బండ్లన్నీ తుక్కుతుక్కు..

ABN , First Publish Date - 2020-12-14T04:19:14+05:30 IST

వివిధ కేసుల్లో పట్టుబడిన వాహనాలు తుప్పుపట్టి పోతున్నాయి. ఎక్సైజ్‌శాఖ అధికారులు వాహనాల వేలం నిర్వహించడంలో అలసత్వం ప్రదర్శిస్తుండడంతో అవి ఎందుకూ పనికిరాకుండా పోతున్నాయి.

బండ్లన్నీ తుక్కుతుక్కు..
నర్సంపేట ఎక్సైజ్‌ కార్యాలయంలో తుప్పుపడుతున్న వాహనాలు

బండ్లన్నీ తుక్కుతుక్కు..

ఎక్సైజ్‌ కార్యాలయాల్లో పేరుకు పోతున్న వాహనాలు

వేలం వేయడంలో ఉన్నతాధికారుల నిర్లక్ష్యం

ఆవరణలో తుప్పుపడుతున్న వాహనాలు

సంగెం: 

వివిధ కేసుల్లో పట్టుబడిన వాహనాలు తుప్పుపట్టి పోతున్నాయి. ఎక్సైజ్‌శాఖ అధికారులు వాహనాల వేలం నిర్వహించడంలో అలసత్వం ప్రదర్శిస్తుండడంతో అవి ఎందుకూ పనికిరాకుండా పోతున్నాయి. అంతేకాదు, వాటి వేలంతో ఆదాయం వచ్చే అవకాశమున్నా పట్టించుకున్న నాథుడే లేడు. అసలే ఇరుకు గదులు, వాటికి తోడు అద్దె భవనాల్లో కార్యాలయాలు  ఉండడంతో ఇంటి యజమానులు సైతం ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో నర్సంపేట, వర్ధన్నపేట, పరకాలలో ఎక్సైజ్‌ కార్యాలయాలు  ఉన్నాయి. గుడుంబా, బెల్లం, పటిక, గంజాయి తదితర నిషేధిత వస్తువులు రవాణా చేస్తున్న వాహనాలను సీజ్‌ చేసి ఆయా కార్యాలయాలకు తరలించారు. ఇలా స్వాధీనం చేసుకున్న వాహనాలు ఎండకు ఎండుతూ, వానకు నానుతూ తుప్పుపట్టి పోతున్నాయి. కార్యాలయాల ముందు వాహనాలు పేరుకుపోయాయి. వాహనాలను వేలం వేసేందుకు జిల్లా ఉన్నతాధికారుల అనుమతి కోరాల్సి ఉంటుంది. అనంతరం జిల్లా రవాణాశాఖ అధికారులు వాహనాల విలువను నిర్ధారిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తారు.   ఆ తర్వాత వేలం వేస్తారు. దీనిపై ఎవరూ పట్టించుకోకపోవడంతో ప్రజలు మండిపడుతున్నారు.


పేరుకుపోయిన వాహనాలు


వర్ధన్నపేట ఎక్సైజ్‌ కార్యాలయంలో బొలేరో, 4 కార్లు, 13 ఆటోలు, 34 ద్విచక్రవాహనాలు, జేసీబీ ఉన్నాయి. నర్సంపేట ఎక్సైజ్‌ పరిధిలో ఏడు కార్లు, 11ఆటోలు, 64 ద్విచక్రవాహనాలు, పరకాల పరిధిలో రెండు నాలుగు చక్రాల వాహనాలు, ఆరు ఆటోలు, 45 ద్విచక్రవాహనాలు తప్పుపట్టిపోతున్నాయి. 


వేలం ప్రక్రియ కొనసాగుతోంది...

శ్రీనివాస్‌రావు, జిల్లా ఎక్సైజ్‌ అధికారి

అబ్కారీ కార్యాలయ పరిధిలో స్వాధీనం చేసుకున్న వాహనాలను వేలం వేసేందుకు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. వేలం వేయడానికి ప్రక్రియ కొనసాగుతోంది. త్వరలో వేలం వేసి కార్యాలయాల్లో పేరుకుపోయిన వాటిని ఖాళీ చేస్తాం.
Updated Date - 2020-12-14T04:19:14+05:30 IST