ఫైనల్ ఇయర్ విద్యార్థులకు పరీక్షలు రద్దు!
ABN , First Publish Date - 2020-06-25T08:07:42+05:30 IST
కరోనా కేసుల నేపథ్యంలో దేశంలోని విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యాసంస్థలు చివరి సంవత్సరం విద్యార్థులకు జులైలో జరగవలసిన పరీక్షలను రద్దు చేసే అవకాశం ఉంది.

కరోనా కేసుల నేపథ్యంలో దేశంలోని విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యాసంస్థలు చివరి సంవత్సరం విద్యార్థులకు జులైలో జరగవలసిన పరీక్షలను రద్దు చేసే అవకాశం ఉంది. కొత్త విద్యా సంవత్సరం అక్టోబర్‌లో ప్రారంభమయ్యే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. చివరి సంవత్సరం పరీక్షలు రద్దు చేయమని ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు సిఫారసు చేశాయి. కేంద్ర మంత్రి రమేష్ పోఖ్రియాల్ చేసిన ప్రకటనతో విద్యాసంవత్సరం ప్రారంభంలో జాప్యం తప్పదనిపిస్తోంది. విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని గతంలో జారీచేసిన మార్గదర్శకాలను పునఃసమీక్షించాలని ఆయన యూజీసీకి సూచించారు. 2020-21 విద్యాసంవత్సరం ప్రారంభానికి సంబంధించి చివరిసారిగా యూజీసీ ఏప్రిల్-29న మార్గదర్శకాలు జారీచేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్ చదువుతున్న వారికి ఆగస్టు-1 నుంచి, ప్రథమ సంవత్సరం విద్యార్థులకు సెప్టెంబర్-1 నుంచి తరగతులు నిర్వహించుకోవచ్చని యూజీసీ పేర్కొంది. దీనిప్రకారం ఉన్నత విద్యామండలి డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్ ద్వితీయ, తృతీయ, చివరి సంవత్సరం తరగతులు ఆగస్టు-15 నుంచి, ప్రథమ సంవత్సరం విద్యార్థులకు సెప్టెంబరు-1 నుంచి ప్రారంభించాలని భావించింది. ఈ తరుణంలో కేంద్రమంత్రి ప్రకటనతో మళ్లీ జాప్యం జరగవచ్చని విద్యాశాఖలో చర్చ ప్రారంభమైంది.