బైక్‌ నుంచి పడి..లారీ కింద నలిగి

ABN , First Publish Date - 2020-12-27T07:27:47+05:30 IST

బైక్‌ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొనడంతో దాని మీద ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు ఎగిరి ఆవలి వైపు రోడ్డు మీద పడ్డారు.

బైక్‌ నుంచి పడి..లారీ కింద నలిగి

కొండపాక వద్ద ప్రమాదం.. ఇద్దరి దుర్మరణం

వరంగల్‌ జిల్లాలో బస్సు ఢీకొని  తండ్రీకొడుకుల మృతి


కొండపాక, ఎల్కతుర్తి, డిసెంబరు 26: బైక్‌ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొనడంతో దాని మీద ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు ఎగిరి ఆవలి వైపు రోడ్డు మీద పడ్డారు. ఆ సమయంలోనే ఓ లారీ, వారిపై నుంచి దూసుకెళ్లడంతో దుర్మరణం పాలయ్యారు. సిద్దిపేట జిల్లా కొండపాక స్టేజీ సమీపంలోని రవీంద్రనగర్‌ శివారులో ఈ ప్రమాదం జరిగింది.


మృతులు వరంగల్‌ జిల్లా తడ్వాయి మండలం గోవిందరావుపేటకు చెందిన పెద్దోజి రమేశ్‌ (28), అదే జిల్లా కమలాపూర్‌కు చెందిన కానుగుల సాగర్‌చారి (28). ఇద్దరూ హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. కరీంనగర్‌లో ఎలక్ట్రీషియన్‌ పనిచేసేందుకు బైక్‌పై వచ్చిన ఇద్దరూ పని ముగించుకొని తిరిగి హైదరాబాద్‌కు వెళ్తున్నారు. రవీంద్రనగర్‌ గ్రామ శివారులోని రాజీవ్‌ రహదారిపై బైక్‌ అదుపు తప్పి డివైడర్‌కు ఢీకొనడంతో ఇద్దరూ రోడ్డుకు అవతలి వైపు  పడిపోయారు.


అదే సమయంలో హైదరాబాద్‌ నుంచి సిద్దిపేట వైపు వెళ్తున్న లారీ వారిపై నుంచి వెళ్లింది. ఈ ఘటనలో కానుగుల సాగర్‌ చారి అక్కడికక్కడే మృతిచెందగా రమేశ్‌కు తీవ్రగాయాలు అతడిని 108లో సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అక్కడ మృతిచెందాడు. మరో ఘటనలో ఓ శుభకార్యానికి బైక్‌పై దంపతులు, వారి ఇద్దరు పిల్లలు వెళుతుండగా ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో తండ్రి, కొడుకు మృతిచెందారు. వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో ఈ ఘటన జరిగింది.


ఎల్కతుర్తి మండలంలోని దామెర గ్రామానికి చెందిన కడారి సదానందం (38) భార్య స్వర్ణలత, కుమారుడు కమల్‌ (7), కుమార్తె చిన్నుతో కలిసి  బైక్‌పై ధర్మసాగర్‌ మండలం సోమదేవరపల్లి గ్రామానికి బయలుదేరారు. ఖాజీపేట వైపునకు వెళ్తున్న హన్మకొండ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వీరు ప్రయాణిస్తున్న బైక్‌ను దామెర శివారులో ఢీ కొట్టింది. ఈ ఘటనలో సదానందం, కమల్‌ బస్సు వెనుక టైరు కింద పడి అక్కడిక్కడే మృతి చెందారు. స్వర్ణలత, చిన్నూ ప్రాణాలతో బయటపడ్డారు.  


Updated Date - 2020-12-27T07:27:47+05:30 IST