అందరూ ఉన్నా చివరికి అనాథలై!

ABN , First Publish Date - 2020-04-07T09:46:45+05:30 IST

మనుషుల ప్రాణాలు తీస్తున్న కరోనా మహమ్మారి.. ప్రాణాలు కోల్పోయిన వారినీ వదలడం లేదు. ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోని క్రాంతినగర్‌ కాలనీలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్న చెర్లి దశరథ్‌ పచ్చకామెర్లతో బాధపడుతూ

అందరూ ఉన్నా చివరికి అనాథలై!

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): మనుషుల ప్రాణాలు తీస్తున్న కరోనా మహమ్మారి.. ప్రాణాలు కోల్పోయిన వారినీ వదలడం లేదు. ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోని క్రాంతినగర్‌ కాలనీలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్న చెర్లి దశరథ్‌ పచ్చకామెర్లతో బాధపడుతూ ఆదివారం ఆదిలాబాద్‌ రిమ్స్‌లో మృతి చెందాడు. అతడు కరోనాతోనే మృతి చెందాడంటూ కాలనీలోకి మృతదేహాన్ని తీసుకురాకుండా స్థానికులు అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న బెస్ట్‌ ఫ్రెండ్స్‌ హెల్ప్‌ వెల్ఫేర్‌ సొసైటీ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్‌ మండలం పొట్లపహాడ్‌కు చెందిన సోమిరెడ్డి సీతారాంరెడ్డి(54) ఓ ప్రైవేట్‌ ఆస్పతిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. మనస్పర్థల కారణంగా అతడి భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి 20 ఏళ్లుగా వేరుగా ఉంటోంది. వారికి సమాచారం ఇచ్చినా రాకపోవడంతో అతడి బాల్యమిత్రులే అంత్యక్రియలు పూర్తి చేశారు.


వైద్యం అందక వృద్ధురాలి మృతి

సకాలంలో వైద్యం అందక రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగికి చెందిన వృద్ధురాలు మృతి చెందింది. బాసని సత్తవ్వ(62)కు ఆదివారం రాత్రి గుండె పోటు వచ్చింది. కుటుంబ సభ్యులు వెంటనే ప్రైవేట్‌ వాహనంలో జిల్లా కేంద్రంలోని సివిల్‌ ఆస్పత్రికి తరలించారు. గుండెకు సంబంధించిన వైద్యులు లేరని, కరీంనగర్‌ తీసుకెళ్లాలని అక్కడి వైద్యసిబ్బంది సూచించారు. కరీంనగర్‌లో కరోనా ప్రభావంతో ఆయా ఆస్పత్రుల సిబ్బంది స్పందించలేదు. చివరకు హైదరాబాద్‌ తీసుకెళ్తున్న క్రమంలో సత్తవ్వ ప్రాణాలు కోల్పోయింది.

Read more