అదిలాబాద్ జిల్లాలో అకాలవర్షం..నష్టపోయిన కంది రైతులు

ABN , First Publish Date - 2020-03-02T21:13:39+05:30 IST

కందుల కొనుగోళ్ల విషయంలో అధికారులు చేస్తున్న జాప్యంతో రైతులు నిండా మునుగుతున్నారు.

అదిలాబాద్ జిల్లాలో అకాలవర్షం..నష్టపోయిన కంది రైతులు

అదిలాబాద్: కందుల కొనుగోళ్ల విషయంలో అధికారులు చేస్తున్న జాప్యంతో రైతులు నిండా మునుగుతున్నారు. మూలిగే నక్కపై తాడిపండు పడే చందంగా.. అదిలాబాద్ జిల్లాలో కురిసిన వర్షాలతో కంది రైతులు తీవ్రంగా నష్టపోయారు. రాత్రి కురిసిన అకాల వర్షంతో చాలా ప్రాంతాల్లో చేతికొచ్చిన కందులు తడిపోయాయి. అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాత్రి జిల్లాలోని బోథ్, బజార్ హత్నూర్, ఇచ్చోడ, నేరడిగొండ మండలాల్లో భారీ వర్షం కురిసింది. అమ్మకానికి మార్కెడ్ యాడ్‌లోకి తీసుకువచ్చిన వేలాది క్వింటాళ్ల కందులు ఈ వర్షానికి తడిసిపోయాయి. దీంతో రైతులు కన్నీటిపర్యంతమయ్యారు.


వాస్తవానికి వారం రోజుల క్రితం నుంచే రైతులు పెద్ద ఎత్తున కందులు మార్కెట్ యాడ్‌లోకి తీసుకువచ్చారు. అయితే తమ టార్గెట్ పూర్తి అయిందని అధికారులు కొనుగోళ్లను నిలిపివేశారు. అధికారుల వైఖరిని నిరసిస్తూ రైతులు కొద్ది రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. రైతుల ఆందోళనలకు దిగివచ్చిన అధికారులు కొన్నిచోట్ల కొనుగోళ్లను ప్రారంభించారు. పూర్తి స్థాయిలో కొనుగోళ్లు పూర్తి కాకపోవడంతో అకాల వర్షానికి కందులు తడిసిపోయాయి. తడిసిన కందులను గిట్టుబాటుధరకే కొనుగోలు చేయాలని రైతులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

Updated Date - 2020-03-02T21:13:39+05:30 IST