ఉత్తర తెలంగాణ నుంచే శ్రీకారం!

ABN , First Publish Date - 2020-08-20T09:09:54+05:30 IST

పార్టీ ఆవిర్భావం నుంచి తమకు కలిసి వస్తున్న ఉత్తర తెలంగాణ నుంచే నూతన కార్యాలయాల ప్రారంభోత్సవానికి శ్రీకారం చుట్టాలని టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం

ఉత్తర తెలంగాణ నుంచే శ్రీకారం!

  • తొలి  పార్టీ జిల్లా కార్యాలయ ప్రారంభోత్సవం అక్కడే
  • సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా..
  • వర్షాలు పూర్తిగా తగ్గాక కార్యక్రమం
  • టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం నిర్ణయం

హైదరాబాద్‌, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): పార్టీ ఆవిర్భావం నుంచి తమకు కలిసి వస్తున్న ఉత్తర తెలంగాణ నుంచే నూతన కార్యాలయాల ప్రారంభోత్సవానికి శ్రీకారం చుట్టాలని టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం నిర్ణయించింది. రాష్ట్రంలో వర్షాలు పూర్తిగా తగ్గుముఖం పట్టాక ఈ కార్యక్రమం ఉండేలా పార్టీ ముఖ్యనేతలు సన్నాహాలు చేస్తున్నారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ తర్వాత ప్రతి జిల్లా కేంద్రంలో పార్టీ కార్యాలయ నిర్మాణానికి టీఆర్‌ఎస్‌ పూనుకుంది. ఖమ్మంలో ఇప్పటికే టీఆర్‌ఎస్‌ జిల్లా కార్యాలయం ఉండగా, పెద్దపల్లి, వరంగల్‌ రూరల్‌, హైదరాబాద్‌లో వేర్వేరు కారణాల వల్ల పార్టీ కార్యాలయాల నిర్మాణం ప్రారంభం కాలేదు. మిగిలిన వాటిలో 17 జిల్లాల్లో నిర్మాణాలు ఇప్పటికే పూర్తయ్యాయి. మరో 10 జిల్లాల్లో నిర్మాణాలు 90శాతం పూర్తి కాగా, మిగిలిన పనులు నెలాఖరులోగా పూర్తి చేయాలని స్థానిక నాయకత్వాన్ని పార్టీ అధిష్ఠానం ఆదేశించింది. ఒక్క కామారెడ్డి జిల్లా పార్టీ కార్యాలయ నిర్మాణం ప్రస్తుతానికి 70 శాతమే పూర్తయింది.


ఈ పరిస్థితుల్లో ఒక్కో జిల్లా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించాలని టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. ఆయన చేతుల మీదుగా ఉత్తర తెలంగాణలోని ఏదో ఒక జిల్లా పార్టీ కార్యాలయ భవన ప్రారంభోత్సవం ఉండనుంది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. కేసీఆర్‌ మొదటి నుంచి సెంటిమెంట్‌గా భావించే ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో తొలి కార్యాలయ ప్రారంభోత్సవం జరగనుంది. ఈ అవకాశం జగిత్యాల జిల్లాకు దక్కవచ్చని పార్టీ ముఖ్యులు చెబుతున్నారు.

Updated Date - 2020-08-20T09:09:54+05:30 IST