క్రిమినల్ కేసు ఎదుర్కొంటున్న..ప్రభుత్వ ఉద్యోగి సస్పెన్షన్ సబబే: హైకోర్టు
ABN , First Publish Date - 2020-09-20T08:24:57+05:30 IST
శాఖాపరమైన విచారణతోపాటు క్రిమినల్ కేసులో ట్రయల్ ఎదుర్కొంటున్న ప్రభుత్వ ఉద్యోగిని విధుల నుంచి సస్పెండ్ చేయడాన్ని హైకోర్టు డివిజన్ బెంచ్ సమర్థించింది. ఎఫ్‌ఐఆర్‌పై నిర్ణయం తీసుకోవాల్సింది ట్రయల్ కోర్టేనని తేల్చిచెప్పింది.

హైదరాబాద్, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): శాఖాపరమైన విచారణతోపాటు క్రిమినల్ కేసులో ట్రయల్ ఎదుర్కొంటున్న ప్రభుత్వ ఉద్యోగిని విధుల నుంచి సస్పెండ్ చేయడాన్ని హైకోర్టు డివిజన్ బెంచ్ సమర్థించింది. ఎఫ్‌ఐఆర్‌పై నిర్ణయం తీసుకోవాల్సింది ట్రయల్ కోర్టేనని తేల్చిచెప్పింది. 14సంవత్సరాల క్రితం జరిగిన ఘటనపై తాజాగా సస్పెండ్ చేయాడాన్ని సవాల్ చేస్తూ జగిత్యాల జిల్లాలో డిప్యూటీ తహసీల్దార్‌గా పనిచేస్నున్న పి.నర్సింహాచారి హై కోర్టును ఆశ్రయించారు.
హైకోర్టు సింగిల్ బెంచ్ ఇంతకు ముందు పిటిషన్‌ను కొట్టివేసింది. నర్సింహాచారి డివిజన్ బెంచ్‌కు అప్పీలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, జస్టిస్ టి.వినోద్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం విచారించింది. పిటిషనర్ 1987లో విలేజ్ అసిస్టెంట్‌గా విధుల్లో చేరారని, తర్వాత సీనియర్ అసిస్టెంట్‌గా పదోన్నతి పొందినట్లు తెలిపారు.
2003-2006లో విలేజ్ రెవెన్యూ ఆఫీసర్/పంచాయతీ కార్యదర్శిగా బొమ్మకల్ గ్రామ పంచాయతీలో విధులు నిర్వహించారు. 2017 లో డిప్యూటీ తహసీల్దార్‌గా పదోన్నతిపై జగిత్యాల జిల్లాకు బదిలీ అయ్యారు. 2020 జూలై 31న పిటిషనర్‌ను సస్పెండ్ చేశారు. ఆయన సస్పెన్షన్ ఆదేశాలను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. వాదనలు విన్న ధర్మాసనం.. తెలంగాణ సివిల్ సర్వీసు నిబంధనలు-1991లోని రూల్ 8 ప్రకారం ఉద్యోగిపై క్రిమినల్ కేసు లేదా శాఖాపరమైన విచారణ జరుగుతున్నప్పుడు సస్పెండ్ చేయవచ్చని స్పష్టం చేసింది.