ధాన్యం తూకంలో మోసం

ABN , First Publish Date - 2020-05-29T11:17:52+05:30 IST

కేంద్రంలో ధాన్యం తూకంలో మోసం జరిగిందంటూ గురువారం రైతులు ఆందోళనకు దిగారు

ధాన్యం తూకంలో మోసం

ఆందోళనకు దిగిన రైతులు 


కాటారం, మే 28: కేంద్రంలో ధాన్యం తూకంలో మోసం జరిగిందంటూ గురువారం రైతులు ఆందోళనకు దిగారు. హమాలీలు, కొనుగోలు కేంద్రం నిర్వాహకులు, మిల్లర్లు కుమ్మక్కై నిలువునా ముంచుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 40కిలోల ధాన్యం బస్తాకు అదనంగా 4-7 కిలోలకు పైగా తూకం వేశారని ఆరోపించారు. మండలంలోని కొత్తపల్లి పీఏసీఎస్‌ ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు. తోడె బాల్‌రెడ్డి అనే రైతుకు చెందిన 266 ధాన్యం బస్తాలతో పాటు మరికొందరి రైతులకు చెందిన ధాన్యాన్ని హమాలీలు బుధవారం రాత్రి సాధారణ త్రాసుతో కాంటా వేశారు. నిర్ణీత ప్రమాణాల మేరకు సంచి బరువుతో పాటు ధాన్యాన్ని 40 కిలోల 700 గ్రాముల చొప్పున బస్తాలను తూకం వేయాల్సి ఉంది. అయితే.. రైతు బాల్‌రెడ్డి తన ధాన్యం బస్తాలను అధిక తూకం వేశారనే అనుమానంతో బస్తాలను ఇతర రైతుల సమక్షంలో కాంటా వేయించాడు. దీంతో ఒక్కో బస్తాలో సుమారు 4-7 కిలోల వరకు అధిక బరువు ఉండటంతో రైతులు ఆందోళనకు దిగారు.


విషయం తెలిసిన ఎంపీపీ పంతకాని సమ్మయ్య, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు వేమునూరి ప్రభాకర్‌రెడ్డి, సర్పంచ్‌ రుఘురాం, ఎంపీటీసీలు రవీందర్‌రావు, రూపాదేవి, నాయకులు రైతులకు మద్దతు పలికారు. ఎంపీపీ జిల్లా అధికారులకు సమాచారం అందించి రైతులకు న్యాయం చేయాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. పీఏసీఎస్‌ చైర్మన్‌ చల్ల నారాయణరెడ్డి, డైరెక్టర్లు కొనుగోలు కేంద్రం వద్దకు వచ్చి రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.


డీసీవో రామ్మోహన్‌ అక్కడికి రాగా ఇప్పటికే రెండు కేంద్రాల్లో తూకంలో మోసం వెల్లడైందని, కేవలం హమాలీలను బాధ్యులను చేయడం తగదని, నిర్వాహకులు బాధ్యత వహించాలని ఎంపీపీ డిమాండ్‌ చేశారు. గతంలో రవాణా అయిన ధాన్యం కాంటాల వివరాలను రైతులకు వెల్లడి చేయాలన్నారు. కొనుగోలు కేంద్రాన్ని జేసీ స్వర్ణలత, డీఎ్‌సవో గౌరీశంకర్‌, సివిల్‌ సప్లై డీఎం రాఘవేంద్ర, తూనికలు, కొలతల శాఖ జిల్లా అధికారి శ్రీలత సందర్శించి విచారణ చేశారు.  కేంద్రం ఇన్‌చార్జి, హమాలీలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. త్రాసు కాంటాను సీజ్‌ చేసి సెంటర్‌ నిర్వాహకులు, కాంటా పెట్టిన హమాలీలపై లీగల్‌ మెట్రాలజీ అధికారులు కేసు నమోదు చేశారు.

Updated Date - 2020-05-29T11:17:52+05:30 IST