‘పోతిరెడ్డిపాడు’పై పోరాటం

ABN , First Publish Date - 2020-06-16T10:16:41+05:30 IST

ఏపీ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ సామర్థ్యాన్ని పెంచినట్లయితే తెలంగాణలోని నాగార్జునసాగర్‌ ఎండిపోతుందని టీపీసీసీ

‘పోతిరెడ్డిపాడు’పై పోరాటం

  • ఏపీ సీఎం జగన్‌తో కేసీఆర్‌ కుమ్మక్కు: ఉత్తమ్‌
  • దక్షిణ తెలంగాణకు నష్టం తప్పదు: నాగం
  • కమిటీ పేరు ‘కృష్ణా నదీ జలాల పరిరక్షణ’గా మార్పు

హైదరాబాద్‌, జూన్‌ 15 (ఆంధ్రజ్యోతి): ఏపీ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ సామర్థ్యాన్ని పెంచినట్లయితే తెలంగాణలోని నాగార్జునసాగర్‌ ఎండిపోతుందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. పోతిరెడ్డిపాడు పనులు ఆపేవరకూ కాంగ్రెస్‌ పోరాటం చేస్తుందని స్పష్టంచేశారు. గాంధీభవన్‌లో సోమవారం కృష్ణా నదీజలాల పరిరక్షణ కమిటీ సమావేశం జరిగింది. ఇందులో కమిటీ చైర్మన్‌ నాగం జనార్దన్‌రెడ్డి, కన్వీనర్‌ రామ్మోహన్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌, మాజీ మంత్రి ప్రసాద్‌, మాజీ ఎంపీ మల్లు రవి తదితరులు పాల్గొన్నారు. పోతిరెడ్డిపాడు విస్తరణ వ్యతిరేక పోరాట కమిటీ పేరును కృష్ణా నదీజలాల పరిరక్షణ కమిటీగా మారుస్తూ ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.


ఈ సందర్భంగా ఉత్తమ్‌ మాట్లాడుతూ.. గతంలో పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని 44 వేల క్యూసెక్కులకు పెంచినప్పుడు కేంద్ర మంత్రిగా కేసీఆర్‌ ఉన్నారని, నాటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వంలో ఆరుగురు టీఆర్‌ఎస్‌ మంత్రులూ ఉన్నారని, ఆ సమయంలో ఎవరూ వ్యతిరేకించలేదన్నారు. ఇప్పుడు ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌తో తెలంగాణ సీఎం కేసీఆర్‌ కుమ్మక్కై కృష్ణా నీటిని ఆంధ్రాకు తీసుకెళ్లడానికి సహకరిస్తున్నారని ఆరోపించారు. ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసి పనులు ప్రారంభిస్తున్నా తెలంగాణ సీఎం ఏమాత్రం అడ్డూ చెప్పడంలేదన్నారు. కాంగ్రెస్‌ పోరాటం మొదలు పెట్టిన తర్వాతే కేసీఆర్‌ ఈ అంశంపై ఓ ప్రకటన చేశారని చెప్పారు. కమిటీ చైర్మన్‌ నాగం జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ.. పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని పెంచితే దక్షిణ తెలంగాణకు భారీగా నష్టం జరుగుతుందన్నారు.  


కరోనా పరీక్షలు ఉచితంగా చేయాలి

కరోనా పరీక్షలను ఉచితంగా చేయాలని టీపీసీసీ కొవిడ్‌-19 టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. పరీక్షకు నిర్ణయించిన రూ.2,200ను ప్రైవేటు ఆస్పత్రులు, ల్యాబ్‌లకు రీయింబర్స్‌ చేయాలని కోరింది. ఈ మేరకు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టివిక్రమార్క, కమిటీ చైర్మన్‌ మర్రి శశిధర్‌రెడ్డి సోమవారం గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌కు లేఖ రాశారు. వైరస్‌ సోకిన వారికి చికిత్సకయ్యే వ్యయాన్ని పరిమితం చేయడాన్ని కమిటీ స్వాగతించింది. అయితే ఆరోగ్యశ్రీ పరిధిలోకి వచ్చే వారందరికీ చికిత్సకయ్యే వ్యయాన్ని ప్రభుత్వమే తిరిగి చెల్లించాలని డిమాండ్‌ చేసింది. కట్టడి ప్రాంతాల్లో ఉన్నవారందరికీ ఉచితంగా కరోనా పరీక్షలు నిర్వహించాలని టీపీసీసీ నేత గూడు నారాయణ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాని కోరారు.


బోనాలు సమర్పిస్తే కరోనాకు వ్యాక్సిన్‌: వీహెచ్‌ 

అమ్మవారికి బోనాలు సమర్పిస్తే.. ఆమె ఆశీర్వాదంతో కరోనాకు వాక్సిన్‌ వస్తుందని మాజీ ఎంపీ వి.హన్మంతరావు అన్నారు. బోనాల పండుగ నిర్వహించకపోవడం సరికాదని గాంధీభవన్‌లో ఆయన అన్నారు. బోనాలు సమర్పించడానికి అవకాశం ఇచ్చి, పోతురాజు ఫలహార బండ్ల ఊరేగింపులను రద్దు చేయాలని సూచించారు.

Updated Date - 2020-06-16T10:16:41+05:30 IST