ఖాళీలపై కసరత్తు!

ABN , First Publish Date - 2020-12-15T08:27:43+05:30 IST

రాష్ట్రంలో 50 వేల ఉద్యోగాలను భర్తీ చేయాలని సీఎం కేసీఆర్‌ ఆదేశాలు జారీ చేయడంతో ఉన్నతాధికారులు ఖాళీలను గుర్తించడంలో నిమగ్నమయ్యారు. ఇదే విషయమై ప్రభుత్వ ప్రధాన

ఖాళీలపై కసరత్తు!

శాఖల వారీగా జాబితాలు..

వేలకొద్దీ ఖాళీలు.. అధికారులతో సీఎస్‌ భేటీ

హైదరాబాద్‌, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో 50 వేల ఉద్యోగాలను భర్తీ చేయాలని సీఎం కేసీఆర్‌ ఆదేశాలు జారీ చేయడంతో ఉన్నతాధికారులు ఖాళీలను గుర్తించడంలో నిమగ్నమయ్యారు. ఇదే విషయమై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) సోమేశ్‌ కుమార్‌ సోమవారం ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డీజీపీ మహేందర్‌రెడ్డి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు చిత్రా రామచంద్రన్‌, శాంతికుమారి, రాణి కుముదిని, ముఖ్యకార్యదర్శులు సునీల్‌ శర్మ, రజత్‌కుమార్‌, జయేశ్‌ రంజన్‌, రవిగుప్తా తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రాథమికంగా సమాచారం మేరకు వారు ఖాళీల వివరాలను సీఎస్‌ దృష్టికి తీసుకెళ్లారు.


వైద్య ఆరోగ్య శాఖలో..

వైద్య ఆరోగ్య శాఖలో 13,496 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కరోనా నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖలో భారీగా కొలువులు వచ్చాయి. అత్యధికంగా డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ హెల్త్‌ విభాగంలో 3,635.. తెలంగాణ వైద్యవిధాన పరిషత్‌లో 4,547.. నిమ్స్‌లో 1472.. ఎంఎన్‌జే కేన్సర్‌ ఆస్పత్రిలో 254 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.


రెవెన్యూలో 2,659

రెవెన్యూ శాఖలో 2,659 ఖాళీలుండగా.. వాటిలో డిప్యూటీ కలెక్టర్లు 8, డీటీలు 114, జూనియర్‌ అసిస్టెంట్‌ 174, జూనియర్‌ స్టెనో 26, టైపిస్ట్‌ 168, డ్రైవర్‌ 90, రికార్డు అసిస్టెంట్లు 97, వీఆర్‌ఏ 1,982 కొలువులున్నాయి.


పోలీసుశాఖలో దాదాపు 20 వేలు

పోలీసుశాఖలో 20వేలకుపైగా ఖాళీలున్నాయి. అందులో సివిల్‌, ఏఆర్‌, బెటాలియన్‌ కానిస్టేబుల్‌ పోస్టులే అధికంగా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 30 వేల పోలీసు కొలువుల భర్తీకి నియామక మండలి రెండు భారీ నోటిఫికేషన్లను విడుదల చేసింది. 


పాఠశాల విద్యాశాఖలో 25 వేలు!

పాఠశాల విద్యాశాఖలో ు 25 వేల ఖాళీలుంటాయని అంచనా. ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు 17 వేలకుపైగా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఎంహెచ్‌ఆర్డీ ఇటీవల తన నివేదికలో పేర్కొంది.


3,456 మునిసిపల్‌ వార్డు ఆఫీసర్‌ పోస్టులు

రాష్ట్రంలో 3,456 మున్సిపల్‌ వార్డు ఆఫీసర్‌ పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని శాసనమండలిలో మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు. వాటిని భర్తీ చేసేందుకు మునిసిపల్‌ శాఖ చర్యలు చేపడుతోంది. నీటిపారుదల శాఖలోనూ దాదాపు 2 వేలు, ఎక్సైజ్‌ శాఖలో 159, కమర్షియల్‌ ట్యాక్స్‌ శాఖలో 365 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.


ఆమోదం తెలిపినా..

ఇప్పటికే ఆర్థికశాఖ ఆమోదం తెలిపినప్పటికీ భర్తీ కానీ పోస్టుల వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. మునిసిపల్‌ శాఖలో 2 వేల పైచిలుకు పోస్టులకు ఆర్థికశాఖ గతంలోనే ఆమోదం తెలిపింది. 119 బీసీ గురుకులాలను ఏర్పాటు చేసినా.. వాటిలో ఒక్క రెగ్యులర్‌ పోస్టునూ భర్తీ చేయలేదు.

గురుకులాల్లో 3,717 రెగ్యులర్‌, మరో 605 ఔట్‌సోర్సింగ్‌ పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ ఆమోదం తెలిపి ఏడాదిన్నరయింది. సర్వీస్‌ నిబంధనలు, జోనల్‌ విధానంలో స్పష్టత లేక ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న గ్రూప్‌-1 నియామకాల సమస్యకు పరిష్కారం లభించనున్నట్టు తెలుస్తోంది. గ్రూప్‌-1 కింద గతంలోనే 142 పోస్టులను ప్రభుత్వం నోటిఫై చేసింది. ఇప్పుడు వాటి సంఖ్య పెరగనుంది.


స్పష్టత ఏదీ?

గ్రూప్‌-1 ఉద్యోగాలు రాష్ట్ర స్థాయి పోస్టులు. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం అవి మల్టీజోన్‌ కిందకు వచ్చాయి. ఇప్పటికే గుర్తించిన పోస్టులను ఏయే జోన్ల కిందకు వస్తాయో ప్రభుత్వం పునర్విభజన చేసి టీఎ్‌సపీఎస్సీకి పంపలేదు. దానిపై స్పష్టత ఇవ్వాలని టీఎ్‌సపీఎస్సీ పలుమార్లు లేఖలు రాసింది.

అలాగే గ్రూప్‌-2 కింద 60, గ్రూప్‌ -3 కింద 400 పోస్టులూ నోటిఫై అయ్యాయి. వాటి గురించి ప్రభుత్వం వివరణ ఇవ్వలేదు. గ్రూప్‌-3 పోస్టులను మొదటిసారిగా ప్రభుత్వం విభజించింది. ఈ పోస్టులు సచివాలయం, ఇతర విభాగాల పరిధిలోనివి. వాటికి రాష్ట్రంలోని అన్ని జోన్ల అభ్యర్థులకూ అవకాశం ఇస్తారా? ఒక చార్మినార్‌ జోన్‌ వాళ్లకే పరిమితం చేస్తారా? అనేదానిపై ఇంకా స్పష్టత లేదు. 



నిరుద్యోగుల స్పందన ఏంటి?

కొలువుల ప్రకటనపై ప్రభుత్వ వర్గాల ఆరా

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ కోసం సీఎం కేసీఆర్‌ చేసిన ప్రకటనపై ప్రభుత్వంలోని ఉన్నత స్థాయి వర్గాలు నిరుద్యోగుల స్పందనను ఆరా తీస్తున్నాయి. కొలువుల కబురుకు నిరుద్యోగుల్లో సానుకూలత వ్యక్తమవుతోందా? లేదా? అనే విషయాన్ని వివిధ మార్గాల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఇందుకు నిఘా వర్గాలతోపాటు, కొందరు ప్రభుత్వ ముఖ్యులు రంగంలోకి దిగారు. ఈ సందర్భంగా కొలువుల ప్రకటనపై నిరుద్యోగుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతున్నట్లు తెలిసింది.


టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక నియామకాలు తక్కువగా జరగటం, కొన్ని నియామకాలు చివరి దశకు చేరకపోవటం, నిరుద్యోగ భృతిసహా పలు హామీలు అమలుకు నోచుకోకపోవటం వెరసి సీఎం కేసీఆర్‌ కొలువుల ప్రకటనను మెజారిటీ నిరుద్యోగులు అంతగా విశ్వసించటంలేదనే సమాచారం వారికి అందినట్లు తెలుస్తోంది. అయితే.. తాజాగా డిగ్రీ పాసైనవారి నుంచి సానుకూలత వ్యక్తమవుతున్నట్లు తేలింది.


వయోపరిమితి పెంచేనా?

తాజా ఉద్యోగాల నియామకాలకు వయోపరిమితిని పెంచాలనే డిమాండ్లు వస్తున్నాయి. నిరుద్యోగుల అభ్యర్థన మేరకు 2017లో ప్రభుత్వం పదేళ్ల మేర పొడిగించింది. 34 ఏళ్ల నుంచి 44 ఏళ్లకు పొడిగిస్తూ సడలింపు ఇచ్చింది. అలాగే, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు అదనంగా మరో 5 ఏళ్లు పొడిగించింది.

2021 మే మేరకు ఆ జీవో అమల్లో ఉంటుంది. పోలీస్‌ కొలువులకూ మూడేళ్లు వయోపరిమితి పెంచారు. 50 వేల ఖాళీలను భర్తీ చేయాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించిన నేపథ్యంలో.. వయోపరిమితిని పెంచాలని నిరుద్యోగులు డిమాండ్‌ చేస్తున్నారు.


పదోన్నతుల పెండింగ్‌..

రాష్ట్రంలో ఉద్యోగ పదోన్నతులు ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయి. ప్రమోషన్లు ఇస్తే ఖాళీలు ఇంకా పెరిగే అవకాశాలున్నాయని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. ఉదాహరణకు డిప్యూటీ కలెక్టర్ల పదోన్నతుల వ్యవహారం రెండున్నరేళ్ల నుంచి పెండింగ్‌లో ఉంది. 2018 ఫిబ్రవరి 12న 33 మందికి స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతులు ఇవ్వడానికి సీఎం కేసీఆర్‌ ఆమోదముద్ర వేశారు.


అప్పట్లో కేవలం 20 మందికి మాత్రమే ప్రమోషన్లు ఇచ్చారు. మిగిలిన 13 మందీ పదోన్నతుల కోసం సచివాలయం చుట్టూ రెండున్నరేళ్లుగా తిరుగుతున్నారు. రెండు నెలల క్రితం సీఎం కేసీఆర్‌తో సమావేశమైనప్పుడు.. వీలైనంత త్వరగా పదోన్నతులు ఇవ్వడంపై ఆయన నుంచి రెవెన్యూ సంఘాలు స్పష్టమైనహామీని పొందినా.. అమలుకు నోచుకోలేదు.


ఉద్యోగాల భర్తీకి ప్రత్యేక సెల్‌

రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీని వేగవంతం చేసేందుకు ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేస్తామని సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ తెలిపారు. అవసరమైన మార్పులు, సంస్కరణలను తీసుకువచ్చి.. నియామక ప్రక్రియను వేగవంతం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన వెల్లడించారు. 


Updated Date - 2020-12-15T08:27:43+05:30 IST