మట్టి టిప్పర్లను అడ్డుకున్నందుకు..గద్వాలలో పోలీసులపై దాడి

ABN , First Publish Date - 2020-12-30T07:35:39+05:30 IST

జోగులాంబ-గద్వాల జిల్లాలో మట్టి మాఫియా రెచ్చిపోయింది. అక్రమ మట్టి రవాణాను అడ్డుకున్నందుకు పోలీసులపై దాడికి పాల్పడింది. విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం.. గద్వాల మండలం కాకులారం గ్రామంలో

మట్టి టిప్పర్లను అడ్డుకున్నందుకు..గద్వాలలో పోలీసులపై దాడి

ఎస్సై, కానిస్టేబుల్‌కు స్వల్ప గాయాలు


గద్వాల, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి): జోగులాంబ-గద్వాల జిల్లాలో మట్టి మాఫియా రెచ్చిపోయింది. అక్రమ మట్టి రవాణాను అడ్డుకున్నందుకు పోలీసులపై దాడికి పాల్పడింది. విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం.. గద్వాల మండలం కాకులారం గ్రామంలో సోమవారం అర్ధరాత్రి అక్రమంగా మట్టిని తరలిస్తున్నారని ఉప్పందుకున్న గద్వాల రూరల్‌ ఎస్సై శ్రీకాంత్‌రెడ్డి తన బృందంతో కలిసి తనిఖీకి వెళ్లారు. ఈ క్రమంలో అక్రమంగా మట్టిని తరలిస్తున్న టిప్పర్లను అడ్డుకున్నారు. దాంతో.. కాకులారం గ్రామానికి చెందిన బండారి ఆంజనేయులు, అతడి తమ్ముడు జయన్న పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. మట్టి తరలించడానికి అనుమతులు లేకపోవడంతో.. పోలీసులు టిప్పర్లను సీజ్‌ చేసేందుకు ప్రయత్నించారు. దీంతో.. ఆంజనేయులు, జయన్న పోలీసులను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా తోపులాట జరిగింది. ఈ ఘటనలో ఎస్సై శ్రీకాంత్‌రెడ్డి చేతికి స్వల్పంగా గాయమైంది. కానిస్టేబుల్‌ లక్ష్మన్న ముక్కు భాగంలో దెబ్బ తగలడంతో రక్తం కారిందని సమాచారం. ఈ ఘటనపై ఎస్సై శ్రీకాంత్‌రెడ్డిని వివరణ కోరగా.. తమకు ఎలాంటి గాయాలు కాలేదని, తమ విధులకు అడ్డుపడ్డందుకు ఆంజనేయులుపై కేసు నమోదు చేశామన్నారు. 

Updated Date - 2020-12-30T07:35:39+05:30 IST