రంగు మారితే కొనరా..?
ABN , First Publish Date - 2020-11-25T07:47:19+05:30 IST
‘‘మంచి ధాన్యం ఎవరైనా కొంటారు.. వర్షాలతో తడిసి రంగుమారిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొని రైతులను ఆదుకోవాలి కదా’’ అని ఓ కౌలు రైతు సివిల్ సప్లయ్స్ కమిషనర్,

నా వడ్లు రూ.1250కే అమ్ముకున్నా
భువనగిరిలో అధికారులకు కౌలు రైతు ప్రశ్న
సిరిసిల్ల కలెక్టరేట్ ఎదుట రైతుల ధర్నా
‘ప్రోత్సాహకం’ కోసం పాడి రైతుల ర్యాలీ
యాదాద్రి/సిరిసిల్ల, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): ‘‘మంచి ధాన్యం ఎవరైనా కొంటారు.. వర్షాలతో తడిసి రంగుమారిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొని రైతులను ఆదుకోవాలి కదా’’ అని ఓ కౌలు రైతు సివిల్ సప్లయ్స్ కమిషనర్, కలెక్టర్‌ను ప్రశ్నించారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ అనిల్‌కుమార్ యాదాద్రి-భువనగిరి జిల్లాలోని బీబీనగర్, భువనగిరి మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ అనితారామచంద్రన్‌తో కలిసి మంగళవారం పరిశీలించారు.
భువనగిరి శివారులోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలిస్తుండగా భువనగిరికి చెందిన కౌలు రైతు కడారి మల్లేశం వారిని కలిశాడు. అధిక వర్షాలతో తన వరి పొలం నీట మునిగిందని, రంగు మారిన ధాన్యాన్ని కొనడానికి అధికారులు నిరాకరించారని తెలిపాడు. ఎంత తిరిగినా కరుణించకపోవడంతో చివరికి మార్కెట్‌లో ధాన్యం వ్యాపారికి రూ.1,250కే విక్రయించానని వాపోయాడు.
రాష్ట్ర బృందం పర్యటన
రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నియమించిన బృందం బుధవారం భువనగిరి జిల్లాలోని వలిగొండ, పోచంపల్లి మండలాల్లో పర్యటించనుందని సివిల్ సప్లయ్స్ కమిషనర్ అనిల్‌కుమార్ తెలిపారు. రంగుమారిన ధాన్యం కొనుగోలుకు ఎ్‌ఫసీఐ నిబంధనలు అడ్డుగా ఉన్నాయన్నారు. ప్రతి ధాన్యం గింజనూ కొనడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
సిరిసిల్ల కలెక్టరేట్ ఎదుట రైతుల ధర్నా
సన్న ధాన్యానికి మద్దతు ధర డిమాండ్‌తో సిరిసిల్ల కలెక్టరేట్ ఎదుట సీపీఐ ఆధ్వర్యంలో రైతులు ధర్నా నిర్వహించారు. వర్షాల వల్ల నష్టపోయిన పంటలకు పరిహారం కూడా అందలేదని వాపోయారు. సన్నరకం ధాన్యానికి రూ.2,500 చెల్లించాలని డిమాండ్ చేశారు.
భువనగిరిలో పాడి రైతుల భారీ ర్యాలీ
తమకు లీటరు పాలపై ఇచ్చే రూ.4 ప్రోత్సాహకాన్ని ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని పాడి రైతులు డిమాండ్ చేశారు. యాదాద్రి-భువనగిరి జిల్లాలో మంగళవారం భువనగిరి పాల శీతలీకరణ కేంద్రం నుంచి కలెక్టరేట్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. నార్ముల్, విజయ డెయిరీ పాల రైతులకు రెండేళ్లుగా దాదాపు రూ.20 కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు.
మరణించిన పాడి పశువుల బీమా క్లెయిమ్‌ను వెంటనే పరిష్కరించాలని, 50ు సబ్సిడీపై దాణా, గడ్డివిత్తనాలు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. సీపీఎం మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బండ్రు శోభారాణి, కాంగ్రెస్ ఆలేరు ఇన్‌చార్జి బీర్ల అయిలయ్య ఈ ఆందోళనకు సంఘీభావం ప్రకటించారు.