తొలిరోజు 82 రిజిస్ట్రేషన్లు

ABN , First Publish Date - 2020-12-15T07:48:25+05:30 IST

మూడు నెలల తర్వాత సోమవారం రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. కాకపోతే, తొలిరోజు కేవలం 82 రిజిస్ట్రేషన్లు మాత్రమే జరిగాయి.

తొలిరోజు  82   రిజిస్ట్రేషన్లు

చాలా కార్యాలయాల్లో ఒకటి రెండే

స్లాట్ల బుకింగ్‌లో అవే సమస్యలు

సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల వద్ద ధర్నాలు

హైదరాబాద్‌, హైదరాబాద్‌సిటీ, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): మూడు నెలల తర్వాత సోమవారం రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. కాకపోతే, తొలిరోజు కేవలం 82 రిజిస్ట్రేషన్లు మాత్రమే జరిగాయి. అత్యధికంగా ఉప్పల్‌లో 7 రిజిస్ట్రేషన్లు జరగగా.. కొన్నిచోట్ల ఒక్కటి కూడా జరగలేదు. స్లాట్ల బుకింగ్‌, సాంకేతిక సమస్యలే ఇందుకు కారణం. స్లాట్ల కోసం ప్రజలు నానా తిప్పలు పడ్డారు. పూర్తి సమాచారాన్ని అప్‌లోడ్‌ చేయడానికి ఇబ్బందులు ఎదుర్కొన్నారు.


ఈనెల 11 నుంచి స్లాట్ల బుకింగ్‌ ప్రారంభం కాగా.. సోమవారం నుంచి రిజిస్ట్రేషన్లను చేపట్టారు. చాలా కార్యాలయాల్లో ఒకటి, రెండు స్లాట్లు మాత్రమే బుక్‌ అయి ఉండడంతో వాటినే రిజిస్టర్‌ చేశారు. కొన్ని కార్యాలయాల్లో బుక్కయిన స్లాట్లు ఎక్కువగా ఉన్నా.. సమాచార లోపాలు, సాంకేతిక సమస్యల కారణంగా ఎక్కువ రిజిస్ట్రేషన్లు చేయలేకపోయారు. స్లాట్లలో సరైన సమాచారం లేక రిజిస్ట్రేషన్లకు ఆటంకాలు ఏర్పడ్డాయి.


రాత్రి వరకూ అందిన సమాచారం ప్రకారం.. ఆదిలాబాద్‌, రంగారెడ్డిల్లో 6 చొప్పున, సంగారెడ్డి, సరూర్‌నగర్‌ల్లో 5 చొప్పున, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్‌, రాజేంద్రనగర్‌, ఎల్బీ నగర్‌, వరంగల్‌ల్లో 4 చొప్పున, దుబ్బాక, కోదాడ, మంచిర్యాల, శేరిలింగంపల్లిల్లో 3 చొప్పున, బాలానగర్‌, చిక్కడపల్లి, చంపాపేట, దూద్‌బౌలి, గద్వాల, కాప్రా, కీసర, మహబూబ్‌నగర్‌, మల్కాజిగిరి, మిర్యాలగూడ సబ్‌-రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో 2 చొప్పున రిజిస్ట్రేషన్లు జరిగాయి. బంజారాహిల్స్‌, అబ్దుల్లాపూర్‌మెట్‌, బీబీనగర్‌, గండిపేట, గోల్కొండ, హయత్‌నగర్‌, హుస్నాబాద్‌, ఇబ్రహీంపట్నం, ఖానాపూర్‌, వల్లభ్‌నగర్‌, తాండూరు, తూప్రాన్‌ వంటి కార్యాలయాల్లో ఒక్కో రిజిస్ట్రేషన్‌ మాత్రమే జరగడం గమనార్హం. తొలిరోజు సేల్‌, గిఫ్ట్‌ డీడ్లతోపాటు మార్టిగేజ్‌ (విత్‌ పొజిషన్‌, వితవుట్‌ పొజిషన్‌) డీడ్లు చేయడానికి మాత్రమే అనుమతి ఇచ్చారు. ఓపెన్‌ ప్లాట్లు సహా మిగతా దస్తావేజులు వ్యవసాయేతర ఆప్షన్‌లో కనిపించలేదు.


అయితే, రిజిస్ట్రేషన్లతోపాటే మ్యుటేషన్లు కూడా పూర్తయ్యాయి. రిజిస్ట్రేషన్‌కు 8-10 నిమిషాలు, మ్యుటేషన్‌కు మరో 8-10 నిమిషాల సమయం పట్టింది. మొత్తం ప్రక్రియ 15-20 నిమిషాల్లో పూర్తయింది. రిజిస్ట్రేషన్‌ పూర్తి కాగానే కొనుగోలుదారులకు ఫోన్‌ మెసేజ్‌ రూపంలో ‘ఈ-పా్‌సబుక్‌’ వచ్చేసింది. ఈ ప్రక్రియ బాగానే ఉన్నా.. సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయని సబ్‌-రిజిస్ట్రార్లు చెప్పారు.

వెబ్‌సైట్‌లో తలెత్తిన సాంకేతిక సమస్యల గురించి వారు ఎప్పటికప్పుడు బీఆర్కే భవన్‌లోని టెక్నికల్‌ సిబ్బందికి వివరించారు. స మస్యలు పరిష్కరించుకుంటూ రిజిస్ట్రేషన్లు చేపట్టారు. మొత్తంగా ధరణి అనే పదం లేకుండా స్లాట్‌ బుకింగ్‌ ద్వారా రిజిస్ట్రేషన్లుచేశారు.



తొలి రోజు ఇబ్బందులు

సాంకేతిక కారణాలతో రిజిస్ట్రేషన్‌కు అధికారులు తొలిరోజు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆజంపురలో అరగంటలో పూర్తి కావాల్సిన గిఫ్ట్‌ డీడ్‌ రిజిస్ట్రేషన్‌కు గంటన్నర పట్టింది. చంపాపేటలో 52 స్లాట్లు బుక్‌ కాగా 2 రిజిస్ట్రేషన్లు జరిగాయి. పీటీఐఎన్‌/టీపీఐఎన్‌ సహా స్థలం వివరాలు, ఫొటోలు, ఇతర వివరాలన్నింటినీ పొందుపర్చాల్సి రావడంతో ఇబ్బందులు తప్పడం లేదు. స్థలం నక్షను పొందుపర్చే ఆప్షన్‌ లేకపోవడం మరో సమస్య. వేకెంట్‌ ల్యాండ్‌ ట్యాక్స్‌ ఆన్‌లైన్‌లో ఎలా చెల్లించాలో తెలియడం లేదు.


డీటీసీపీ, హుడా, హెచ్‌ఎండీఏ లేవుట్లలోని ప్లాట్లకు ఎల్‌ఆర్‌ఎస్‌ ఉన్నా.. సైట్‌ తెరుచుకోవడం లేదు. రెక్టిఫికేషన్‌, బ్యాంకు నుంచి డాక్యుమెంట్‌ రిలీజ్‌ పద్ధతి లేదు. ఏజీపీఏ, వారసత్వ రిజిస్ర్టేషన్‌ చేసుకునే పద్ధతి లేకపోవడంతో తికమక పడుతున్నారు. ఫర్మ్‌ కంపెనీల ఆస్తులకు స్లాట్‌ బుక్‌ చేసుకోలేని పరిస్ధితి.


పలు చోట్ల ఆందోళనలు

రిజిస్ట్రేషన్లలో ఇబ్బందులను నిరసిస్తూ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు వనస్థలిపురంలో ధర్నా చేశారు. కొత్త నిబంధనలతో ఇబ్బందులు పడాల్సి వస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాత పద్ధతిలో రిజిస్ట్రేషన్లు కొనసాగించాలంటూ మల్కాజిగిరి సబ్‌-రిజిస్టార్‌ కార్యాలయం ముందు రియల్టర్లు, బిల్డర్లు, దస్తావేజుదారులు నిరసన తెలిపారు.

కోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం బేఖాతరు చేస్తోందని, సుమోటోగా కోర్టు కేసు నమోదు చేయాలని కోరారు. సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌పై కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. కొత్త విధానంలో తమ ప్రమేయం లేకుండా నేరుగా రిజిస్ట్రేషన్‌చేయడంపై డాక్యుమెంట్‌ రైటర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. 


మంగళవారానికి 155 స్లాట్లు

రాష్ట్రవ్యాప్తంగా 40 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల పరిధిలో సోమవారం 82 రిజిస్ట్రేషన్లు జరిగాయని సీఎస్‌ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. మంగళవారానికి 58 కార్యాలయాల పరిధిలో 155 స్లాట్లు బుక్కయినట్లు పేర్కొంది. అన్ని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తయిందని,  ఇబ్బందులు తలెత్తాయంటూ సోషల్‌ మీడియాలో దుష్ప్రచారం జరుగుతోందని తెలిపింది.

గతంలో పేర్కొన్నట్లు, స్లాట్ల బుకింగ్‌ ద్వారానే రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ జరుగుతుందని పునరుద్ఘాటించింది. కానీ, కొంతమంది స్లాట్లు బుక్‌ చేసుకోకుండా నేరుగా సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు వచ్చారని తెలిపింది. ముందు స్లాట్లు బుక్‌ చేసుకునే రావాలని కోరింది.


Updated Date - 2020-12-15T07:48:25+05:30 IST