దుబ్బాక ఫలితంపై గల్ఫ్‌లోనూ ఉత్కంఠ

ABN , First Publish Date - 2020-11-13T09:24:55+05:30 IST

స్వదేశంలోనే కాదు, గల్ఫ్‌ దేశాల్లోని తెలంగాణ ప్రవాసీల్లో కూడా దుబ్బాక ఉప ఎన్నిక ఫలితాలు నరాలు తెగే ఉత్కంఠ

దుబ్బాక ఫలితంపై గల్ఫ్‌లోనూ ఉత్కంఠ

రఘునందన్‌ గెలుపుపై హర్షం.. మార్పు కోరుతున్నట్లు వెల్లడి

 (గల్ఫ్‌ నుంచి ఆంధ్రజ్యోతి ప్రతినిధి) 

స్వదేశంలోనే కాదు, గల్ఫ్‌ దేశాల్లోని తెలంగాణ ప్రవాసీల్లో కూడా దుబ్బాక ఉప ఎన్నిక ఫలితాలు నరాలు తెగే ఉత్కంఠ రేపాయి. రాజకీయ పార్టీలకు అతీతంగా చాలామంది ఈ ఎన్నికల ఫలితాలను ఆసక్తిగా గమనించారు. దుబ్బాక నియోజకవర్గానికి చెందిన ప్రవాసీలు పెద్ద సంఖ్యలో గల్ఫ్‌ దేశాల్లో నివసిస్తున్నారు. వారందరూ ఎన్నికల ఫలితాలపై ప్రత్యేక శ్రద్ధ చూపారు. 


పొరుగున ఉన్న నియోజకవర్గాలతో పోలిస్తే తమ నియోజకవర్గం ఏమాత్రం అభివృద్ధికి నోచుకోలేదని వారు తెలిపారు. దుబాయిలో పనిచేసే చేగుంట మండలానికి చెందిన రాజనర్సు.. తాము మార్పును కోరుకుంటున్నామని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌ తమ నియోజకవర్గానికి చేసిందేమీ లేదని రాస్‌ అల్‌ ఖైమాలో పనిచేసే దుబ్బాక మండల వాసి మహేశ్‌ వాపోయారు. నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తారన్న నమ్మకంతోనే బీజేపీ అభ్యర్థి రఘునందన్‌ను ప్రజలు గెలిపించారని అన్నారు.


అబుధాబిలో పనిచేసే పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన కర్రోల సందీప్‌ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఖతర్‌లో పనిచేసే దుబ్బాకవాసి తిరుపతిరెడ్డి, ఒమన్‌లో పనిచేసే రమేశ్‌, జెద్దాలో పనిచేసే  తొగుట వాసి విజయ్‌కుమార్‌ రఘునందన్‌ గెలుపుపై హర్షం వెలిబుచ్చారు.

దుబ్బాక అభివృద్ధి చెందితే ఆ నియోజకవర్గానికి చెందిన యువత ఎడారి దేశాల్లో కూలి పనులకు ఎందుకు వస్తారని బీజేపీ గల్ఫ్‌ విభాగం అధ్యక్షుడు నరేంద్ర పన్నీరు ప్రశ్నించారు. కేసీఆర్‌ పతనానికి దుబ్బాక ఎన్నికల ఫలితం నాంది అని వ్యాఖ్యానించారు.      


Updated Date - 2020-11-13T09:24:55+05:30 IST