పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తుకు గడువు పెంపు
ABN , First Publish Date - 2020-11-25T07:15:35+05:30 IST
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో అభ్యర్థులు ఖరారైన నేపథ్యంలో పోస్టల్ బ్యాలెట్ పత్రాల ముద్రణ మొదలైంది. పోస్టల్ బ్యాలెట్ల దరఖాస్తుకు మూడు రోజులు గడువు పెంచారు.

ఈ నెల 27 వరకు అవకాశం.. జీహెచ్‌ఎంసీ లేఖపై స్పందించిన ఎస్‌ఈసీ
హైదరాబాద్ సిటీ, నవంబరు 24(ఆంధ్రజ్యోతి): జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో అభ్యర్థులు ఖరారైన నేపథ్యంలో పోస్టల్ బ్యాలెట్ పత్రాల ముద్రణ మొదలైంది. పోస్టల్ బ్యాలెట్ల దరఖాస్తుకు మూడు రోజులు గడువు పెంచారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ నెల 27 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. ఇదే సమయంలో రిటర్నింగ్ అధికారులు పోస్టల్ బ్యాలెట్ పంపే గడువును మూడు రోజులకు తగ్గిస్తూ సవరణ ఉత్తర్వులు విడుదల చేశారు. పోలింగ్ తేదీకి ఏడు రోజుల ముందు వరకు పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకోవాలని గతంలో ప్రకటించారు.
దీనిప్రకారం ఈ నెల 24 ఆఖరు తేదీ. అయితే, ఎన్నికల నోటిఫికేషన్ నుంచి పోలింగ్ మధ్య తక్కువ వ్యవధి ఉండడం.. పోస్టల్ బ్యాలెట్ల నమోదులో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉన్నందున మరింత గడువు ఇవ్వాలని జీహెచ్‌ఎంసీ.. ఎన్నికల సంఘాన్ని కోరింది. కాగా, సర్వీస్ ఓటర్లతో పాటు ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బంది, 80 ఏళ్లు దాటిన వృద్ధులు, దివ్యాంగులు, కొవిడ్-19 పాజిటివ్ వ్యక్తులకు పోస్టల్ బ్యాలెట్ అవకాశం కల్పించాలని నిర్ణయించారు. వీరు ధ్రువీకరణ పత్రాలు జత చేసి ఆన్‌లైన్ ద్వారప్రైవేటులోనూ ఎన్నికల సంఘం వెబ్‌సైట్ www.tsec.gov.inలో ఈ నెల 27 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.