జ్వరమొస్తే పరీక్ష.. ఫీవర్ సర్వైలెన్స్ షురూ
ABN , First Publish Date - 2020-03-25T10:01:29+05:30 IST
రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఎవరైనా జ్వరంతో బాధపడుతున్నట్లు తేలితే తక్షణమే వైద్య పరీక్షలు చేయించనున్నారు

రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఎవరైనా జ్వరంతో బాధపడుతున్నట్లు తేలితే తక్షణమే వైద్య పరీక్షలు చేయించనున్నారు. ఈ మేరకు పరిస్థితి తీవ్రతను అంచనా వేసేందుకు ఫీవర్ సర్వైలెన్స్ (జ్వర పీడితుల ఆరా) మంగళవారం ప్రారంభమైంది. వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాల తో ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు తమ పరిధిలోని ప్రాంతాలకు వెళ్లి సమాచారం సేకరించారు. ‘ఇంట్లో ఎవరైనా జ్వరంతో ఉన్నారా? ఎన్ని రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నారు?’ వంటి వివరాలు తెలుసుకుని ఉన్నతాధికారులకు పంపారు. మరోవైపు కరోనా పాజిటివ్ కేసులు బయటపడిన ప్రాంతంలో 3 కిలోమీటర్ల చుట్టూ ఉన్నవారి వివరాలను తెలుసుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగనుంది. ఇకపై ఇతర రాష్ట్రాలు, ఇతర జిల్లాల నుంచి వచ్చినవారి సమాచారమూ తెలుసుకోనున్నారు. రాష్ట్రంలో ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు వచ్చినవారి, కొంతకాలం ఇతర జిల్లాల్లో పనిచేసి సొంత ప్రదేశాలకు చేరినవారి వివరాలనూ సేకరిస్తున్నారు.