిల్లాలో కొత్తగా ఏర్పాటైన తొర్రూరు మునిసిపాలిటీలో 16 వార్డులకు గాను రెండు ఏకగ్రీవాలతో కలిపి 12 స్థానాల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులే విజయం సాధించారు. మూడింటిలో కాంగ్రెస్‌, ఒకటి బీజేపీ గెలుచుకుంది. దీంతో ఎస్సీ జనరల్‌కు రిజర్వు అయిన చైర్మన్‌ పీఠాన్ని మంగలపల్లి రాంచంద్రయ్య అధిష్టించారు. వైస్‌ చైర్మన్‌ పదవీకి జనరల్‌ సామాజికవర్గానికి ప్రాతినిధ్యం కల్పిస్తూ జినుగ సురేందర్‌రెడ్డికి అవకాశమిచ్చారు. డోర్నకల్‌ మునిసిపాలిటీలోని 15 వార్డుల్లో ఒక ఏకగ్రీవంతో కలిపి 11 స్థానాల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు విజయం సాధించారు.


మూడు స్థానాల్లో స్వతంత్రులు, ఒక స్థానంలో కాంగ్రెస్‌ అభ్యర్థి గెలిచారు. ఈ మునిసిపాలిటీకి ఎస్టీ జనరల్‌కు రిజర్వు అయిన చైర్మన్‌ పీఠాన్ని వాంకుడోతు వీరన్న అదిష్టించగా వైస్‌ చైర్మన్‌ స్థానంలో బీసీలకు ప్రాధాన్యం కల్పిస్తూ కేశబోయిన కోటిలింగానికి కట్టబెట్టారు. మరిపెడ మునిసిపాలిటీలో 15 వార్డులకు గాను రెండు ఏకగ్రీవాలతో కలిపి మొత్తం 15 స్థానాలు ఏకపక్షంగా టీఆర్‌ఎస్‌ అభ్యర్థులే ప్రాతినిధ్యంలోకి వచ్చారు. దీంతో ఎస్టీ మహిళకు రిజర్వు అయిన చైర్‌పర్సన్‌ పీఠంపై ముందుగా ప్రకటించినట్టే గుగులోతు సిందూరకుమారిని ఎన్నుకున్నారు. వైస్‌ చైర్మన్‌గా జనరల్‌కు ప్రాధాన్యత కల్పిస్తూ ముదిరెడ్డి బుచ్చిరెడ్డిని కూర్చోబెట్టారు. దీంతో మహబూబాబాద్‌తో పాటు ఈ మూడు మునిసిపాలిటీల్లోనూ కో-ఆప్షన్‌ పదవులు గులాబీ సూచించిన అభ్యర్థులకే లాంఛనం కానున్నాయి. 


అసెంబ్లీ తరువాయి.. 

జిల్లాలోని నాలుగు మునిసిపాలిటీల్లో నాలుగేసి చొప్పున 16 కో-ఆప్షన్‌ పదవుల ఎన్నికలు అసెంబ్లీ తరువాయే ఉంటాయని తెలుస్తోంది. ఈనెల 6న రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కాగా, 12 వర్కింగ్‌ డేస్‌లలో జరుగనున్నాయి. 9,10,15 తేదీల్లో సెలవులు కావడంతో ఈ నెల 21 వరకు అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతాయని భావిస్తున్నారు. మునిసిపాలిటీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక మొదలుకుని వారిని గెలిపించే పూర్తి బాధ్యతల్లో ఎమ్మెల్యేలే కీలకభూమిక పోషించారు. చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల ఎన్నిక అధిష్టానమే నిర్ణయిస్తుందని ప్రకటించినప్పటికి ఇందులోనూ ఎమ్మెల్యేలే చక్రం తిప్పారు.


రేపటి కో-ఆప్షన్‌ ఎన్నికలు కూడ ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే జరుగనున్న నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు ముగిసాకే జిల్లాలోని నాలుగు మునిసిపాలిటీల్లో కో-ఆప్షన్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ ప్రకటించి ఆపై ఎన్నికలు జరుగుతాయంటున్నారు.  కొత్త మునిసిపాలిటీ చట్టం ప్రకారం... తొలి మునిసిపల్‌ సమావేశంలోనే కో-ఆప్షన్‌ అభ్యర్థుల నోటిఫికేషన్‌ ఇవ్వాల్సి ఉంది. కాగా, మునిసిపల్‌ ఎన్నికలు కాగానే చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ల ఎన్నిక తరువాత మునిసిపాలిటీల్లో పట్టణ ప్రగతి నిర్వహించాల్సి రావడంతో కొన్నిచోట్ల అత్యవసర సమావేశాలు జరిగాయి. ఈ నెల చివరిలో పూర్తిస్థాయి తొలి సమావేశం నిర్వహించనున్న క్రమంలో ఈ నోటిఫికేషన్‌ వెలువడనుంది.


ఎవరెవరికంటే.. 

కొత్త మునిసిపల్‌ చట్టం ప్రకారం ఒక్కొ మునిసిపాలిటీలో నాలుగు కో-ఆప్షన్‌ సభ్యులకు గాను రెండు కో-ఆప్షన్‌ సభ్యుల స్థానాల్లో మునిసిపాలిటీపై అవగాహన ఉన్న వారిని ఎంచుకోవాల్సి ఉంటుందని తెలుస్తోంది. ఇందులో ఒక మహిళ, ఒక పురుషుడు ఉంటారు. పూర్వ కౌన్సిలర్లు, మునిసిపాలిటీ ఉద్యోగులు లేదా మునిసిపాలిటీకి అనుబంధంగా పనిచేసిన వారిలో ఎవరికైన అవకాశం కల్పిస్తారంటున్నారు. మిగిలిన మరో రెండేసి కో-ఆప్షన్‌ సభ్యులలో మైనార్టీలను ఎన్నుకోవాల్సి ఉంటుంది. 


ఇందులో కూడా ఒక మహిళ, ఒక పురుషుడు ఉంటాడు. వయో పరిమితి 21 దాటాలన్న నిబంధన స్పష్టంగా ఉంది. మైనారిటీల ఎంపిక విషయంలో టీఆర్‌ఎ్‌సకు సులువైన అంశమే అయినప్పటికి మునిసిపాలిటీపై అవగాహనతో రిటైర్డ్‌ ఉద్యోగి ఎంపిక విషయంలో కొంత కష్టతరంగా కన్పిస్తోంది. ఇప్పటికే నాలుగేసి పదవులపై కన్నెసిన ఆశావహులు ఎమ్మెల్యేల ప్రసన్నం కోసం తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల మద్దతు కూడా దీసుకుంటున్నారు. మరికొందరు గులాబీ పవర్‌ లీడర్లతో ఫోన్‌లు చేయించుకుంటున్నారు.

Updated Date - 2020-03-12T11:08:54+05:30 IST