సాయం బంద్‌..!

ABN , First Publish Date - 2020-10-31T09:07:05+05:30 IST

గ్రేటర్‌ హైదరాబాద్‌లో వరద సాయం పంపిణీ నిలిచిపోయింది. ఉన్నత స్థాయి ఆదేశాల నేపథ్యంలో రూ.10 వేల సాయం అందజేతను తాత్కాలికంగా

సాయం బంద్‌..!

 • ఆందోళనలు పెరుగుతుండడంతో నిలిపివేత
 • వరద సాయం తాత్కాలికంగా నిలిపివేత..
 • దారి తప్పుతోందనే ప్రభుత్వం నిర్ణయం?
 • తమకు అందలేదంటూ రోడ్డెక్కుతున్న ప్రజలు..
 • ఎమ్మెల్యేలు, కార్పొరేటర్ల మితిమీరిన జోక్యం
 • ఓట్ల కొనుగోలుగా మారిందన్న ఆరోపణలు..
 • అధికారులు, ఉద్యోగుల తీరూ కారణం!
 • 3.91 లక్షల కుటుంబాలు బాధితులుగా గుర్తింపు..
 • ఇప్పటివరకు 3.20 లక్షల మందికి సాయం అందజేత
 • నిజమైన బాధితుల్లో 40% మందికి అందని సాయం..
 • రోజురోజుకు పెరుగుతున్న బాధిత కుటుంబాలు


హైదరాబాద్‌ సిటీ, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): గ్రేటర్‌ హైదరాబాద్‌లో వరద సాయం పంపిణీ నిలిచిపోయింది. ఉన్నత స్థాయి ఆదేశాల నేపథ్యంలో రూ.10 వేల సాయం అందజేతను తాత్కాలికంగా నిలిపివేసినట్టు తెలిసింది. వరద బాధిత ప్రాంతాల్లోని కుటుంబానికి అందాల్సిన సాయం దారితప్పుతోందన్న యోచనతోనే సర్కారు ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. దీంతో క్షేత్ర స్థాయిలో పంపిణీ నిలిపివేయాలని జీహెచ్‌ఎంసీలో ఆదేశాలు వెలువడ్డాయి. శుక్రవారం సెలవుదినం కావడంతో గ్రేటర్‌లోని మెజారిటీ ప్రాంతాల్లో సాయం పంపిణీ జరగలేదు. ఇప్పటివరకు అందజేసింది పోను.. మిగతా మొత్తాన్ని శనివారం జోనల్‌ కార్యాలయాల్లోని ఫైనాన్షియర్‌ అడ్వయిజర్‌ (ఎఫ్‌ఏ) ఖాతాలో జమ చేయాలని జీహెచ్‌ఎంసీలోని ఉన్నతాధికారి ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. దీంతోపాటు ఇప్పటివరకు సాయం అందుకున్న బాధితుల వివరాలను సర్కిళ్ల నుంచి తీసుకొని పరిశీలించాలని ఎగ్జామినర్‌ ఆఫ్‌ అకౌంట్స్‌ను ఆదేశించారు. పరిశీలన పూర్తి చేసి కేంద్ర కార్యాలయానికి వివరాలు పంపాలని, ఇందుకోసం ఆదివారం కూడా పని చేయాలని ఆర్థిక విభాగం అధికారులను ఆదేశించారు. 


పెరుగుతున్న బాధిత కుటుంబాలు..

వందేళ్లకు పైగా రికార్డు స్థాయి వర్షపాతం నమోదు కావడంతో గ్రేటర్‌లోని వేలాది కాలనీలు నీట మునిగాయి. లక్షలాది ఇళ్లలోకి వరద నీరు చేరి రోజుల తరబడి ఉంది. దీంతో స్పందించిన సర్కారు.. వరద బాధిత ప్రాంతాల్లో ఒక్కో కుటుంబానికి రూ.10 వేల చొప్పున ఇవ్వాలని నిర్ణయించింది. పురపాలక శాఖకు రూ.550 కోట్లు విడుదల చేశారు. ఇందులో రూ.400 కోట్లు జీహెచ్‌ఎంసీకి కేటాయించారు. ఈ మేరకు వారం రోజులుగా నగరంలో వరద సాయం పంపిణీ జరుగుతోంది. గ్రేటర్‌లోని 1572 కాలనీల్లో 3.91 లక్షల కుటుంబాలు ముంపు బారినపడ్డట్లు అధికారికంగా గుర్తించారు. ఇప్పటివరకు 3.20 లక్షల మందికి సాయం అందినట్టు జీహెచ్‌ఎంసీ వర్గాలు చెబుతున్నాయి. అయితే గుర్తించిన కుటుంబాల్లోనే దాదాపు 40 శాతం కుటుంబాలకు ఇప్పటికీ సాయం అందలేదని తెలుస్తోంది. దీనిని బట్టి సాయం అందినవారిలో చాలామంది నిజమైన బాధితులు లేరన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు బాధిత కుటుంబాలుగా చెబుతున్న సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ సంఖ్య 6 లక్షల వరకు పెరిగే అవకాశం ఉందంటేన్నారు. ఇది అధికారికంగా గుర్తించిన దాని కంటే 80 శాతం అదనం కావడం గమనార్హం. 


దారి తప్పిన సాయం...

సాయం అందజేత దారి తప్పడంపై ప్రజాగ్రహం పెల్లుబుకుతోంది. పలు ప్రాంతాల్లో ఎమ్మెల్యేలను, కార్పొరేటర్లను, అధికారులను ప్రజలు నిలదీస్తున్నారు. ఇళ్లలోకి నీళ్లు వచ్చి సర్వం కోల్పోయినా.. మాకు సాయం అందించరా? అని కొందరు రోడ్డెక్కుతున్నారు. మరి కొందరు జీహెచ్‌ఎంసీ కార్యాలయాల వద్ద ధర్నా చేస్తున్నారు. కొందరు కార్పొరేటర్లు, ఎమ్మెల్యేల మితిమీరిన జోక్యం.. అధికారుల కక్కుర్తి కారణంగానే ఈ పరిస్థితి తలెత్తిందని ప్రభుత్వానికి సమాచారం అందినట్టు తెలిసింది. చాలా మంది కార్పొరేటర్లు తమ అనుకూల ప్రాంతాలు, అనుచరుల కుటుంబాలకు రూ.10 వేలు అందేలా అధికారులపై ఒత్తిడి తెచ్చినట్టు ఆరోపణలున్నాయి. ఇందుకు కొందరు అధికారులు, ఉద్యోగులకూ ఎంతో కొంత ముట్టజెప్పినట్టు సమాచారం. మరి కొన్ని చోట్ల రూ.5 వేలు మాత్రమే ఇచ్చి వాటాలు పంచుకున్నారన్న ప్రచారం ఉంది. బాగ్‌లింగంపల్లిలో చుక్క నీరు కూడా రాని ఓ ప్రాంతంలో సాయం అందగా, ముంపునకు గురైన మరో ఏరియాలో కొన్ని కుటుంబాలకు నయా పైసా కూడా ఇవ్వలేదు. అంబర్‌పేటలోని ఓ ప్రాంతలో రూ.5 వేలే ఇస్తున్నారని స్థానికులు ప్రశ్నించిన విషయం పోలీ్‌సస్టేషన్‌ వరకు వెళ్లింది. తన ఇల్లు నీట మునిగినా సాయం ఇవ్వలేదని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మొత్తంగా కొందరు కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు దీనిని ఓట్లు కొనుక్కునే కార్యక్రమంగా మార్చారన్న ఆరోపణలున్నాయి. ఆందోళనలు పెరుగుతుండడంతో తాత్కాలికంగా సాయం అందజేతను నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. వరద బాధిత కుటుంబాలను ఏ ప్రాతిపదికన గుర్తించాలన్న దానిపై స్పష్టమైన నిర్ణయం తీసుకున్న అనంతరం పంపిణీ తిరిగి ప్రారంభించే అవకాశమున్నట్టు తెలిసింది. అదే సమయంలో ఇప్పటివరకు అందిన సాయం నిజమైన బాధితులకే అందిందా? దారి తప్పిందా? అన్నది కూడా గుర్తించే పనిలో ప్రభుత్వం ఉన్నట్టు తెలిసింది. ఇందుకోసం సేకరించిన ఆధార్‌ కార్డు నెంబర్లలో కొందరి ఇళ్లను ర్యాండమ్‌గా చెక్‌ చేసే అవకాశముందని చెబుతున్నారు. తప్పులు జరిగాయని తేలితే బాధ్యులైన అధికారులు, కార్పొరేటర్ల విషయంలో కఠినంగా వ్యవహరించే అవకాశం ఉందని ఓ అధికారి తెలిపారు. 


ఇవీ వివరాలు...

అధికారికంగా గుర్తించిన ముంపు కాలనీలు- 1572

వరద బాధిత కుటుంబాలు - 3,91,966

ప్రభుత్వం కేటాయించిన నిధులు రూ.550 కోట్లు

జీహెచ్‌ఎంసీకి విడుదల చేసినవి - రూ.400 కోట్లు

ఇప్పటివరకు సాయం అందిన కుటుంబాలు- 3.20 లక్షలు

పంపిణీ చేసిన డబ్బులు - రూ.320 కోట్లు

ఇంకా సాయం అందాల్సిన కుటుంబాలు - 2లక్షలు 

Read more