పండించాం కానీ..

ABN , First Publish Date - 2020-04-28T09:03:45+05:30 IST

‘‘ప్రతీ గింజను కొంటాం’’ అన్న సీఎం కేసీఆర్‌ ప్రకటనతో సంతోషపడ్డ అన్నదాతకు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో చుక్కలు కనబడుతున్నాయి. కావల్సినన్ని ..

పండించాం కానీ..

  • ధాన్యం అమ్ముకోలేకపోతున్న రైతులు
  • సమస్యల వలయంలో కొనుగోలు కేంద్రాలు
  • గోనె సంచులు, ప్యాడీ క్లీనర్లు లేవు
  • తేమను పరీక్షించే యంత్రాలకు కూడా కొరతే
  • లారీల కొరతతో లోడింగ్‌, అన్‌లోడింగ్‌ సమస్య
  • తాటిపత్రుల్లేక కొనుగోలు కేంద్రాల్లో తడుస్తున్న ధాన్యం
  • తాలు పేరుతో ధాన్యంలో తరుగు తీస్తున్న అధికారులు
  • తాలు తీసి అమ్ముదామంటే యంత్రాలు కరువు
  • తడిసిన ధాన్యం కొనాలని రైతుల వేడుకోలు


హైదరాబాద్‌, ఏప్రిల్‌ 27(ఆంధ్రజ్యోతి): ‘‘ప్రతీ గింజను  కొంటాం’’ అన్న సీఎం కేసీఆర్‌ ప్రకటనతో సంతోషపడ్డ అన్నదాతకు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో చుక్కలు కనబడుతున్నాయి. కావల్సినన్ని తాటిపత్రులు లేవు. గోనె సంచుల కొరత వేధిస్తోంది. దీంతో పాటు క్షేత్రస్థాయిలో అధికారులు తాలు పేరుతో ధాన్యంలో తరుగు తీస్తున్నారు. తాలు తీసి అమ్ముదామంటే ప్యాడీ క్లీనర్లు అందుబాటులో లేవు. ఫలితంగా ధాన్యం కొనుగోళ్లు మందకొడిగా సాగుతున్నాయి. ధాన్యం కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం 5,503 కేంద్రాలు ఏర్పాటు చేసింది. రైతులు ధాన్యాన్ని తీసుకొస్తున్నారు. కొనుగోళ్లు నెమ్మదిగా  సాగుతుండటంతో రోజుల తరబడి ధాన్యం కేంద్రాల్లోనే  ఉంటోంది. కొన్ని రోజులుగా అకాల వర్షాలు కురుస్తున్నాయి. తాటిపత్రులు లేక ధాన్యం తడిసిపోతోంది.  కొన్నిచోట్ల వరద నీటిలో కొట్టుకుపోయిన సందర్భాలు ఉన్నాయి.  వ్యవసాయశాఖ, పౌరసరఫరాల శాఖల అంచనాల ప్రకారం ఇప్పటికిప్పుడు 1.70 లక్షల టార్పాలిన్లు అవసరం.


కాని పాతవి, కొత్తవి అన్నీ కలిపి 95వేలు మాత్రమే ఉన్నాయి. ఇదిలా ఉండగా తడిసిన ధాన్యాన్ని ఐకేపీ, పీఏసీఎస్‌ సెంటర్లలో కొనుగోలు చేయడం లేదు. ఎండలో ఆరబెట్టినప్పటికీ ధాన్యం రంగు మారిందన్న సాకుతో తీసుకోవడం లేదు. కొందరు రైతులు 10 నుంచి 15 రోజులుగా కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు కాస్తున్నా పట్టించుకునే నాఽథుడే లేడు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతు వేడుకుంటున్నాడు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతులు ఆవేదనతో ధాన్యానికి నిప్పు పెట్టిన విషయం తెలిసిందే.  ఇక ధాన్యం తేమను  పరీక్షించడానికి తేమ యంత్రాలు కూడా లేవు. 15 వేల తేమ యంత్రాలు పంపిణీ చేయాల్సి ఉండగా కేవలం 5,750 యంత్రాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఽధాన్యం కొనుగోళ్లు ఆలస్యం కావడానికి లారీల కొరత కూడా కారణమవుతోంది. లారీలో లేకపోవడంతో లోడింగ్‌ ఆలస్యం అవుతోంది. ధాన్యం కాంటా అయినప్పటికీ వాటిని లోడ్‌ చేసే దాకా రైతు కొనుగోలు కేంద్రాల్లోనే ఎదురుచూడాల్సి వస్తోంది. 


ప్యాడీ క్లీనర్లు లేవు

ప్రతి కొనుగోలు కేంద్రానికి కనీసం ఒక్క ప్యాడీ క్లీనరైనా ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వం 7,500 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఇప్పటివరకు 5,503 సెంటర్లు ప్రారంభించింది. కానీ మార్కెటింగ్‌ శాఖ కేవలం 1,450 ప్యాడీ క్లీనర్లు మాత్రమే సెంటర్లకు పంపించింది. ధాన్యంలో చెత్త, తాలును తొలగించాలంటే ప్యాడీ క్లీనర్‌ అవసరం. ఇవి లేకపోవడంతో నేరుగా కాంటా వేస్తున్నారు. తాలు పేరుతో ప్రతీ బస్తాకు 2-3 కిలోలు తరుగు తీస్తున్నారు. దీంతో రైతు క్వింటాలుకు 10 కిలోల దాకా ధాన్యాన్ని నష్టపోతున్నాడు.


కాగా, ఈ యాసంగిలో కోటి టన్నుల వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ ధాన్యం నింపటానికి 25 కోట్ల గోనె సంచులు అవసరం. కానీ పౌరసరఫరాల సంస్థ వద్ద కేవలం 9 కోట్ల గోనె సంచులే నిల్వ ఉన్నాయి. గోనె సంచులను పశ్చిమ బెంగాల్‌(కోల్‌కతా) నుంచి దిగుమతి చేసుకోవాల్సి ఉంది. ప్రత్యేక రైలులో వీటిని తెప్పిస్తామని కేసీఆర్‌ ప్రకటించారు. కానీ ఇంతవరకు రాష్ట్రానికి గోనె సంచులు రాలేదు. 

Updated Date - 2020-04-28T09:03:45+05:30 IST