మూడు రోజుల్లో 5 వేల ఫోన్‌ కాల్స్‌

ABN , First Publish Date - 2020-06-21T08:54:46+05:30 IST

ఇంటర్‌ పరీక్షల్లో ఫెయిలైనవారిలో సున్నిత మనస్కులైన విద్యార్థులు క్షణికావేశంలో బలవన్మరణాలకు పాల్పడటం వంటి ఘటనలు

మూడు రోజుల్లో 5 వేల ఫోన్‌ కాల్స్‌

  • ఇంటర్‌ బోర్డులో సైకాలజిస్టుల సేవలు..
  • కౌన్సిలర్లకు ఫెయిల్‌ విద్యార్థుల ఫోన్‌
  • మానసిక ఒత్తిడిని తగ్గిస్తున్న నిపుణులు 
  • సత్ఫలితాలిస్తున్న క్లినికల్‌ కౌన్సెలింగ్‌


హైదరాబాద్‌, జూన్‌ 20(ఆంధ్రజ్యోతి): ఇంటర్‌ పరీక్షల్లో ఫెయిలైనవారిలో సున్నిత మనస్కులైన విద్యార్థులు క్షణికావేశంలో బలవన్మరణాలకు పాల్పడటం వంటి ఘటనలు ప్రతి సంవత్సరం చోటుచేసుకుంటున్నాయి. ఈ సమస్యకు పరిష్కారంగా ఇంటర్‌ బోర్డు ఈసారి క్లినికల్‌ సైకాలజిస్టుల సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ముందుగానే దీనిపై ప్రచారం చే సింది. ఫెయిలైనంత మాత్రాన కుంగిపోకుండా, అఘాయిత్యాలకు పాల్పడకుండా వారిలో ఆత్మవిశ్వాసం నింపాలన్న లక్ష్యంగా ఏడుగురు మానసిక నిపుణుల సేవలను అందుబాటులో ఉంచింది. ఇంటర్‌ ఫలితాలు వెల్లడించిన తర్వాత.. అంటే గురువారం సాయంత్రం నుంచి శనివారం సాయంత్రం వరకు మానసిక నిపుణులకు దాదాపు 5 వేలకుపైగా ఫోన్‌కాల్స్‌ వచ్చాయి. 3రోజుల్లో ఒక్కొక్కరికి సరాసరిగా 600-800 కాల్స్‌ వచ్చాయని సైకాలజిస్టులు తెలిపారు.


ఎక్కువమంది  తమకు మార్కులు తక్కువగా వచ్చాయని బాధపడుతున్నారని వారు చెప్పారు. పదోతరగతి, డిగ్రీ పరీక్షలు రద్దు చేసి.. వారందరినీ పాస్‌ చేసినప్పుడు, ఇంటర్‌ విద్యార్థులను ఎందుకు ఫెయిల్‌ చేస్తున్నారన్న ప్రశ్నలూ విద్యార్థుల నుంచి వస్తున్నాయన్నారు. ‘‘ఫెయిలైతే ఇక బతకడం ఎందుకు? చావాలనుంది.. ఏం చేయమంటారు?’’ అని అడుగుతున్నారని క్లినికల్‌ సైకాలజిస్ట్‌ అనుపమ గుట్టిందేవి ‘ఆంధ్రజ్యోతి’కి చెప్పారు. అలాంటి వారిని ప్రత్యేక కేసులుగా భావించి, ఎక్కువసేపు కౌన్సెలింగ్‌ చేస్తున్నామని, వారికి అర్థమయ్యేలా చెబుతూ.. వారిలోని మానసిక ఆందోళనలను దూరం చేస్తున్నామన్నారు. ఆత్మహత్య ఆలోచనతో ఉన్న విద్యార్థులు కౌన్సెలింగ్‌ తర్వాత వారి ఆలోచనలు మార్చుకున్నారని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. మరోవైపు.. పరీక్షలకు సంబంధించిన అనుమానాల నివృత్తికి ఏర్పాటుచేసిన హెల్ప్‌లైన్‌ నెంబర్లకు చాలా మంది విద్యార్థులు ఫోన్లు చేస్తున్నారు. అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్ష గురించి ఎక్కువగా అడుగుతున్నారని అధికారులు చెప్పారు.


సైకాలజిస్టుల ఫోన్‌ నంబర్లు ఇవే..

డాక్టర్‌ అనిత - 73372 25803

డాక్టర్‌ మజర్‌ అలీ - 73372 25425

డాక్టర్‌ రజిని - 73372 25364

పి.జవహర్‌లాల్‌ నెహ్రూ - 73372 25360

ఎస్‌.శ్రీలత - 73372 25083

శైలజ పీసపాటి - 73372 25098

అనుపమ గుట్టిందేవి 73372 25763

Updated Date - 2020-06-21T08:54:46+05:30 IST