మన కోళ్లకు దాణా ఏదీ?

ABN , First Publish Date - 2020-04-05T10:29:58+05:30 IST

కరోనా లాక్‌డౌన్‌తో కోళ్ల పరిశ్రమకు దాణా కష్టమొచ్చిపడింది. దీంతో ఫారాల్లో కోళ్లు ఆకలితో అల్లల్లాడుతున్నాయి. అంతర్‌ జిల్లా రవాణాకు బ్రేకులు పడటంతో స్థానికంగా దొరికే మొక్కజొన్న సరఫరాకు అడ్డంకులు ...

మన కోళ్లకు దాణా ఏదీ?

మహారాష్ట్ర నుంచి సోయాబీన్‌ రవాణా బంద్‌ 

స్థానికంగా మొక్కజొన్నల సరఫరాకూ అడ్డంకులే

దాణా కొరతతో చనిపోతున్న కోళ్లు

రాష్ట్రంలో 30శాతం తగ్గిన బ్రాయిలర్‌ కోళ్లు 

కిలో చికెన్‌ రూ.190 నుంచి రూ.200


హైదరాబాద్‌, ఏప్రిల్‌ 4(ఆంధ్రజ్యోతి): కరోనా లాక్‌డౌన్‌తో కోళ్ల పరిశ్రమకు దాణా కష్టమొచ్చిపడింది. దీంతో ఫారాల్లో కోళ్లు ఆకలితో అల్లల్లాడుతున్నాయి. అంతర్‌ జిల్లా రవాణాకు బ్రేకులు పడటంతో స్థానికంగా దొరికే మొక్కజొన్న సరఫరాకు అడ్డంకులు ఏర్పడ్డాయి. మహారాష్ట్ర నుంచి వచ్చే సోయాబీన్‌ రవాణా నిలిచిపోవడంతో రైతులు కోళ్ల పెంపకంపై అనాసక్తి కనబరుస్తున్నారు. దీంతో రాష్ట్రంలో 6 కోట్లు ఉండాల్సిన బ్రాయిలర్‌ కోళ్ల సంఖ్య 30ు తగ్గి 4.20 కోట్లకు పడిపోయింది. గతంలో రోజూ 12 లక్షల నుంచి 13 లక్షల దాకా మార్కెట్‌కు కోళ్లు వచ్చేవి. ఇప్పుడా సంఖ్య 8.5లక్షలకు మించడం లేదు. ఇక రాష్ట్రంలో లేయర్‌ కోళ్ల సంఖ్య 5.6 లక్షలుగా ఉండేది. ఇందులో 20ు తగ్గిపోయింది. మరో 40ు కోళ్లకు దాణా పెట్టడం తగ్గించి వాటి లైఫ్‌ను పెంచుకోవటం చేస్తున్నారు. అటు గుడ్ల ఉత్పత్తి కూడా 30ు తగ్గింది.


 దాణా రవాణాతో సమస్య

బ్రాయిలర్‌ కోళ్లకు సోయాబీన్‌, మొక్కజొన్నల దాణా పెడతారు. లేయర్‌కు సోయా, మక్కలతోపాటు బియ్యం పరం, డీవోఆర్‌బీ(తౌడు నుంచి తీసిన బ్రాన్‌) అదనంగా వినియోగిస్తారు. మక్కల రవాణాకు పోలీస్‌ అధికారులు ఇబ్బందులు సృష్టిస్తున్నారు. ఖమ్మం, వికారాబాద్‌ మార్కెట్ల నుంచి మక్కల రవాణా చేయనీయటంలేదు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ నుంచి సోయాబీన్‌ దాణా సరఫరా నిలిచిపోయింది. లాక్‌డౌన్‌కు ముందు క్వింటాకు రూ.3,200 ఉన్న సోయాధర ఇప్పుడు రూ.3,600కు చేరింది. కిలోమీటరుకు రూ. 1.60గా ఉండే రవాణా ఖర్చు ఇప్పుడు రూ.2.40  అయ్యింది. రైస్‌ మిల్లులు బంద్‌ కావటంతో పరం కొరత కూడా ఉంది. తెలంగాణ నుంచి నామక్కల్‌, హోస్పేట్‌, బళ్లారి కోళ్ల పరిశ్రమలకు పోయే మక్కల లారీలను కూడా నిలిపి వేశారు. లేయర్‌లో 8 కోళ్లు కలిసి రోజుకు ఒక కిలో దాణా తింటాయి. బ్రాయిలర్‌ విషయానికి వస్తే 1 కిలో 700 గ్రాముల దాణా పెడితే ఒక కిలో చికెన్‌ ఉత్పత్తి అవుతుంది. ఈ మాత్రం దాణాను అందించలేక కోళ్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వరంగల్‌ రూరల్‌ జిల్లా చెన్నారావుపేట మండలం అక్కల్‌చెడలో రెండు రోజుల వ్యవధిలో 2 వేల కోళ్లు చనిపోయాయి.


కోళ్లు తక్కువ.. గిరాకీ ఎక్కువ

హైదరాబాద్‌తోపాటు పలు జిల్లాల్లో కిలో చికెన్‌ రూ.190గా ఉంది. దీనికి కారణం కోళ్ల లభ్యత లేకపోవటమేనని వ్యాపారులు చెబుతున్నారు. రైతుల వద్ద ఉన్న కోళ్లు.. రవాణా, కూలీల సమస్యలతో మార్కెట్‌కు చేరే పరిస్థితిలేదు. దీంతో మార్కెట్లో కోళ్ల కొరత నెలకొంది. గత ఆదివారం ఏకంగా కిలోకు రూ. 240 వరకు చికెన్‌  ధర చేరటంతో వినియోగదారులు ఆందోళనకు గురయ్యారు. కొసమెరుపు ఏమిటంటే ఈ వ్యవహారంలో అటు కోళ్ల రైతులు.. ఇటు వినియోగదారులు నష్టపోతున్నారు. 

Updated Date - 2020-04-05T10:29:58+05:30 IST