పరీక్షలు.. ఫలితాలు.. ప్రయాసే..!

ABN , First Publish Date - 2020-06-23T09:11:35+05:30 IST

రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. కేసులు పూటపూటకూ కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. కరోనా అనుమానితులు పరీక్షల కోసం పెద్ద సంఖ్యలో రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. కేసులు

పరీక్షలు.. ఫలితాలు.. ప్రయాసే..!

  • పీహెచ్‌సీ వైద్యుడు రాస్తేనే నమూనాల సేకరణ
  • ఫలితాల కోసం నానా తిప్పలు.. నెగెటివ్‌ చెప్పరు 
  • పాజిటివ్‌ వచ్చినా 2 రోజుల తర్వాతే చెబుతారు!


హైదరాబాద్‌, జూన్‌ 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. కేసులు పూటపూటకూ కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. కరోనా అనుమానితులు పరీక్షల కోసం పెద్ద సంఖ్యలో రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. కేసులు పూటపూటకూ కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. కరోనా అనుమానితులు పరీక్షల కోసం పెద్ద సంఖ్యలో సర్కారీ దవాఖానాల చుట్టూ తిరుగుతున్నారు. ఈ క్రమంలో పరీక్షలు, ఫలితాలు ప్రహసనంలా మారాయి. సామాన్యులకు పరీక్షలు చేయించుకోవడమే పెద్ద ‘పరీక్ష’గా మారుతోంది. ఇక నమూనాలిచ్చిన తర్వాత వాటి పలితాల కోసం మరింత ఉత్కంఠగా ఎదురు చూడాల్సి వస్తోంది. 48 గంటలు గడిస్తే కానీ ఫలితాలు రావడం లేదు. కరోనా అనుమానిత లక్షణాలు తీవ్రంగా ఉంటే తప్ప ప్రభుత్వాస్పత్రుల్లో టెస్టులు చేయడం లేదు. జ్వరం, దగ్గు, గొంతునొప్పి ఉండి జిల్లా ఆస్పత్రులకు వెళితే వారికి టెస్టులు చేయడం లేదు. మూడు రకాల ప్రశ్నలు అడుగుతున్నారు. పాజిటివ్‌ వ్యక్తితో కాంటాక్టు అయ్యారా? మీ ఇంట్లో వైరస్‌ సోకినవారున్నారా? మీరు రెడ్‌జోన్‌లో ఉన్నారా? అని అడుగుతున్నారు. వీటికి ‘లేదు’ అన్న సమాధానమిస్తే చాలు.. వెంటనే అజిత్రోమైసిన్‌ 500 ఎంజీ, పారాసిటమాల్‌ 650 ఎంజీ మాత్రలు రాసి పంపుతున్నారు. చేతిపై 14 రోజుల క్వారంటైన్‌ ముద్ర వేస్తున్నారు. నమూనాలు మాత్రం సేకరించడం లేదు. 


ఇదీ పరిస్థితి..

వరంగల్‌కు చెందిన ఓ వ్యక్తి తీవ్రమైన గొంతునొప్పి, జ్వరంతో కరోనా కాల్‌ సెంటర్‌ 104కు ఫోన్‌ చేస్తే వివరాలు తీసుకొని స్థానిక పీహెచ్‌సీకి వెళ్లమన్నారు. అక్కడికి వెళితే ‘ఈ రోజు సమయం దాటి పోయింది. రేపు రా’ అన్నారు. మళ్లీ కాల్‌సెంటర్‌కు ఫోన్‌ చేస్తే.. నేరుగా ఎంజీఎంకు వెళితే పరీక్షలు చేయరని, లోకల్‌ పీహెచ్‌సీ వైద్యులు రాస్తేనే టెస్టులు చేస్తారని సమాధానం చెప్పారు. అప్పటికే తన పరిస్థితి బాగా లేదని, అతను నేరుగా ఎంజీఎంకు వెళితే.. అక్కడ 3 ప్రశ్నలడిగి ట్యాబ్లెట్లు రాసి చేతిపై ముద్రవేసి పంపారు. ఆ మాత్రలు కూడా అక్కడి డిస్పెన్సరీలో లేవు. ఇక చెమటకు క్వారంటైన్‌ ముద్ర కాస్తా చెరిగిపోయింది. లక్షణాలున్న వారికి కూడా నమూనాలు తీయడం లేదనడానికి ఇదే ఉదాహరణ. ప్రస్తుతం వైరస్‌ ఎలా సోకుతోందో చెప్పలేని పరిస్థితి. ఇటువంటి సమయంలో టెస్టులు చేయకుండా, ఇళ్ల దగ్గరే ఉండమని చెప్పడం గమనార్హం. 


48 గంటలు ఆగాల్సిందే..!

సర్కారీ దవాఖానాల్లో నమూనాలు ఇస్తే.. వాటి ఫలితాల కోసం కనీసం 48 గంటలు ఆగాల్సిందే. అది కూడా పాజిటివ్‌ వస్తేనే రోగికి సమాచారం ఇస్తున్నారు. నెగెటివ్‌ వస్తే ఆ సమాచారమే ఉండడం లేదు. పాజిటివ్‌ వచ్చిన రోగికి పోలీసులు ఫోన్‌ చేసేవరకు విషయం తెలియడం లేదు. నమూనాలు తీసే సమయంలోనే నెగెటివ్‌ వస్తే ఎటువంటి సమాచారం ఇవ్వరన్న సంగతి వారికి చెబితే రెండు రోజుల తర్వాత కాస్త కుదుట పడతారు.  టోలీచౌకీకి చెందిన షరీఫ్‌.. కరోనా లక్షణాలున్నాయని శనివారం నల్లకుంటలోని ఫీవర్‌ ఆస్పత్రికి వెళితే ఉదయం 11 గంటలకు నమూనాలు తీశారు. సోమవారం సాయంత్రం వరకు ఎటువంటి సమాచారం లేకపోవడంతో నేరుగా ఆస్పత్రికి వెళ్లగా.. నెగెటివ్‌ వచ్చిందని రిపోర్టు కాపీ ఇచ్చారు. ఈ రెండు రోజుల పాటు తాను తీవ్ర మానసిక ఆందోళనకు గురైనట్లు షరీఫ్‌ తెలిపారు. పాజిటివ్‌ వచ్చిన వారికి వెంటనే సమాచారం ఇవ్వకపోవడంతో వారి ద్వారా  ఇతరులకు వైరస్‌ సోకుతోంది. ఇక మరికొందరి విషయంలో అయితే ఏకంగా ఇచ్చిన శాంపిల్స్‌ మిస్‌ అవుతుండడం గమనార్హం. 


పలుకుబడి ఉంటేనే..

టెస్టుల కోసం సాధారణ ప్రజలకు చుక్కలు చూపిస్తోన్న వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది.. పలుకుబడి ఉన్నవారికి మాత్రం వెంటనే పరీక్షలు చేసేస్తున్నారు. మంత్రి ఈటల కార్యాలయం నుంచి ఫోన్‌ వస్తే చాలు  సిబ్బంది పరుగులు పెట్టుకుంటూ వెళ్లి ఇళ్లు, కార్యాలయాల వద్దే నమూనాలు సేకరిస్తున్నారు. నాలుగు రోజుల క్రితం మంత్రి ఫోన్‌ చేశారని.. ఓ ప్రైవేటు ఆఫీసులో నమూనాలు తీసి, అదే రోజు రిజల్ట్‌ ఇచ్చేశారు. సామాన్యులకు మాత్రం పరీక్షలు చేయించుకోవాలంటే పెద్ద సవాలే.

Updated Date - 2020-06-23T09:11:35+05:30 IST