‘ఉద్యోగుల వేతనాల పెంపు నిర్ణయం హర్షణీయం’
ABN , First Publish Date - 2020-12-30T02:23:17+05:30 IST
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు పెంచడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయం పట్ల తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్, ట్రెసా హర్షం వ్యక్తం చేసింది. గత పీఆర్సిలో 42 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చినట్టుగా ఇప్పుడు కూడా పెరిగిన ఖర్చులను దృష్టిలో ఉంచుకొని మెరుగైన ఫిట్‌మెంట్ ఇస్తారని ఆశిస్తున్నామని ట్రెసా అధ్యక్ష, కార్యదర్శులు వంగ రవీందర్ రెడ్డి, గౌతమ్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాల అమలుకు, భూ సమస్యలు పరిష్కరించుటకు నిరంతరం కృషి చేస్తున్న రెవెన్యూ ఉద్యోగులకు ప్రత్యేక స్కేల్ అమలు చేయాలని ప్రభుత్వానికి రెవెన్యూ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది.
కేసీఆర్ న్యూ ఇయర్ గిఫ్ట్ ఇదీ..
కాగా.. నూతన సంవత్సర కానుకగా రాష్ట్రంలోని అన్నిరకాల ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు పెంచాలని, ఉద్యోగ విరమణ వయస్సును పెంచాలని, అన్నిశాఖల్లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభించాలని కేసీఆర్ నిర్ణయించారు. ప్రభుత్వ ఉద్యోగులు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఉద్యోగులు, వర్క్ చార్జుడ్ ఉద్యోగులు, డెయిలీ వైజ్ ఉద్యోగులు, ఫుల్ టైమ్ కాంటింజెంట్ ఉద్యోగులు, పార్ట్ టైమ్ కాంటింజెంట్ ఉద్యోగులు, హోంగార్డులు, అంగన్ వాడీ వర్కర్లు, కాంట్రాక్టు ఉద్యోగులు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, ఆశ వర్కర్లు, విద్యా వలంటీర్లు, సెర్ఫ్ ఉద్యోగులు, గౌరవ వేతనాలు అందుకుంటున్న వారు, పెన్షనర్లు ఇలా అందరికీ ప్రయోజనం కలిగేలా వేతనాల పెంపు చేస్తామని సీఎం ప్రకటించారు. అన్నిరకాల ఉద్యోగుల కలిపి తెలంగాణలో 9,36,976 మంది ఉంటారని, అందరికీ వేతనాల పెంపు వర్తిస్తుందని సీఎం చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులతోపాటు తక్కువ వేతనాలు కలిగిన ఉద్యోగులున్న ఆర్టీసీలో కూడా వేతనాలను పెంచాలని నిర్ణయించినట్లు సీఎం తెలిపారు. అవసరమైతే వేతనాల పెంపువల్ల ఆర్టీసీపై పడే భారాన్ని ప్రభుత్వం భరిస్తుందని సీఎం కేసీఆర్ ప్రకటించారు.
