లాక్‌ తీయొచ్చు

ABN , First Publish Date - 2020-04-15T08:42:58+05:30 IST

‘‘తీవ్ర (కరోనా) ముప్పున్న విభాగంలో లేని ప్రాంతాల్లో.. ఆ పరిస్థితికి చేరువయ్యే అవకాశం లేని ప్రాంతాల్లో ఏప్రిల్‌ 20 నుంచి కొన్ని అవసరమైన కార్యకలాపాలను షరతులతో, కఠిన నిబంధనలతో అనుమతిస్తాం’’

లాక్‌ తీయొచ్చు

రాష్ట్రంలో ఐదు జిల్లాల్లో కరోనా నిల్‌

మరో 6 జిల్లాల్లో తగ్గిన ప్రభావం

లాక్‌డౌన్‌ నుంచి వాటికి మినహాయింపు?

ప్రధాని ప్రకటనతో రాష్ట్రంలో మొదలైన చర్చ

మినహాయింపుపై తుది నిర్ణయం రాష్ట్రానిదే!


హైదరాబాద్‌లో ఇలా..

హైదరాబాద్‌ నగరంలో 30 సర్కిళ్లు ఉండగా అందులో ఎల్బీనగర్‌, హయాత్‌నగర్‌  సర్కిళ్లలో మాత్రమే కరోనా కేసులు నమోదు కాలేదు. మిగతా 28 సర్కిళ్లలోనూ కేసులున్నాయి. చుట్టూ అన్ని సర్కిళ్లలో వైరస్‌ సోకినవారు ఉన్న నేపథ్యంలో.. ఈ రెండు సర్కిళ్లకు మాత్రమే మినహాయింపు ప్రకటించకపోవచ్చు. ఒకవేళ ప్రకటించినా.. రాకపోకలను నియంత్రించడం చాలా కష్టమే. 


హైదరాబాద్‌, ఏప్రిల్‌ 14 (ఆంధ్రజ్యోతి): ‘‘తీవ్ర (కరోనా) ముప్పున్న విభాగంలో లేని ప్రాంతాల్లో.. ఆ పరిస్థితికి చేరువయ్యే అవకాశం లేని ప్రాంతాల్లో ఏప్రిల్‌ 20 నుంచి కొన్ని అవసరమైన కార్యకలాపాలను షరతులతో, కఠిన నిబంధనలతో అనుమతిస్తాం’’

..లాక్‌డౌన్‌ను మే 3 దాకా పొడిగిస్తున్నట్టు చేసిన ప్రకటనలో ప్రధాని పేర్కొన్న సడలింపు ఇది! ఈ నేపథ్యంలో రాష్ట్రంలో వైరస్‌ ప్రభావం లేని ప్రాంతాలవారిలో ఆశలు చిగురిస్తున్నాయి. షరతులతో అయినా లాక్‌డౌన్‌ను సడలిస్తామన్న ప్రధాని ప్రకటనతో రాష్ట్రంలో చర్చ మొదలైంది. ప్రధాని పేర్కొన్న షరతుల ప్రకారం చూస్తే.. రాష్ట్రంలో దాదాపు 11 జిల్లాలు లాక్‌డౌన్‌ నుంచి మినహాయింపు పొందే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఎందుకంటే.. ఆ పదకొండింటిలోనూ ఐదు జిల్లాల్లో ఒక్క కొవిడ్‌-19 పాజిటివ్‌ కేసు కూడా నమోదు కాలేదు.


అవేంటంటే.. నారాయణ పేట, వనపర్తి, వరంగల్‌ రూరల్‌, మంచిర్యాల, యాదాద్రి జిల్లాలు. అయినప్పటికీ, లాక్‌డౌన్‌లో భాగంగా ఈ జిల్లాల్లో కూడా కఠిన ఆంక్షలను అమలు చేస్తున్నారు. ఇప్పటిదాకా ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం.. ప్రధాని పేర్కొన్న 20వ తేదీ గడువు మరో ఐదు రోజుల్లో పూర్తికానుండడంతో ఈ జిల్లాలను లాక్‌డౌన్‌ నుంచి మినహాయిస్తారని అధికారులు, స్థానికులు భావిస్తున్నారు. 


తగ్గుతున్న ప్రభావం..

ఐదు జిల్లాల్లో ఒక్క కేసూ లేకపోగా.. మరో ఆరు జిల్లాల్లో చాలా తక్కువగా కేసులు నమోదయ్యాయి. అవి కూడా తగ్గుముఖం పట్టే దశలో ఉన్నాయి. ఉదాహరణకు.. జనగాంలో ఒకటి, రెండు కేసులు నమోదైనా వైరస్‌ సోకినవారు ఆస్పత్రుల్లో చికిత్స పొంది, పూర్తిగా కోలుకుని ఇళ్లకు వెళ్లారు. ఆ తర్వాత ఆ జిల్లాలో కొత్త కేసులు నమోదు కావట్లేదు. చాలా మంది క్వారంటైన్‌ సమయం పూర్తయింది. అలాగే.. మహబూబాబాద్‌, సిద్దిపేట జిల్లాల్లో ఒక్కో కరోనా కేసు ఉంది.  ములుగు, నాగర్‌కర్నూలు, జగిత్యాల జిల్లాల్లో ప్రస్తుతం రెండేసి కేసులు ఉన్నాయి. అవన్నీ కూడా మార్చిలో నమోదైన కేసులే. ఈ ఐదు జిల్లాల్లో ఏప్రిల్‌లో కొత్తగా ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. అంటే.. ఈ జిల్లాల్లో కరోనా వైరస్‌ ప్రభావం ప్రస్తుతానికి లేనట్టుగానే భావించవచ్చు. దీంతో, ఈ 11 జిల్లాలను మినహాయింపు పరిధిలో చేర్చడానికి వీలుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.  


జిల్లా పరిధిలోనే..

ఒకవేళ, ఏప్రిల్‌ 20 తర్వాత ఈ 11 జిల్లాలకు మినహాయింపునిచ్చినా.. కార్యకలాపాలను జిల్లా పరిధి వరకే పరిమితం చేసే అవకాశం ఉంది. ఎందుకంటే జిల్లాల సరిహద్దు ప్రాంతాల్లో.. ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల వైరస్‌ వ్యాప్తి చెందే ప్రమాదం ఉంటుంది. మినహాయింపు ప్రకటించేటప్పుడు ఇలాంటివాటన్నింటినీ తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకుంటారని.. అందులో భాగంగా ఆయా జిల్లాల్లోకి రాకపోకలను కట్టడి చేసే అవకాశం ఉందని అంచనా. దీని వల్ల.. ఆయా జిల్లాల వారు బయటకు వెళ్లడానికి, ఇతరులు లోపలికి రావడానికి అవకాశం ఉండదు. వైరస్‌ ముప్పు తగ్గుతుంది. అదే సమయంలో జిల్లాలో అంతర్గతంగా ఆర్థిక కార్యకలాపాలు, వ్యవసాయ పనులు పూర్తిస్థాయిలో ఊపందుకోవడానికి అవకాశం ఉంటుంది. జిల్లా పరిధిలో ఉండే చిన్న చిన్న ఫ్యాక్టరీలు, ఇతర వ్యాపారాలు కూడా తిరిగి ప్రారంభమయ్యి.. ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు, ప్రభుత్వానికి కూడా కొంత ఆదాయం లభిస్తుందని అంచనా వేస్తున్నారు. 


మరిన్ని రంగాలకు మినహాయింపు..

లాక్‌డౌన్‌ కారణంగా ఇప్పటికే దేశ వ్యాప్తంగా వ్యాపార కార్యక్రమాలు నిలిచిపోవడంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రంలోనూ అదే పరిస్థితి. వ్యవసాయ, ఔషధ రంగాలు మినహా మరే రంగానికీ మినహాయింపులు లేకపోవడంతో ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోయి రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం గణనీయంగా పడిపోయింది. అత్యవసర పనుల కోసం కూడా నిధులు లేని పరిస్థితి నెలకొంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని మరికొన్ని రంగాలను లాక్‌డౌన్‌ నుంచి మినహాయించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా పరిశ్రమలు, నిర్మాణ రంగాలకు వెసులుబాటు కల్పించవచ్చని సమాచారం.


అందునా.. కార్మికుల అవసరం తక్కువగా ఉండే పరిశ్రమల కార్యకలాపాలకు అనుమతించే అవకాశం కనిస్తున్నది. ఇలాంటి పరిశ్రమలకు అనుమతి ఇవ్వడం వల్ల ఆర్థిక కార్యకలాపాలు కొనసాగడంతో పాటు, కొందరికి ఉపాధి లభించనుంది. లాక్‌డౌన్‌ కారణంగా ప్రస్తుతం కొన్ని రకాల వస్తువులకు కొరత ఏర్పడింది. ఇలా కొరత ఏర్పడిన వస్తువులను ఉత్పత్తి చేసే పరిశ్రమలను కొనసాగించడం ద్వారా ఆ సమస్యను కూడా అధిగమించడానికి అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. నిర్మాణ రంగానికి మినహాయింపు ఇవ్వడం వల్ల.. కొందరికి ఉపాధి లభించడంతో పాటు ప్రభుత్వానికి పన్నుల రూపంలో కొంత ఆదాయం లభించే వీలు ఉంది.


హైదరాబాద్‌లో మాత్రం..

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ విషయానికొస్తే.. నగరంలో మొత్తం ముప్పై సర్కిళ్లు ఉండగా అందులో ఎల్బీనగర్‌, హయత్‌నగర్‌ సర్కిళ్లలో మాత్రమే కరోనా కేసులు నమోదు కాలేదు. మిగతా 28 సర్కిళ్లలోనూ కొవిడ్‌-19 పాజిటివ్‌ కేసులున్నాయి. చుట్టూ అన్ని సర్కిళ్లలో వైరస్‌ సోకినవారు ఉన్న నేపథ్యంలో.. ఈ రెండు సర్కిళ్లకు మాత్రమే మినహాయింపు ప్రకటించకపోవచ్చు. ఒకవేళ ప్రకటించినా.. రాకపోకలను నియంత్రించడం చాలా కష్టమే. కాగా..  తెలంగాణలో లాక్‌డౌన్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్‌ 30 దాకా పొడిగించిన సంగతి తెలిసిందే.  ఏప్రిల్‌ 20 తర్వాత సురక్షిత ప్రాంతాల్లో మినహాయింపులను పరిశీలిస్తామని కేంద్రం ప్రకటించినా రాష్ట్రప్రభుత్వమే తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని సమాచారం. 

Updated Date - 2020-04-15T08:42:58+05:30 IST