ఏఐపై దృష్టి పెట్టండి
ABN , First Publish Date - 2020-12-20T07:56:02+05:30 IST
కాలాన్ని బట్టి యుద్ధ తంత్రం మారుతోందని.. స్పేస్ నుంచి సైబర్ వార్ వరకు అన్ని రంగాల్లో సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పిలుపునిచ్చారు. దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో శనివారం ఏర్పాటు చేసినకంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ కార్యక్రమానికి ఆయన

స్పేస్, సైబర్ యుద్ధాలను దీటుగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి
దుండిగల్‌లో ఎయిర్‌ఫోర్స్ కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్‌లో రాజ్‌నాథ్
డీఆర్‌డీవోను సందర్శించిన రక్షణ మంత్రి
హైదరాబాద్/సిటీ/అల్వాల్, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి): కాలాన్ని బట్టి యుద్ధ తంత్రం మారుతోందని.. స్పేస్ నుంచి సైబర్ వార్ వరకు అన్ని రంగాల్లో సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పిలుపునిచ్చారు. దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో శనివారం ఏర్పాటు చేసినకంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై.. శిక్షణ పూర్తిచేసుకున్న కేడెట్లతో ప్రతిజ్ఞ చేయించారు. పాసింగ్ పరేడ్‌లో వాయుసేనకు సంబంధించి వివిధ విభాగాల్లో శిక్షణ పూర్తిచేసుకున్న 21 మంది మహిళా కేడెట్లు, 11 మంది నేవీ, కోస్టు గార్డులతో సహా 114 మందికి రాష్ట్రపతి కమిషన్ అందించి శుభాకాంక్షలు తెలిపారు.
శత్రువులు అంతరిక్షం నుండి లేదా సైబర్ దాడి చేసే అవకాశం కూడా ఉందని రాజ్‌నాథ్ అన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న కేడెట్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)పై అవగాహన పెంచుకోవాలని సూచించారు. మనదేశ సరిహద్దు వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి ప్రయత్నిస్తామని, మన సార్వభౌమాధికారంపై జరుగుతున్న దాడులను తిప్పికొట్టేందుకు అన్ని విధాల సన్నద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.
తేజస్ నుంచి రాఫెల్ వరకు యుద్ధ విమానాల శ్రేణితో మన వాయుసేన మునుపటికన్నా శక్తిమంతమైందని చెప్పారు. కరోనా విస్తరిస్తున్న సమయంలో భారత్ పట్ల చైనా వైఖరిని ప్రపంచదేశాలు గర్హించాయన్నారు. శిక్షణలో ప్రతిభ చూపిన ఫ్లయింగ్ ఆఫీసర్ ఆశిష్ ఖత్రికి ప్రెసిడెంట్ ఫ్లాగ్‌తో పాటు ఛీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ స్వార్డ్ (కరవాలాన్ని)ని బహూకరించారు. నావిగేషన్ గ్రౌండ్ డ్యూటీ విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఫ్లయింగ్ ఆఫీసర్ క్షీర్‌సాగర్‌కు ప్రెసిడెంట్ ఫ్లాగ్‌లను అందించారు.
భవిష్యత్తుకు రోడ్ మ్యాప్ సిద్ధం చేయండి
సైబర్ సెక్యూరిటీ, స్పేస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహా భవిష్యత్ అవసరాలపై డీఆర్‌డీవో దృష్టి సారించాలని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధికారులకు సూచించారు. అందుకు అవసరమైన రోడ్ మ్యాప్ సిద్ధం చేసుకోవాలని చెప్పారు. హైదరాబాద్ డీఆర్‌డీవో కేంద్రంలోని డా.అబ్దుల్ కలాం మిసైల్ కాంప్లెక్స్‌ను శనివారం ఆయన సందర్శించారు. హైపర్‌సోనిక్ విండ్ టన్నెల్(హెచ్‌డబ్ల్యూటీ)ను ఈ సందర్భంగా ప్రారంభించారు.
కొవిడ్ విపత్కర పరిస్థితుల్లో డీఆర్‌డీవో దేశీయ పరిజ్ఞానంతో రూపొందించిన ఆధునిక పరికరాలు, అందించిన సహకారం ఎంతో గొప్పదని ఆయన ప్రశంసించారు. పరిశ్రమలు, రక్షణ తయారీ రంగాల అభివృద్ధికి డీఆర్‌డీవో సమకూర్చే అపారమైన శక్తి సామర్థ్యాలు భారత్‌ను సూపర్ మిలిటరీ శక్తిగా మార్చాలని రాజ్‌నాథ్ సింగ్ అధికారులకు సూచించారు.
ఎక్స్‌ప్లోసివ్ టెస్ట్ ఫెసిలిటీ ఫర్ ప్రొపెల్లెంట్ అండ్ ఎక్స్‌ప్లోసివ్ సిస్టమ్‌కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. హైదరాబాద్‌లో ఇంతటి టెక్నాలజీ అభివృద్ధి కేంద్రం ఉండటం ఎంతో ఆనందంగా ఉందన్నారు. డీఆర్‌డీఓ ఛైర్మన్ డా.సతీ్‌షరెడ్డితోపాటు ఇతర ఉన్నతాధికారులు రాజ్‌నాథ్ సింగ్ వెంట ఉన్నారు.