రైతు వేదిక నేడు వేడుక

ABN , First Publish Date - 2020-10-31T09:39:41+05:30 IST

జనగామ జిల్లా కొడకండ్ల మండల కేంద్రంలో నిర్మించిన రైతు వేదికను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు శనివారం ప్రారంభించనున్నారు.

రైతు వేదిక నేడు వేడుక

కొడకండ్లలో ప్రారంభించనున్న ముఖ్యమంత్రి

2,601 వేదికలకు

572 కోట్లు వాటిలో ఉపాధి నిధులు

260 కోట్లు ఒక్కో భవన నిర్మాణ ఖర్చు

22 లక్షలు దాతల విరాళాలతో 24 రైతు వేదికలు


హైదరాబాద్‌, జనగామ, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): జనగామ జిల్లా కొడకండ్ల మండల కేంద్రంలో నిర్మించిన రైతు వేదికను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు శనివారం ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 12.30కు హైదరాబాద్‌ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి కొడకండ్లకు రానున్న ముఖ్యమంత్రి.. తొలుత పల్లె ప్రకృతి వనాన్ని సందర్శిస్తారు. అనంతరం కొడకండ్ల మార్కెట్‌ కమిటీలో  రైతుబంధు సమితి జిల్లా, మండల, గ్రామ కోఆర్డినేటర్లు, సభ్యులు, 5 వేల మంది రైతులతో నిర్వహించే సమావేశంలో మాట్లాడతారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు చెందిన మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాథోడ్‌తోపాటు మంత్రి నిరంజన్‌రెడ్డి, రైతుబంధు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.


రైతులు చర్చించుకోవడానికి, వ్యవసాయ అధికారులు సలహాలు సూచనలు ఇవ్వడానికి ఒక వేదికను కల్పించే ఉద్దేశంతో రాష్ట్రంలో మొత్తం 2,601 రైతు వేదికలను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో రైతు వేదికను రూ.22 లక్షల అంచనా వ్యయంతో నిర్మిస్తారు. మొత్తం ప్రాజెక్టుకు రూ. 572 కోట్లు ఖర్చవుతుందని అంచనా. దీంతో.. ఉపాధి హామీ పథకాన్ని దీనికి అనుసంధానం చేశారు. వ్యవసాయశాఖ రూ.312 కోట్లు భరిస్తుండగా.. ఉపాధి హామీ నిధుల నుంచి రూ.260 కోట్లను వినియోగిస్తారు. సీఎం కేసీఆర్‌తోపాటు పలువురు దాతలు 24 రైతు వేదికల నిర్మాణ వ్యయాన్ని భరిస్తున్నారు. మరో 139 రైతు వేదికలకు అవసరమైన స్థలాలను దాతలు సమకూర్చారు. సీఎం కేసీఆర్‌ స్వయంగా తన దత్తత గ్రామం ఎర్రవల్లిలో నిర్మించతలపెట్టిన ‘వేదిక’కు, మర్కూక్‌ మండల కేంద్రంలో వేదికకు ఆయన భూమి పూజ చేశారు. ఈ రెండూ తుది దశ నిర్మాణంలో ఉన్నాయి. సీఎం కేసీఆర్‌ వెళుతున్న జనగామ జిల్లాలో 62 రైతు వేదికలకుగాను 55 పూర్తయ్యాయి. చాలా జిల్లాల్లో పనులను దసరాకే పూర్తి చేయాలని అనుకున్నా.. వర్షాలు, ఇతర కారణాల వల్ల జాప్యం ఏర్పడింది. నల్లగొండ జిల్లాలో కాంట్రాక్టర్ల నిర్లక్ష్యానికితోడు.. స్థానిక ప్రజాప్రతినిధుల జోక్యంతో పనుల్లో ఆలస్యమేర్పడినట్లు తెలిసింది. ఆదిలాబాద్‌ జిల్లాలో హడావుడిగా పనులు చేస్తున్న కారణంగా నాణ్యత దెబ్బతింటోందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అధికారిక సమాచారం ప్రకారం 1,951 రైతు వేదికల నిర్మాణం దాదాపు పూర్తయింది.


వేదికలతో ఉపయోగాలు ఇలా..

రాష్ట్రంలో ప్రతి 5 వేల ఎకరాలకు ఒక వ్యవసాయ విస్తరణాధికారి(ఏఈవో) క్లస్టర్‌ ఉంది. గతంలో ఉన్న మండల వ్యవసాయ అధికారి(ఎంఏవో)కి కూడా ప్రత్యేక కార్యాలయం అంటూ ఉండేది కాదు. మండల పరిషత్‌ కార్యాలయంలోనో, ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లోనో ఓ చిన్న గదిని కేటాయించేవారు. కొన్నిచోట్ల అద్దె భవనాలే దిక్కయ్యేవి. గతంలో ఏఈవోల సంఖ్య పరిమితంగా ఉండేది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఏఈవోల వ్యవస్థను బలోపేతం చేసింది. 5 వేల ఎకరాలకు ఒకటి చొప్పున క్లస్టర్‌ను ఏర్పాటుచేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో 2,604 వ్యవసాయ క్లస్టర్లు ఉన్నాయి. ప్రతి క్లస్టర్‌కు ఒక ఏఈవోను నియమించి, వ్యవసాయ కార్యక్రమాల పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. ఏఈవోలందరికీ ట్యాబ్‌లు పంపిణీ చేసినప్పటికీ ప్రత్యేకంగా ఒక చిరునామా, కార్యాలయం అనేది లేదు. ఈ క్రమంలో అన్ని వసతులతో ఒక్కో క్లస్టర్‌కు కార్యాలయ భవనం నిర్మించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు. వాటికి రైతు వేదికలు అని పేరు పెట్టారు. ఏఈవోకు ఒక ప్రత్యేక గది, కంప్యూటర్లకు, సమావేశాల నిర్వహణకు, విత్తనాలు, యాంత్రీకరణ పనిముట్లు ఉంచటానికి ప్రత్యేక గదులు ఉంటాయి. అన్ని క్లస్టరలో ఒకే నమూనాతో భవనాలు నిర్మిస్తుండటం విశేషం. రైతువేదికల్లో మైకులు, కుర్చీలు, ఇతర మౌలిక వసతులను సమకూరుస్తున్నారు.

Updated Date - 2020-10-31T09:39:41+05:30 IST