సన్నమో రామచంద్రా

ABN , First Publish Date - 2020-10-31T09:36:01+05:30 IST

వర్షాలు పుష్కలంగా పడ్డాయి. అడుగు మందును మోతాదుగా వేసినా కూడా వరి పంట ఏపుగా పెరిగింది. ఎప్పుడూ రెండున్నర అడుగులకు మించని పంట, నడుంలోతుకు ఏపుగా ఏదిగింది.

సన్నమో రామచంద్రా

ధాన్యం రైతుల అరిగోస

ప్రభుత్వం చెప్పడంతోనే సన్నాల సాగు

దొడ్డు రకాలకన్నా ఎకరానికి 7వేలు పెట్టుబడి ఎక్కువ

సాధారణం 30, సన్నాలు 25 క్వింటాళ్ల దిగుబడే

అకాల వర్షాలకు ఎకరాకు 5 క్వింటాళ్ల దాకా నష్టం

తేమ, చీడపీడలతో పంటకు మరింత దెబ్బ 

కొనుగోలు కేంద్రాలను తెరిచినా కొనేవారేరి? 

ధాన్యం తెచ్చి 20 రోజులుగా ఎదురుచూపులు

మిల్లర్ల సిండికేట్‌.. ఇప్పుడు ఇచ్చేది 1400 మాత్రమే

మద్దతు క్వింటాకు 1888 చాలదు.. 2,500 ఇవ్వాలి

మక్క రైతుల మాదిరిగా ఉద్యమం వైపు అడుగులు!


 (ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌)

వర్షాలు పుష్కలంగా పడ్డాయి. అడుగు మందును మోతాదుగా వేసినా కూడా వరి పంట ఏపుగా పెరిగింది. ఎప్పుడూ రెండున్నర అడుగులకు మించని పంట, నడుంలోతుకు ఏపుగా ఏదిగింది. ఈసారి మంచి దిగుబడులొస్తాయని రైతులు ఆశపడ్డారు. ఈ కలలను అకాల వర్షాలు కల్లలు చేశాయి. నోటికాడి ముద్ద జారిపోయినట్లు పంట నేలకొరిగి నీళ్లు నిలవడంతో కొన్నిచోట్ల కంకుల్లోనే విత్తనాలు మొలిచాయి. తెగుళ్లు ఆశించడంతో కొన్నిచోట్ల పంట చాలామటుకు దెబ్బతినిపోయింది. కోసిన పంటను ఆరబెట్టేందుకు స్థలం లేక తేమతో ధాన్యం రంగుమారింది. కొనుగోలు కేంద్రాలకు తరలిస్తే అక్కడ కొర్రీలు. ఉదయం ధాన్యం ఆరబెడుతూ సాయంత్రం కుప్పలుగా చేస్తూ రోజుల తరబడి నిరీక్షణ!! రైతుల బలహీనతను ఆసరాగా చేసుకొని సిండికేట్‌గా మారిన మిల్లర్లు. ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరే తక్కువగా ఉందంటే దానికి రెండు, మూడు వందల దాకా తక్కువ ఇస్తూ వారి నిలువు దోపిడీ! ఇలా తమ కష్టాలు ఎన్నని చెప్పేదని సన్నాలు సాగు చేసిన రైతులు నెత్తీనోరు కొట్టుకుంటున్నారు. నియంత్రిత సాగు విధానంలో భాగంగా ఈ వానాకాలంలో వరి రైతులు సన్నాలనే సాగు చేయాలని చెప్పడంతో ఆ రకాలే విరివిగా వేశారు. సన్నాలు వేస్తేనే రైతుబంధు నిధులు వస్తాయని అధికారులు చెప్పడంతో అప్పటిదాకా దొడ్డు రకాలను వేసిన రైతులు, మక్క రైతులు కూడా సన్నాలను సాగు చేశారు.


నిజామాబాద్‌, కరీంనగర్‌, ఆదిలాబాద్‌, నల్లగొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాలో రికార్డు స్థాయిలో సన్నాలను సాగు చేశారు. దీంతో ఈ సీజన్‌లో మొత్తం వరిసాగులో 85-90శాతం సన్నాలే సాగయ్యాయి. ప్రధానంగా బీపీటీ, తెలంగాణ సోనా, ఆర్‌ఎన్‌ఆర్‌, జైశ్రీరాం వంటి సన్నరకాలు ఈసారి ఎక్కువగా సాగయ్యాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఈసారి 5,45,277 ఎకరాల్లో వరిసాగైతే, ఇందులో 5,03,682 ఎకరాల్లో సన్నాలు వేశారు.  గత ఏడాది 5,02,300 ఎకరాల్లో వరిసాగైతే, అందులో 3,61,663 ఎకరాల్లో మాత్రమే సన్నాలు సాగయ్యాయి. మొత్తంగా నిరుటికంటే ఈసారి 1,41,919 ఎకరాల్లో అదనంగా సన్నవరి సాగైంది. సాధారణంగా దొడ్డు రకాల కన్నా సన్నాల సాగుకు ఎకరానికి రూ.7వేల చొప్పున పెట్టుబడి ఎక్కువవుతుంది. చీడపీడల బెడద కూడా సన్నాలకే ఎక్కువ. చాలాచోట్ల ఇటీవల వరుస వర్షాలకు సన్నాల పైరు దెబ్బతింది. పైగా పైరుకు కాటుక తెగులు, సుడితెగులు, అగ్గితెగులు, దోమపోటు, మెడవిరుపు, కుళ్లుతెగులు, పాము పొడ, తాటాకు తెగులు ఆశించింది. దీనికి రెండు, మూడుసార్లు అదనంగా పురుగుల మందును పిచికారీ చేయాల్సి వచ్చింది. కొన్నిచోట్ల పరిస్థితి చేజారిపోయి ఎకరాలకు ఎకరాలే నిర్జీవంగా మారాయి. దీంతో రైతులు గుండెరాయి చేసుకొని పంటకు నిప్పుపెట్టారు. 


మిల్లర్లు రోజుకో రూ.100 చొప్పున తగ్గిస్తున్నారు 

నల్లగొండ జిల్లాలో గత వానాకాలం సన్నాల సాగు తక్కువగా ఉండటంతో మిల్లుల గుమాస్తాలు రోడ్లపైకి వచ్చి ఆ వైపు నుంచి వెళ్లే  సన్నాల లోడు ట్రాక్టర్లను ఆపి క్వింటాకు రూ.2వేలకు తగ్గకుండా ఇచ్చి కొన్నారు. ఈసారి సన్నాల సాగు పెరగడంతో ‘మంది ఎక్కువైతే మజ్జిగ పలచన’ అన్న చందంగా పరిస్థితి తయారైంది. కొనుగోలు కేంద్రాలు ఖరారు చేయకపోవడంతో మిల్లర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. మిర్యాలగూడ డివిజన్‌లో 184 మిల్లులు ఉంటే అందులో ఒక వారం పాటు నలుగురు మిల్లర్లు, మరో వారం నలుగురు మిల్లర్ల చొప్పన కొనుగోలు చేస్తున్నారు. మరోవైపు ధాన్యం పెద్ద మొత్తంలో మార్కెట్‌లోకి వస్తుండటంతో బాయిలర్‌లు ఖాళీగా లేవు, రంగు మారింది, మట్టి ఎక్కువగా ఉందంటూ మిల్లర్లు పథకం ప్రకారం కొర్రీలు పెడుతున్నారు. చేసేది లేక రైతులు మిల్లర్లు చెప్పిన ధరకే విక్రయిస్తున్నారు. సన్న ధాన్యం తక్కువగా వచ్చిన తొలినాళ్లలో క్వింటాకు రూ.1900 వరకు ఇచ్చారు. ఇప్పుడు రోజుకు రూ.100 చొప్పున తగ్గిస్తున్నారు.


శుక్రవారం (30న) మిర్యాలగూడలో క్వింటాకు రూ.1600కు, సూర్యాపేటలో రూ.1400కు ధరను దించారు. మార్కెట్‌లోకి తెచ్చిన 24 గంటల్లోపు సన్నాలు విక్రయించకపోతే ధాన్యం పసుపు రంగులోకి మారుతుంది. దీంతో రేటు మరింతగా పడిపోతుంది. ఇదే అదనుగా చేసుకొని మిల్లర్లు సిండికేట్‌గా మారారు. చాలాచోట్ల ధాన్యం లోడున్న లారీలు, ట్రాక్టర్లతో మిల్లుల వద్ద రైతులు పడిగాపులు కాస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో మిల్లర్లు చెప్పిన ధరకే విక్రయిస్తున్నారు. 


సాగు ప్రోత్సాహించారు సరే.. ధర ఏదీ?  

సన్నాల సాగును ప్రోత్సహించిన ప్రభుత్వం మద్దతు ధర విషయంలో మాత్రం పట్టించుకోలేదు. దొడ్డురకాలకు ఇచ్చే ధర రూ. 1888నే సన్నరకాలకు చెల్లించాలని నిర్ణయించింది. అయితే ఈ రేటు సన్నరకాలకు సరిపోదని రైతులు వాపోతున్నారు. నిరుడు మార్కెట్లో సన్నాలను క్వింటాకు రూ. 2200 నుంచి రూ. 2300 వరకు ధర పలికింది. ఉత్పత్తి తక్కువగా ఉండటంతో మిల్లర్లు పోటీపడి మద్దతు ధరకు మించి  కొన్నారు. ఇప్పుడు ప్రభుత్వమే రూ.1888 ధరకు కొంటామని చెప్పడంతో నేరుగా రైతుల నుంచి కొనేందుకు ఆసక్తి చూపడం లేదు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా కొని ఎలాగూ తమకే సీఎంఆర్‌ కింద ఇస్తుందని, అప్పుడు ఎక్కువ ధర ఇచ్చి కొనాల్సిన అవసరంలేదనే భావనలో మిల్లర్లు ఉన్నారు. ఇది రైతులను ఆందోళనకు గురిచేస్తోంది.   


మిల్లర్ల దోపిడీని అరికట్టాలి 

ధాన్యం కొనుగోలులో వ్యాపారులు, మిల్లర్లు ఇబ్బంది పెడుతున్నారు. తాలు, పొల్లు, తేమ పేరుతో మద్దతు ధర చెల్లించేందుకు కొర్రీలు పెడుతున్నారు. వ్యాపారులంతా సిండికేట్‌ అయి దోచుకుంటున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. వడ్ల లోడుతో మిల్లు పాయింట్ల వద్ద  అర్ధరాత్రిదాకా నిరీక్షించాల్సి వస్తోంది. ధాన్యం తరలిస్తున్నా అధికారుల పర్యవేక్షణ జరగడం లేదు మిల్లర్ల దోపిడీని అరికట్టి మద్దతు ధర చెల్లించేలా పకడ్బందీ చర్యలు తీసుకోవాలి. 

 రవీందర్‌రెడ్డి, రైతు, 

వేములపల్లి, పాలమూరు జిల్లా


మొత్తంగా దిగుబడి అధికం

సన్నాల సాగులో ఈసారి భిన్నమైన పరిస్థితి నెలకొంది. పెట్టుబడులు పెరిగి, దిగుబడులు తగ్గడంతో రైతులు నష్టాల పాలైతే, మొత్తంగా సన్నాల సాగు పెరగడంతో నిరుటి కంటే అధికంగా ఉత్పత్తి నమోదవుతోంది. నిరుడు  ఉమ్మడి పాలమూరులో సన్నవడ్లు 7,95,000 టన్నులు ఉత్పత్తి అయ్యాయి. ఈసారి 8,56,000 టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని అంచనా వేశారు. 


నష్టాన్ని మిగిల్చిన సన్నాలు

ఈ వానాకాలంలో  సన్నరకం వరినే సాగుచేయాలని ప్రభుత్వం చెబితేనే నాలుగెకరాల్లో పూజరకం వరి పంట వేశాను. తెగుళ్ల నివారణకు పురుగుల మందులను పిచికారీతో పెట్టుబడి ఖర్చు బాగా పెరిగింది. గతంలో దొడ్డురకం ధాన్యాన్ని ఐకేపీలో అమ్ముకుంటే మద్దతు ధర వచ్చింది. ఇప్పుడు సన్నాలను ఐకేపీలో కొనడం లేదు, మిల్లు వద్ద అమ్ముకోడానికిపోతే ఏడుపొక్కటే తక్కువ.. ఎన్నో వ్యయప్రాయాసలకోర్చి పండిస్తే క్వింటాకు రూ. 1700 చొప్పున ఇస్తామంటున్నారు. మద్దతు ధర అందక నష్టమే జరుగుతోంది. 

బుడిగ సైదులు, రైతు, 

పూసలపాడు పాలమూరు జిల్లా 


ప్రారంభం కాని కొనుగోలు

ఇరవై రోజుల క్రితమే దొడ్డు ధాన్యం, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు చేరింది. ఒకటి రెండు చోట్ల ఎమ్మెల్యేలు అధికారికంగా ప్రారంభించారు. అయినా ఆ కేంద్రాలు  ఉత్సవ విగ్రహాల్లా మిగిలిపోయాయి. కేంద్రాలకు ధాన్యం చేరిన తర్వాత రెండుసార్లు వర్షానికి తడవడం, కొంత కొట్టుకుపోవడం జరిగాయి అయినా అఽధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించడం లేదు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఏ మిల్లులకు తరలించాలో నిర్ణయించకపోవడంతో   కొనుగోలు జరగడం లేదు. దీంతో రైతులు ఉదయం తమ ధాన్యం కుప్పలను ఆరబెట్టుకోవడం, రాత్రి కల్లా కుప్ప చేసి పట్టాలు కప్పుకోవడం, కాపలాగా  ఉండటం చేస్తున్నారు. మళ్లీ ఇప్పుడు ఆకాశం మబ్బులు పడుతుండటంతో వాన పడితే పరిస్థితి ఏమిటని రైతులు ఆందోళన చెందుతున్నారు. 



మక్క రైతుల మాదిరిగా ఉద్యమం వైపు! 

దొడ్డు రకం వరి పంట ఎకరాకు 25 క్వింటాళ్ల నుంచి 30 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. అదే సన్న రకం అయితే 20 క్వింటాళ్ల నుంచి 25 క్వింటాళ్ల వరకు వస్తుంది.  అకాల వర్షం, తెగుళ్ల దెబ్బకు ఇప్పుడు 18-20 క్వింటాళ్లు రావడమే కష్టమంటున్నారు. సన్నాలకు కూడా క్వింటాకు రూ.1888 మద్దతు ధరను సర్కారు ప్రకటించింది. అయితే పెట్టుబడి ఖర్చులు పెరిగినందున ఇది సరిపోదని, రూ.2,500 ఇవ్వాలని ప్రభుత్వాన్ని రైతులు కోరుతున్నారు. కొన్నిచోట్ల సన్నాలకు క్వింటాకు రూ. 500 చొప్పున ప్రోత్సాహకంగా ఇవ్వాలని కోరుతున్నారు. ఇటీవల మొక్కజొన్న పంటకు మద్దతు ధర ఇవ్వాలంటూ ఆ రైతులు ఉద్యమం నడిపి సాధించుకున్నారు.  ఇప్పుడు అదే స్ఫూర్తితో ఆర్మూర్‌, కామారెడ్డి, జగిత్యాల జిల్లాల్లో సన్న రకాలకు మద్దతు ధర సాధించాలనే డిమాండ్‌తో రైతులు ఉద్యమబాట పట్టే అవకాశాలున్నాయి. 

Updated Date - 2020-10-31T09:36:01+05:30 IST